బిగ్‌ బుల్‌ ఇకలేరు

స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో ‘బిగ్‌ బుల్‌’గా ప్రసిద్ధిగాంచిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (62) ఆదివారం ఉదయం హఠాత్తుగా తుదిశ్వాస విడిచారు. భారత విపణిపై అత్యంత విశ్వాసంతో ఉండే రాకేశ్‌, తన

Updated : 15 Aug 2022 06:08 IST

గుండెపోటుతో కన్నుమూసిన స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో ‘బిగ్‌ బుల్‌’గా ప్రసిద్ధిగాంచిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (62) ఆదివారం ఉదయం హఠాత్తుగా తుదిశ్వాస విడిచారు. భారత విపణిపై అత్యంత విశ్వాసంతో ఉండే రాకేశ్‌, తన గౌరవప్రద-విలక్షణ పెట్టుబడులతో మదుపర్లకు ఆదర్శంగా మెలిగారని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడిదారు అయిన వారెన్‌ బఫెట్‌తో పోల్చుతూ ‘భారత వారెన్‌ బఫెట్‌’గా    వ్యవహరించేవారు. కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో ఆయన మరణించారని, ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే మృతిచెందినట్లు బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. స్టాక్‌ మార్కెట్‌ ట్రేడర్‌, మదుపరి, వ్యాపారవేత్త అయిన ఝున్‌ఝున్‌వాలా 3 బాలీవుడ్‌ చిత్రాలు కూడా రూపొందించారు. దేశీయంగా ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌కూ ఆయన ప్రధాన పెట్టుబడిదారుడు. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సంపద విలువ దాదాపు 5.8 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.46,000 కోట్లు) అని, భారతీయ సంపన్నుల్లో 22వ స్థానంలో ఉన్నారని కుబేరుల జాబితా వెలువరించే ఫోర్బ్స్‌ పేర్కొంది. ఆయనకు భార్య రేఖ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొన్ని నెలలుగా రాకేశ్‌ కిడ్నీ, గుండె వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవల పలు కార్యక్రమాలకు చక్రాల కుర్చీలోనే హాజరయ్యేవారు. డయాలసిస్‌ కూడా చేయించుకుంటున్న ఆయన ఆసుపత్రి నుంచి 3 వారాల క్రితమే ఇంటికి చేరగా, ఆదివారం శాశ్వతంగా కన్నుమూశారు. దుబాయ్‌ నుంచి సోదరుడు వచ్చిన తర్వాత రాకేశ్‌ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

హైదరాబాద్‌ నుంచి ముంబయికి
రాజస్థానీ కుటుంబానికి చెందిన రాకేశ్‌ తండ్రి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారిగా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు 1960 జులై 5న ఆయన జన్మించారు. ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా జీవితంలో అధికభాగం ముంబయిలోనే గడిపారు.

ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఆర్థిక ప్రపంచానికి ఆయన సేవలు అనిర్వచనీయం. భారత పురోగతిపై ఎప్పుడూ ఆశావహంగా ఉండేవారు. ఆయన మృతి చాలా బాధ కలిగించింది. కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ‘భారత్‌ బలం, సామర్థ్యాలపై రాకేశ్‌కు గొప్ప నమ్మకం ఉండేదని, ఆయన మృతికి నివాళి’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు. దేశీయ మార్కెట్లను రాకేశ్‌ ఎంతో బాగా అర్థం చేసుకున్నారని, సంపద పంపిణీపై అనురక్తి గల వ్యక్తిగా రతన్‌టాటా నివాళి అర్పించారు. మొత్తం ఒక తరానికే ఝున్‌ఝున్‌వాలా స్ఫూర్తి నింపారని అదానీ గ్రూప్‌ సంస్థల అధినేత గౌతమ్‌ అదానీ అన్నారు. భారత్‌ సత్తాను పూర్తిగా విశ్వసించిన వ్యక్తి ఝున్‌ఝున్‌వాలా అని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. స్టాక్‌ మార్కెట్లను సామాన్యులకు చేరువ చేసిన వ్యక్తిగా ఝున్‌ఝున్‌వాలా గుర్తుండిపోతారని, ఒక స్నేహితుడిని కోల్పోయానని మైనింగ్‌ దిగ్గజం అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని