స్పైస్‌జెట్‌, మారన్‌ల వివాదానికి మధ్యవర్తిత్వం

స్పైస్‌జెట్‌కు, కళానిధి మారన్‌, ఆయనకు చెందిన కాల్‌ ఎయిర్‌వేస్‌కు మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న వివాదాలను పరిష్కరించడం కోసం మధ్యవర్తిత్వానికి వెళతామన్న సంయుక్త విజ్ఞప్తిని పరిశీలించగలమని సుప్రీం కోర్టు పేర్కొంది. స్పైస్‌జెట్‌కు, మారన్‌కు మధ్య మూడు వివాదాలుండగా.. అందులో ఒకటి

Published : 17 Aug 2022 04:33 IST

విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న సుప్రీం

దిల్లీ: స్పైస్‌జెట్‌కు, కళానిధి మారన్‌, ఆయనకు చెందిన కాల్‌ ఎయిర్‌వేస్‌కు మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న వివాదాలను పరిష్కరించడం కోసం మధ్యవర్తిత్వానికి వెళతామన్న సంయుక్త విజ్ఞప్తిని పరిశీలించగలమని సుప్రీం కోర్టు పేర్కొంది. స్పైస్‌జెట్‌కు, మారన్‌కు మధ్య మూడు వివాదాలుండగా.. అందులో ఒకటి జులై 29న పరిష్కారమైందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ జె.కె. మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనానికి స్పైస్‌జెట్‌ తరఫు వాదిస్తున్న సీనియర్‌ అడ్వొకేట్‌ ముకుల్‌ రోహత్గి తెలియజేశారు. అన్ని వివాదాల పరిష్కారానికి 4-6 వారాల సమయం కావాలని రోహత్గి తొలుత విన్నవించారు. అయితే హైదరాబాద్‌ మధ్యవర్తిత్వ కేంద్రంలో ఇరు పార్టీలు సమస్యల పరిష్కారానికి వెళితే మంచిదని మారన్‌, కాల్‌ ఎయిర్‌వేస్‌ తరఫు సీనియర్‌ అడ్వొకేట్‌ వికాస్‌ సింగ్‌ సలహానిచ్చారు. ఇందుకు స్పైస్‌జెట్‌ కూడా మద్దతు పలికింది. దీంతో ‘మేం పరిశీలిస్తామ’ని ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది. స్పైస్‌జెట్‌, దాని మాజీ ప్రమోటరు మారన్‌, కాల్‌ ఎయిర్‌వేస్‌ల మధ్య షేర్ల బదిలీ వివాదం ఎప్పటి నుంచో నడుస్తున్న సంగతి తెలిసిందే.

విమానలీజుదారుతో స్పైస్‌జెట్‌ సెటిల్‌మెంట్‌: రెండు బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలు, ఒక బోయింగ్‌ 737-800 ఎన్‌జీ విమానానికి సంబంధించి విమానాల లీజుదారు గోషాక్‌ ఏవియేషన్‌, దీనికి చెందిన రెండు అనుబంధ కంపెనీలతో స్పైస్‌జెట్‌ వివాద పరిష్కారాన్ని కుదుర్చుకుంది. ‘డీ హావిలాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆఫ్‌ కెనడా, క్రెడిట్‌ సూయిజ్‌, బోయింగ్‌, సీడీబీ ఏవియేషన్‌, బీఓసీ ఏవియేషన్‌, అవలాన్‌లతో విజయవంతంగా సెటిల్‌మెంట్‌లు కుదుర్చుకున్న అనంతరం గోషాక్‌తోనూ సెటిల్‌మెంట్‌ చేసుకున్న’ట్లు ఒక ప్రకటనలో స్పైస్‌జెట్‌ తెలిపింది. మూడు విమానాలకు సంబంధించిన లీజు ఒప్పందాల విషయంలో బ్రిటన్‌ కోర్టు, దిల్లీ హైకోర్టుకు దాఖలు చేసుకున్న అన్ని పిటిషన్లను వెనక్కి తీసుకుంటామనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని