దేశీయ విపణిపై ఎప్పుడూ ఆశావహమే

షేరు విలువలు పెరగడం, తగ్గడం వల్ల సంపద జతచేసుకోవడం, భారీఎత్తున పోగొట్టుకోవడంలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా ఏమీ అతీతులు కారు. అయితే ‘భారత విపణిపై నేను ఆశావహంగానే ఉన్నాను’ అని మాత్రం ఆయన ఎప్పుడూ చెప్పేవారు. 

Published : 15 Aug 2022 02:22 IST

32 స్టాక్‌లు.. రూ.32,000 కోట్లు

ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడుల విలువ

షేరు విలువలు పెరగడం, తగ్గడం వల్ల సంపద జతచేసుకోవడం, భారీఎత్తున పోగొట్టుకోవడంలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా ఏమీ అతీతులు కారు. అయితే ‘భారత విపణిపై నేను ఆశావహంగానే ఉన్నాను’ అని మాత్రం ఆయన ఎప్పుడూ చెప్పేవారు. 

* 2020 మార్చికి ముందు రాకేశ్‌ పెట్టుబడుల విలువ రూ.12,554 కోట్లుగా ఉండగా, కొవిడ్‌ పరిణామాల్లో మార్కెట్ల పతనంతో ఆ ఒక్క నెలలో 33 శాతం తగ్గి రూ.8355 కోట్లకు క్షీణించింది. తదుపరి మార్కెట్లు శరవేగంగా కోలుకోగా, రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కూడా అంతకుమించిన వేగంతో, తన పోర్టుపోలియోను అభివృద్ధి చేసుకున్నారు. ఫలితంగా 2022 మార్చి ఆఖరుకు ఆయన పెట్టుబడుల విలువ 4 రెట్లు పెరిగి రూ.33,754 కోట్లకు చేరింది. జూన్‌ త్రైమాసికం ముగిసే నాటికి ఆయన ఈక్విటీ పెట్టుబడుల విలువ 25 శాతం తగ్గి సుమారు రూ.25,425 కోట్లుగా ఉంది. మళ్లీ గత నెల నుంచి స్టాక్‌ మార్కెట్‌ బాగా పుంజుకోవడంతో, శుక్రవారం మార్కెట్‌ ముగిసేసరికి, షేర్ల ధరల ప్రకారం ఆయన పోర్టుపోలియో విలువ రూ.31,834 కోట్లకు చేరిందని ట్రెండ్‌లైన్‌.కామ్‌ తెలిపింది. 32 స్టాక్‌లలో ఆయనకు వాటాలున్నాయి.

మలుపు తిప్పిన టైటన్‌ షేరు

దలాల్‌ స్ట్రీట్‌లో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తొలినాళ్లలో ట్రేడర్‌గా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. అది కూడా షార్ట్‌ సెల్లర్‌గా ఉండేవారు. 2002-03లో ఆయన టైటన్‌ కంపెనీ షేర్లను సగటున రూ.3-5 చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ షేరు రూ.2,472 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 4.49 కోట్ల షేర్లు రాకేశ్‌ పేరు మీద ఉన్నాయి. కంపెనీ మొత్తం షేర్లలో రాకేశ్, ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు కలిపి 5.1 శాతం వాటాలున్నాయి. వీటి మొత్తం విలువ 2022 జూన్‌ నాటికి రూ.11,086 కోట్లుగా ఉంది.

* రాకేశ్‌ పోర్ట్‌ఫోలియోలోని రెండో అతి పెద్ద స్టాక్‌ స్టార్‌ హెల్త్‌ అండ్‌ అల్లైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌. దంపతులిద్దరికీ కలిపి 10.07 కోట్ల షేర్లు ఈ కంపెనీలో ఉన్నాయి. వీటి విలువ రూ.8,000 కోట్లకు పైమాటే.

* వీటి తర్వాత స్థానం టాటా మోటార్స్‌దే. ఇందులో 3.62 కోట్ల షేర్లు (రూ.1,731 కోట్లు) రాకేశ్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్, క్రిసిల్‌లో వరుసగా 3.2 కోట్లు, 21.29 లక్షల షేర్లను (విలువ సుమారు రూ.899 కోట్లు, రూ.693 కోట్లు) కలిగి ఉన్నారు.

బాలీవుడ్‌ సినిమాలూ నిర్మించారు

స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడంతో పాటు రాకేశ్‌ బాలీవుడ్‌ సినిమాలను కూడా నిర్మించారు. ప్రసిద్ధ నటి శ్రీదేవి సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన ఇంగ్లిష్‌-వింగ్లిష్‌కు నిర్మాత ఆయనే.  షమితాబ్, కీఅండ్‌కా సినిమాలకూ నిర్మాతగా వ్యవహరించారు.

చివరిగా కనపడింది.. 

చౌక ధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లో 40 శాతం వాటా (రూ.300 కోట్లు) కలిగిన  రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఆ సంస్థ తొలి విమాన సర్వీస్‌ ప్రారంభోత్సంలోనే (ఈనెల 7న) ప్రజలకు చివరిసరిగా కనిపించారు. తొలి విమాన సర్వీస్‌ ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు చేరగా, ఇందులో రాకేశ్‌ ప్రయాణించారు. ఈ సందర్భంలోనే ముంబయి విమానాశ్రయంలో క్లుప్తంగా మాట్లాడారు. ‘సాధారణంగా ఒక శిశువు జన్మించడానికి 9 నెలల సమయం పడుతుంది. మా విమానయాన సంస్థను (ఆకాశ ఎయిర్‌) 12 నెలల్లో ప్రారంభించాం. ప్రపంచంలో ఎక్కడా ఒక విమానయాన సంస్థ ఆవిర్భవించిన 12 నెలల్లో సేవలకు శ్రీకారం చుట్టలేదు. మన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహకారంతోనే ఇది సాధ్యమైంద’ని రాకేశ్‌ ప్రశంసించారు.  

దాతృత్వ కార్యక్రమాల్లోనూ..

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా దాతృత్వం గురించి తరచు ప్రస్తావించారు. 2025లో తన దాతృత్వ ఫౌండేషన్‌- రేర్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌కు రూ.5000 కోట్లు బదిలీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు 2021లో ఫోర్బ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఏడాదికి 2 శాతం చొప్పున.. ఆ మొత్తం రూ.25,000 కోట్ల చేరే వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. వైద్య, విద్యా సంబంధ కార్యక్రమాలకు తోడ్పాటునిస్తున్నారు కూడా. రూ.50 కోట్ల వార్షిక విరాళం ద్వారా 2021లో ఎడెల్‌గివ్‌ హురూన్‌ ఇండియా దాతృత్వ జాబితాలో చోటుదక్కించుకున్నారు. సొమ్మును ఖర్చు చేసే ఆసక్తి లేదని, అవసరార్థులకు అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. 

వ్యక్తిగతం 

1987 ఫిబ్రవరి 22న రేఖతో రాకేశ్‌ వివాహమైంది. 2004లో ఆయనకు కుమార్తె నిషిత జన్మించారు. తదుపరి 2009లో కవల కుమారులు ఆర్యవీర్, ఆర్యమాన్‌ జన్మించారు.

* దక్షిణాది దోశ అంటే రాకేశ్‌కు ఎంతో ఇష్టం. అమితాబ్‌ బచ్చన్, వహీదా రెహ్మాన్, అమీర్‌ఖాన్‌ అంటే ఎంతో అభిమానించేవారు. 

* 2013లో సముద్రానికి అభిముఖంగా ఉండే నివాసాన్ని రూ.176 కోట్లతో కొనుగోలు చేశారు.


12-18% ప్రతిఫలం చాలు

స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల ద్వారా ఒక్కసారిగా డబ్బులు ఆర్జించవచ్చనే ఆశలు సరికాదని మదుపర్లకు రాకేశ్‌ సూచించేవారు. ఆయన ఏమనేవారంటే..

* మార్కెట్లు నాకు లాభాలు ఇచ్చి ఉండకపోతే, నేను ఇంత సంపదను సృష్టించేవాడిని కాదు. ఆర్థిక సలహాదారులు అనే వారే ఉండేవారు కాదు. పసిడి, ఆభరణాలు, స్థిరాస్తి, బ్యాంకు వడ్డీ రేట్లు, ఇతర ఆస్తుల కంటే ఈక్విటీలు ఎప్పుడూ అధిక ప్రతిఫలాన్ని అందించాయి.

* మార్కెట్లు పాఠాలు చెప్పవు. మనమే వాటిని చూసి నేర్చుకోవాలి. ఇందుకు తపన, కుతుహలం అవసరం. ఒకదశలో మూడేళ్లలో టైటన్‌ షేరు నాకు 100 శాతం లాభం ఇచ్చింది. ఆ తర్వాత మూడేళ్లలో 15-18 శాతం ప్రతిఫలమే ఇచ్చినా.. ఎందుకు అమ్మాలి అనిపించింది. 100 శాతం లాభం ఇచ్చిన తర్వాత ఇంకో షేరును వెతుక్కోవడం అంత సులభం కాదు.

* మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు అనేది ప్రత్యేకమైన ఉద్యోగం. మార్కెట్లలో పెట్టుబడుల విషయంలో కృషి, అప్రమత్తత ఉండాలి. మీరు పూర్తి స్థాయి మదుపరి కాకుంటే నిపుణుల సలహాలు తీసుకోవాలి. తక్కువ ఖర్చుకే మ్యూచువల్‌ ఫండ్‌లు ఇవి అందిస్తాయి.

* ఈక్విటీల నుంచి 12-18 శాతం కంటే ఎక్కువ ప్రతిఫలం ఆశించకండి. ఇదేమీ మహాలక్ష్మి రేస్‌ కోర్సు కాదు. క్రమానుగత పెట్టుబడుల (సిప్‌) ద్వారా మంచి లాభాలు సంపాదించవచ్చు.

* పెట్టుబడుల విషయంలో తప్పు చేస్తున్నానేమో అని భయపడకండి. అయితే మీరు తట్టుకునే స్థాయి తప్పులనే చేయండి. సాహసించడానికి భయపడితే, జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మీ సొంత నిర్ణయాలకు మీరే బాధ్యత తీసుకోండి. నేర్చుకుని ముందుకు సాగండి. 

* స్టాక్‌ మార్కెట్‌ ఉచిత సలహాలు ఆర్థిక ఆర్యోగానికి హానికరం. రుణాలు తీసుకోవడం తప్పేమీ కాదు. అయితే కొంత కాలం తర్వాత తగ్గించుకోవడానికి చూడండి.

* ట్రేడింగ్‌ అనేది ఫటాఫట్‌ వంటిది. స్వల్పకాల ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం ఓపిక చాలా అవసరం. అదే మీకు ప్రతిఫలాన్ని అందిస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని