Published : 13 Aug 2022 02:18 IST

చమురు, లోహ షేర్లు మెరిశాయ్‌

సమీక్ష

చమురు-గ్యాస్‌, లోహ, విద్యుత్‌ షేర్లు రాణించడంతో సూచీల లాభాలు కొనసాగాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు ఇందుకు మద్దతుగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు తగ్గి 79.66 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 0.40 శాతం పెరిగి 100 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌, టోక్యో, సియోల్‌ లాభపడగా, షాంఘై నష్టపోయింది. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌ ఉదయం 59,235.98 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై, 59,113.01 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. దిగువ స్థాయిల్లో కొనుగోళ్లతో కోలుకున్న సూచీ లాభాల్లోకి వచ్చి 59,538.08 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 130.18 పాయింట్ల లాభంతో 59,462.78 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 39.15 పాయింట్లు పెరిగి 17,698.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,597.85- 17,724.65 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 1074 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు చొప్పున లాభాలు నమోదు చేశాయి.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ 3.26%, టాటా స్టీల్‌ 3.25%, పవర్‌గ్రిడ్‌ 2.24%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.80%, రిలయన్స్‌ 1.64%, ఎస్‌బీఐ 1.16%, ఐటీసీ       0.69% చొప్పున మెరిశాయి. ఇన్ఫోసిస్‌ 1.56%, మారుతీ 1.35%, ఎల్‌ అండ్‌ టీ 1.25%, టెక్‌ మహీంద్రా 1.02%, నెస్లే 0.82% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. విద్యుత్‌, చమురు-గ్యాస్‌, లోహ, ఇంధన 2.47% వరకు పెరిగాయి. ఐటీ, ఆరోగ్య సంరక్షణ, వాహన మాత్రం డీలాపడ్డాయి.  
* పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ఎండీ, సీఈఓగా విజయ్‌ శేఖర్‌ శర్మ పునర్నియామకానికి వ్యతిరేకంగా ఇన్వెస్టర్‌ సలహా సంస్థ ఐఐఏఎస్‌ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో పేటీఎం షేరు 4.65 శాతం తగ్గి రూ.787.15 వద్ద ముగిసింది.
* డాబర్‌ ఇండియా ఛైర్మన్‌ పదవికి అమిత్‌ బర్మన్‌ రాజీనామా చేశారు. కంపెనీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఆయన కొనసాగనున్నారు. ప్రస్తుతం నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్న మోహిత్‌ బర్మన్‌ను అయిదేళ్ల పాటు బోర్డు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నియమించారు.  
నేటి బోర్డు సమావేశాలు: ఫోర్స్‌ మోటార్స్‌ * ఎస్‌ఎమ్‌ఎస్‌ ఫార్మా * హిందుస్థాన్‌ కాపర్‌ * హనీవెల్‌ * జైన్‌ ఇరిగేషన్‌ * జేకే సిమెంట్‌ * కైటెక్స్‌ * రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌  * జువారీ ఇండస్ట్రీస్‌


టాటా ఎలెక్సీ జీ రూ.10,000

ఏడాదిలో 133% రాణించిన షేరు

టాటా గ్రూప్‌ సంస్థ టాటా ఎలెక్సీ షేరు తొలిసారిగా రూ.10,000 మైలురాయిని అధిగమించింది. ఇంట్రాడేలో 9 శాతం లాభపడ్డ షేరు.. రూ.10,398.40 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 7.85 శాతం లాభంతో రూ.10,241.45 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో 26 శాతం రాణించిన షేరు, గత ఏడాదిలో ఏకంగా 133 శాతం దూసుకెళ్లింది. కంపెనీ జూన్‌ త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలతో పాటు బలమైన వృద్ధి అంచనాలను ప్రకటించడం సానుకూల ప్రభావం చూపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని