పరిష్కారం చూపిస్తే రూ.20 లక్షలు

బీమా రంగంలోని కొన్ని సమస్యలకు ఆధునిక పరిష్కారాలను కోరుతూ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) తొలి హాకథాన్‌ను ప్రారంభించింది. దీనికి ‘బీమా మంథన్‌ 2022’గా పేరును ఖరారు చేసింది. దేశంలోని ప్రతి వ్యక్తికీ బీమా రంగాన్ని దగ్గరకు చేయడంతో పాటు, పాలసీ ప్రతి దశలోనూ

Updated : 16 Aug 2022 10:15 IST

బీమా మంథన్‌ను ప్రకటించిన ఐఆర్‌డీఏఐ

ఈనాడు, హైదరాబాద్‌: బీమా రంగంలోని కొన్ని సమస్యలకు ఆధునిక పరిష్కారాలను కోరుతూ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) తొలి హాకథాన్‌ను ప్రారంభించింది. దీనికి ‘బీమా మంథన్‌ 2022’గా పేరును ఖరారు చేసింది. దేశంలోని ప్రతి వ్యక్తికీ బీమా రంగాన్ని దగ్గరకు చేయడంతో పాటు, పాలసీ ప్రతి దశలోనూ ఎలాంటి ఇబ్బందులూ ఎదురవ్వకుండా, పూర్తిగా సాంకేతికతను వినియోగించుకునేలా పరిష్కారాలను అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఐఆర్‌డీఏఐ తెలిపింది. పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసే కంపెనీలు ఈ బీమా మంథన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా..

* పాలసీదారుడు మరణించిన సందర్భంలో ఆటోమేటెడ్‌ డెత్‌ క్లెయిం సెటిల్‌మెంట్‌ కోసం సాంకేతికతను అభివృద్ధి చేయడం.

* మోసపూరితంగా పాలసీలను విక్రయించకుండా నిరోధించడం

* థర్డ్‌ పార్టీ బీమా లేకుండా తిరుగుతున్న వాహనాలను సులభంగా గుర్తించే సాంకేతికత

* బీమా వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సూక్ష్మ బీమా పాలసీలను సాంకేతికత సాయంతో అందించడం

* వాహన బీమాలో మోసాలను నివారించేందుకు వీలుగా సాంకేతికాభివృద్ధి

నేటి నుంచే వీలు: ఆగస్టు 16 నుంచి ఈ బీమా మంథన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఐఆర్‌డీఏఐ తెలిపింది. మొదటి బహుమతిగా రూ.20లక్షలు, రెండో బహుమతిగా రూ.15 లక్షలు, మూడో బహుమతిగా రూ.10లక్షలను ప్రకటించింది. దీంతోపాటు విజేతలుగా నిలిచిన సంస్థలకు ఐఆర్‌డీఏఐ సాండ్‌బాక్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశంతో పాటు, బీమా సంస్థలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించే ఏర్పాటూ ఉండనుంది. బీమా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకూ వీలు కల్పిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని