LIC: మెడిక్లెయిమ్‌లోకి ఎల్‌ఐసీ!: ఛైర్మన్‌ ఎంఆర్‌కుమార్‌

మెడిక్లెయిమ్‌ సేవల్లోకి పునఃప్రవేశించేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఆసక్తిగా ఉందని సంస్థ ఛైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ చెప్పారు. అయితే నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ స్పష్టత కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. తమ దగ్గర

Updated : 15 Aug 2022 07:57 IST

స్పష్టత కోసం చూస్తున్నాం

ముంబయి: మెడిక్లెయిమ్‌ సేవల్లోకి పునఃప్రవేశించేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఆసక్తిగా ఉందని సంస్థ ఛైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ చెప్పారు. అయితే నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ స్పష్టత కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. తమ దగ్గర ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య భద్రత, గ్యారెంటీడ్‌ ఆరోగ్య సంరక్షణ పథకాలున్నట్లు గుర్తు చేశారు. దేశంలో అధికంగా అమ్ముడయ్యేవి నష్టపరిహారం ఆధారిత ఆరోగ్య బీమా పథకాలే. అయితే జీవితబీమా సంస్థలు వీటిని విక్రయించడం నిలిపేయాలని 2016లో ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. అప్పటినుంచి కేవలం స్థిర ప్రయోజనం కలిగించే ఆరోగ్య సంరక్షణ పథకాలనే జీవితబీమా సంస్థలు విక్రయిస్తున్నాయి. ‘2030 నాటికి అందరికీ ఆరోగ్యబీమా కల్పించేందుకు జీవితబీమా సంస్థలు కూడా, ఆరోగ్యబీమాలోకి ప్రవేశించాలంటూ’ ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ దేవశిష్‌ పాండా సూచించిన నేపథ్యంలో ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఇలా పేర్కొన్నారు.

* నష్టపరిహారం ఆధారిత ఆరోగ్యబీమా పథకాల కింద.. వైద్య చికిత్స కోసం వెచ్చించిన మొత్తంలో, బీమా ఎంతకు ఉంటే అంతమేరకు బీమా సంస్థలు తమ చందాదార్లకు తిరిగి చెల్లింపులు (రీ ఇంబర్స్‌మెంట్‌) చేస్తుంటాయి.

* స్థిర ప్రయోజన ఆరోగ్య సంరక్షణ పథకాల కింద.. ఒక జబ్బు చికిత్సకు ఎంతమొత్తం పరిహారం ఇస్తామని ముందుగా నిర్ణయిస్తారో, ఆ మేరకే చెల్లిస్తారు.

* దేశంలో 24.50 లక్షల మంది జీవితబీమా ఏజెంట్లు ఉంటే, సాధారణ-ఆరోగ్యబీమా పథకాలు విక్రయించే ఏజెంట్లు 3.60 లక్షల మందే ఉన్నారు. జీవిత బీమా ఏజెంట్లనూ ఆరోగ్య బీమా పథకాలు విక్రయించేందుకు అనుమతిస్తే, ఆరోగ్యబీమా ఏజెంట్ల సంఖ్య ఒక్కసారిగా 600 శాతం పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని