ఆర్థిక వివాదాన్ని పరిష్కరించుకున్నాం

తమ మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాన్ని పరిష్కరించుకున్నామని చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌, స్విట్జర్లాండ్‌ సంస్థ క్రెడిట్‌ సూసే ఏజీలు గురువారం సుప్రీంకోర్టుకు నివేదించాయి.

Updated : 19 Aug 2022 03:23 IST

సుప్రీంకోర్టుకు తెలిపిన స్పైస్‌జెట్‌, క్రెడిట్‌ సూసే

దిల్లీ: తమ మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాన్ని పరిష్కరించుకున్నామని చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌, స్విట్జర్లాండ్‌ సంస్థ క్రెడిట్‌ సూసే ఏజీలు గురువారం సుప్రీంకోర్టుకు నివేదించాయి. క్రెడిట్‌ సూసే ఏజీకి బకాయిలు చెల్లించని కారణంగా, స్పైస్‌జెట్‌ను మూసేయాలని మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పైస్‌జెట్‌ అప్పీల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదం పరిష్కరించుకున్నామని తెలుపడంతో, అప్పీల్‌ వెనక్కి తీసుకొనేందుకు స్పైస్‌జెట్‌ను సుప్రీంకోర్టు అనుమతించింది. 2022 మే 23న రెండు పార్టీల మధ్య సంతృప్తికర సెటిల్‌మెంట్‌ జరిగినందున, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను వెనక్కి తీసుకుంటున్నట్లు పిటిషనర్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన బెంచ్‌ ఇందుకు అంగీకారం తెలిపింది. మద్రాస్‌ హైకోర్టులో స్పైస్‌జెట్‌ డిపాజిట్‌ చేసిన బ్యాంక్‌ గ్యారెంటీని వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని బెంచ్‌ పేర్కొంది.  
* స్పైస్‌జెట్‌ను మూసేయాలని, ఆ సంస్థ ఆస్తుల్ని టేకోవర్‌ చేసుకోవాలని అధికారిక లిక్విడేటర్‌ను ఆదేశిస్తూ మద్రాస్‌ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గత జనవరి 11న స్పైస్‌జెట్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అదే నెల 28న దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించడంతో పాటు, స్విస్‌ సంస్థతో ఆర్థిక వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. తాజాగా ఈ వివాదం సమసిపోవడంతో ఆ విషయాన్ని ఇరు పార్టీలు సుప్రీంకోర్టుకు తెలియజేశాయి.
అసలేం జరిగింది?: 10 ఏళ్ల కాలానికి విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాలింగ్‌ (ఎంఆర్‌ఓ) సేవలందించేందుకు  ఎస్‌ఆర్‌ టెక్నిక్స్‌తో స్పైస్‌జెట్‌ 2011 నవంబరు 24న ఒప్పందం చేసుకుంది. తమ సేవలు వినియోగించుకున్న స్పైస్‌జెట్‌ 24 మిలియన్‌ డాలర్లకు పైగా (సుమారు రూ.190 కోట్లు) బిల్లులు చెల్లించలేదని క్రెడిట్‌ సూసే ఏజీ కోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఆర్‌ టెక్నిక్స్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం స్పైస్‌జెట్‌ నుంచి బకాయిలు వసూలు చేసుకునే హక్కులు క్రెడిట్‌ సూసేకు లభించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని