సంక్షిప్త వార్తలు

ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలోని 13 బంగారు గనులను ఈనెలలో వేలం వేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌లో 10 క్షేత్రాలుండగా, 5 క్షేత్రాలకు ఈనెల 26న, మిగలిన క్షేత్రాలకు ఈనెల 29న వేలం నిర్వహించనున్నారు. వీటిలో

Updated : 15 Aug 2022 02:20 IST

ఆంధ్రప్రదేశ్‌లోని బంగారు గనుల వేలం ఈనెలలోనే

దిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలోని 13 బంగారు గనులను ఈనెలలో వేలం వేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌లో 10 క్షేత్రాలుండగా, 5 క్షేత్రాలకు ఈనెల 26న, మిగలిన క్షేత్రాలకు ఈనెల 29న వేలం నిర్వహించనున్నారు. వీటిలో రామగిరి ఉత్తర క్షేత్రం, బొక్సంపల్లి ఉత్తర- దక్షిణ క్షేత్రాలు, జవాకుల ఏ-బీ-సీ-డీ-ఈ-ఎఫ్‌ క్షేత్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని 3 క్షేత్రాలకూ ఈ నెలలోనే వేలం నిర్వహించనున్నారు.


డాయిష్‌ బ్యాంక్‌ అన్షు జైన్‌ కన్నుమూత 

న్యూయార్క్‌: జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంక్‌ మాజీ సహ సీఈఓ, భారత సంతతికి చెందిన అన్షు జైన్‌ (59) కన్నుమూశారు. అయిదేళ్ల పాటు ఉదర సంబంధిత డ్యూడెనాల్‌ (ఆంత్రమూలం) క్యాన్సర్‌తో పోరాడిన ఆయన శనివారం మృతి చెందినట్లు డాయిష్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 2017లో ఆయన క్యాన్సర్‌ బారిన పడినట్లు గుర్తించారు. గత కొన్నేళ్లుగా లండన్‌లో నివాసం ఉంటున్న అన్షు జైన్‌ అక్కడే కన్నుమూశారు. మన దేశంలోని జయపురలో ఆయన జన్మించారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రం హానర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 1995లో డాయిష్‌ బ్యాంక్‌లో చేరిన ఆయన 2012లో సహ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.


హైదరాబాద్, ముంబయి, బెంగళూరుల్లో రూ.12,000 కోట్ల ఆస్తుల విక్రయ లక్ష్యం

స్థిరాస్తి సంస్థ ప్రెస్టీజ్‌ గ్రూప్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాలనేది లక్ష్యమని స్థిరాస్తి సంస్థ ప్రెస్టీజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సర విక్రయాలు రూ.10,382.2 కోట్ల కంటే ఈ విలువ 16 శాతం ఎక్కువని వివరించింది. ఇల్లు/ఫ్లాట్‌ కొనుగోలు చేయాలనుకునే వారు, విశ్వసనీయ సంస్థల ప్రాజెక్టులపై ఆసక్తి చూపడం పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బెంగళూరులో రూ.8,500 కోట్ల విలువైన లావాదేవీలు జరపగలమని, మిగిలిన మొత్తం హైదరాబాద్, ముంబయిల నుంచి వస్తుందని ఆశిస్తున్నట్లు ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ సీఎండీ ఇర్ఫాన్‌ రజాక్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని