Published : 13 Aug 2022 02:18 IST

పారిశ్రామికోత్పత్తి జోరు

దిల్లీ: వరుసగా రెండో నెలా దేశ పారిశ్రామికోత్పత్తి రెండంకెల వృద్ధి సాధించింది. జూన్‌లో 12.3 శాతంగా నమోదైంది. తయారీ, విద్యుత్‌, గనుల రంగాలు మంచి పనితీరు కనబరచడం ఇందుకు దోహదపడింది. ఈ ఏడాది మేలో పారిశ్రామికోత్పత్తి 19.6 శాతంగా, ఏప్రిల్‌లో 6.7 శాతంగా నమోదయ్యాయి. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా పరిశ్రమల ఉత్పత్తిని లెక్కిస్తారు. 2021 జూన్‌లో ఐఐపీ 13.8 శాతం పెరిగింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వివరాల ప్రకారం..
* జూన్‌లో తయారీ రంగం 12.5 శాతం వృద్ధి నమోదుచేసింది. 2021 ఇదే నెలలో ఇది 13.2 శాతంగా ఉంది. విద్యుత్‌ రంగ వృద్ధి 8.3 శాతం నుంచి 16.4 శాతానికి పెరిగింది. గనుల రంగ వృద్ధి 23.1 శాతం నుంచి 7.5 శాతానికి చేరింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌లో ఐఐపీ 12.7 శాతం పెరిగింది. 2021-22 ఇదే సమయంలో వృద్ధి 44.4 శాతంగా ఉంది. కొవిడ్‌ తొలిదశ పరిణామాలతో 2020 ఏప్రిల్‌-జూన్‌ పారిశ్రామికోత్పత్తి అతి తక్కువగా ఉన్నందున, 2021లో అధికంగా నమోదైంది. గతేడాది ప్రాతిపదిక అధికంగా ఉన్నందున, ఈసారి వృద్ధి పరిమితమైనట్లు కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
* యంత్ర పరికరాల ఉత్పత్తి 27.3 శాతం నుంచి 26.1 శాతానికి చేరింది. మన్నికైన వినిమయ వస్తువులు 23.8 శాతం పెరిగాయి.
* ప్రాథమిక వస్తువులు, మన్నికేతతర వస్తువుల రంగాలు వరుసగా 13.7%, 2.9% మేర రాణించాయి. కొవిడ్‌-19 రెండో దశ కారణంగా ప్రస్తుత గణాంకాలను గతేడాదితో పోల్చలేమని మంత్రిత్వ శాఖ తెలిపింది.


రికార్డు స్థాయికి వాణిజ్య లోటు

దిల్లీ: దేశంలోకి దిగుమతుల బిల్లు భారీగా పెరగ్గా, మన ఎగుమతులు స్వల్పంగానే పెరగడంతో ఏడాది క్రితంతో పోలిస్తే జులైలో వాణిజ్య లోటు దాదాపు మూడింతలైంది. ముడి చమురు దిగుమతి బిల్లు 70 శాతం పెరగడం ఇందుకు నేపథ్యం. ఏడాది క్రితంతో పోలిస్తే జులైలో ఎగుమతులు 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు 43.61 శాతం అధికమై 66.27 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. దీంతో వాణిజ్య లోటు 30 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,38,500 కోట్ల)కు చేరింది. జులై 2021లో ఇది 10.63 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.84,500 కోట్లు) మాత్రమే. గత నెలలో చమురు, పెట్రోలియం దిగుమతులు బిల్లు 70.4% పెరిగి 21.13 బి. డాలర్లకు చేరింది. బొగ్గు, కోక్‌, బ్రికెట్ల బిల్లూ రెట్టింపైంది. ఇంజినీరింగ్‌ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాభరణాల, ఔషధాలు, ఔషధ ఎగుమతుల్లో క్షీణత నమోదైంది.
4 నెలల్లో.. 100 బి. డాలర్లకు వాణిజ్య లోటు: 2022-23 ఏప్రిల్‌-జులై మొత్తం చూస్తే ఎగుమతులు 20.13 శాతం వృద్ధి చెంది 157.44 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దిగుమతులు సైతం 48.12 శాతం హెచ్చి 256.43 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 98.99 బి. డాలర్లు అయింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని