గంగవరం పోర్టులో కొత్తగా కంటెయినర్‌ టెర్మినల్‌

ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టులో నూతన ‘కంటెయినర్‌ టెర్మినల్‌’ ప్రారంభం కానుంది. దీనిని వచ్చే నెలలో ప్రారంభించేందుకు అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల తూర్పు తీరంలో సరకు రవాణా సౌకర్యాలు విస్తరిస్తాయని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌,

Published : 17 Aug 2022 04:33 IST

వచ్చే నెలలో ప్రారంభం

తూర్పు తీరం నుంచి సరకు రవాణా పెరుగుతుంది

అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ ఆశాభావం

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టులో నూతన ‘కంటెయినర్‌ టెర్మినల్‌’ ప్రారంభం కానుంది. దీనిని వచ్చే నెలలో ప్రారంభించేందుకు అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల తూర్పు తీరంలో సరకు రవాణా సౌకర్యాలు విస్తరిస్తాయని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, ఒడిశా, జార్ఘండ్‌ రాష్ట్రాల నుంచి సరకు రవాణా పెరుగుతుందని ఏపీఎస్‌ఈజడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

మనదేశం నుంచి సరకు రవాణా పశ్చిమ తీరంలోని నౌకాశ్రయాల నుంచి అధికంగా నమోదవుతోంది. మొత్తం సరకు రవాణాలో పశ్చిమ తీరంలోని నౌకాశ్రయాల వాటా 61% ఉండగా, తూర్పు తీరం నుంచి 39% ఉంటుంది. గతేడాది కాలంలో పశ్చిమ తీరం నుంచి 9% అధికంగా సరకు రవాణా జరిగింది. తూర్పు తీరం నుంచి 6% వృద్ధే నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జరిగిన సరకు రవాణాలో 55% ‘డ్రై కార్గో’ కాగా, 35% కంటెయినర్‌ కార్గో ఉంది. దాదాపు 10% ముడి చమురు, సహజ వాయువు రవాణా ఉంది. అదానీ పోర్ట్స్‌ ఈ మొదటి త్రైమాసికంలో 31.5 మిలియన్‌ టన్నుల కంటెయినర్‌ కార్గో నిర్వహించింది. గంగవరం పోర్టులో నూతన కంటెయినర్‌ టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే ఇంకా అధికంగా కంటెయినర్‌ కార్గోను నమోదు చేసే వీలుంటుంది.  ఇటీవల దేశీయంగా బొగ్గు వినియోగం పెరిగింది. దీనివల్ల బొగ్గు ధరా పెరిగింది. బొగ్గు కొరతా ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గు రవాణాకు అవకాశాలు పెరిగాయి. దీంతో పాటు స్టీలు ప్లాంట్లు కోకింగ్‌ కోల్‌ను అధికంగా వినియోగిస్తున్నాయి. అందువల్ల బొగ్గు, కోకింగ్‌ కోల్‌ రవాణాలో అందివస్తున్న కొత్త అవకాశాలపై కంపెనీ అదానీ పోర్ట్స్‌ సారించింది. గంగవరం, కృష్ణపట్నం నౌకాశ్రయాలతో పాటు ఒడిశాలోని ధమ్రా పోర్టు నుంచి సమీప భవిష్యత్తులో బొగ్గు, కోకింగ్‌ కోల్‌ రవాణా పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

తూర్పు తీరంలోని దక్షిణ ప్రాంతంలో కృష్ణపట్నం, కట్టుపల్లి, ఎన్నూర్‌ పోర్టులను అదానీ పోర్ట్స్‌ నిర్వహిస్తోంది. ఈ పోర్టుల్లో కంటెయినర్‌ కార్గో ఇటీవల తగ్గిన నేపథ్యంలో కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కృష్ణపట్నం పోర్టు నుంచి ‘ఫీడర్‌ సర్వీసు’లను పెంపొందించే దిశగా కసరత్తు చేపట్టింది. దీనివల్ల బంగ్లాదేశ్‌, మయన్మార్‌కు సరకు రవాణాకు సంబంధించి కృష్ణపట్నం ‘ట్రాన్స్‌షిప్‌మెంట్‌ హబ్‌’గా మారుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మూడో త్రైమాసికం నుంచి మార్పు కనిపిస్తుందని, కృష్ణపట్నం నౌకాశ్రయం నుంచి కంటెయినర్‌ కార్గో కార్యకలాపాలు పెరుగుతాయని కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అదానీ లాజిస్టిక్స్‌ చేతికిఐసీడీ టంబ్‌

నవకర్‌ కార్పొరేషన్‌ నుంచి ఐసీడీ టంబ్‌ను అదానీ లాజిస్టిక్స్‌ రూ.835 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని కింద 0.5 మిలియన్‌ టీఈయూలు (ఇరవై అడుగుల సమాన యూనిట్‌) సామర్థ్యం గల ఐసీడీని అదానీ సొంతం చేసుకోనుంది. ఇప్పటికే ఈ డీఎఫ్‌సీ (ప్రత్యేక రవాణా నడవా)లతో పాటు అదనంగా పారిశ్రామిక నడవా (ఇండస్ట్రియల్‌ కారిడార్‌), లాజిస్టిక్‌ పార్క్‌లు కూడా వస్తుండడంతో.. సంస్థకున్న 129 ఎకరాల భూమి కారణంగా భవిష్యత్‌లో అదనపు విస్తరణకు వీలు కలుగుతుందని కంపెనీ తెలిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts