2022-23లోనూ రుణాల్లో 15% వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2022-23) రుణ వితరణలో 15 శాతం వృద్ధి లభిస్తుందనే అంచనాను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా వ్యక్తం చేశారు. రెపోరేటు పెంపు వల్ల రుణ రేట్లు పెరిగినప్పటికీ.. రిటైల్‌, కార్పొరేట్‌ విభాగాల నుంచి అధిక గిరాకీ ఉండటం రుణాల్లో వృద్ధికి తోడ్పడుతుందని ఆయన

Published : 16 Aug 2022 03:18 IST

త్వరలో యోనో యాప్‌ 2.0

ఎస్‌బీఐ ఛైర్మన్‌ ఆశాభావం

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2022-23) రుణ వితరణలో 15 శాతం వృద్ధి లభిస్తుందనే అంచనాను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా వ్యక్తం చేశారు. రెపోరేటు పెంపు వల్ల రుణ రేట్లు పెరిగినప్పటికీ.. రిటైల్‌, కార్పొరేట్‌ విభాగాల నుంచి అధిక గిరాకీ ఉండటం రుణాల్లో వృద్ధికి తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2022 జూన్‌ త్రైమాసికం ఆఖరుకు ఎస్‌బీఐ రుణాలు 14.93 శాతం పెరిగి రూ.29,00,636 కోట్లుగా నమోదయ్యాయి. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఇవి రూ.25,23,793 కోట్లుగా ఉన్నాయి. జూన్‌ త్రైమాసికంలో రిటైల్‌ రుణాల్లో 18.58 శాతం, కార్పొరేట్‌ రుణాల్లో 10.57 శాతం వృద్ధి లభించింది. మరింత అధునికీకరించిన యోనో 2.0 యాప్‌ను త్వరలోనే ఎస్‌బీఐ అందుబాటులోకి తెస్తుందని ఖరా చెప్పారు. ‘బ్యాంక్‌ లావాదేవీల్లో 96.6 శాతానికి పైగా ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా జరుగుతున్నాయి. యోనోలో నమోదైన వినియోగదార్ల సంఖ్య 5.25 కోట్లను మించింది. కొత్త పొదుపు ఖాతాల్లో 65 శాతం వరకు యోనో ద్వారానే తెరిచార’ని ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 పరిణామాల ప్రభావం చాలా వరకు తగ్గిందన్నారు. ఇందుకు టీకాలే ప్రధాన కారణమని, విమాన సర్వీసుల పునరుద్ధరణ, ఇతర దేశాల నియంత్రణ చర్యల తొలగింపు లాంటి వాటితో ఆర్థిక వ్యవస్థ దాదాపుగా గాడిన పడిందని తెలిపారు. భౌగోళిక రాజకీయ  అనిశ్చితులతో ఇబ్బందులకూ ఆస్కారం ఉందని వెల్లడించారు. అంతర్జాతీయంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, ద్రవ్యోల్బణం, ముడి చమురు, కమొడిటీ ధరలు పెరిగినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మాత్రం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని