మూడేళ్లలో 3 లక్షల కియా సెల్టోస్‌ల విక్రయం

కియా ఇండియా మనదేశంలో ఇప్పటివరకు 3 లక్షల కియా సెల్టోస్‌ కార్లను విక్రయించింది. ఈ ఘనతను మూడేళ్ల వ్యవధిలోనే సొంతం చేసుకున్నట్లు కియా ఇండియా శుక్రవారం వెల్లడించింది.

Published : 13 Aug 2022 02:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: కియా ఇండియా మనదేశంలో ఇప్పటివరకు 3 లక్షల కియా సెల్టోస్‌ కార్లను విక్రయించింది. ఈ ఘనతను మూడేళ్ల వ్యవధిలోనే సొంతం చేసుకున్నట్లు కియా ఇండియా శుక్రవారం వెల్లడించింది. కియా ఇండియా విక్రయాల్లో సెల్టోస్‌ కార్ల వాటాయే 60 శాతం. ఈ కారును 91 దేశాలకు 1.03 లక్షల మేర ఎగుమతి చేసినట్లు కియా ఇండియా తెలియజేసింది. మనదేశంలో కియా ఇండియా విడుదల చేసిన మొదటి మోడల్‌ ‘సెల్టోస్‌’. ఈ కారు వల్ల భారతదేశంలో తమ ప్రయాణం సజావుగా సాగుతోందని, దేశీయ వాహన రంగంలో ఎన్నో మార్పులకు ఈ కారు కారణమైందని కియా ఇండియా ముఖ్య విక్రయాల అధికారి యుంగ్‌ సిక్‌ సోన్‌ అన్నారు.


ఓఎన్‌జీసీ లాభం మూడింతలు

దిల్లీ: ఓఎన్‌జీసీ ఫలితాల్లో రాణించింది. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ స్టాండలోన్‌ నికర లాభం మూడింతలై రూ.15,205.85 కోట్ల (ఒక్కో షేరుకు రూ.12.09)కు చేరుకుంది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే మూడు నెలల్లో లాభం రూ.4,334 కోట్లు(ఒక్కో షేరుకు రూ.3.45)గా ఉంది. 2022 జనవరి-మార్చి లాభం రూ.8,859.54 కోట్లతో పోల్చినా ఇది ఎక్కువే. ఓఎన్‌జీసీ టర్నోవరు సైతం రూ.23,021.64 కోట్ల నుంచి రూ.42,320.72 కోట్లకు పెరిగింది. చమురు ఉత్పత్తి 2 శాతం పెరిగి 5.5 మిలియన్‌ టన్నులకు; గ్యాస్‌ ఉత్పత్తి 1.4% హెచ్చి 5.38 బిలియన్‌ ఘనపు మీటర్లకు చేరడం ఇందుకు దోహదం చేసింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఒక్కో బ్యారెల్‌ ముడి చమురు అమ్మకంపై కంపెనీ 108.54 డాలర్లను పొందింది. గ్యాస్‌ అమ్మకంపైనా రాబడి ఒక్కో మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌పై 1.79 డాలర్ల నుంచి 6.1 డాలర్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని