సీఎండీ, సీఈఓలకు సమన్లు వద్దు

కంపెనీల్లో ఉన్నత హోదాల్లోని ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు (సీఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారులకు (సీఈఓ) సమన్లు జారీ చేసి, అరెస్టు చేయించడాన్ని క్షేత్ర స్థాయి జీఎస్‌టీ అధికారులు యాంత్రికంగా

Published : 19 Aug 2022 03:06 IST

క్షేత్ర స్థాయి అధికారులకు జీఎస్‌టీ దర్యాప్తు విభాగం మార్గదర్శకాలు

దిల్లీ: కంపెనీల్లో ఉన్నత హోదాల్లోని ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు (సీఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారులకు (సీఈఓ) సమన్లు జారీ చేసి, అరెస్టు చేయించడాన్ని క్షేత్ర స్థాయి జీఎస్‌టీ అధికారులు యాంత్రికంగా చేపట్టవద్దని జీఎస్‌టీ దర్యాప్తు విభాగం స్పష్టం చేసింది. జీఎస్‌టీ చట్టం కింద సమన్ల జారీ, అరెస్టు, బెయిల్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డులోని (సీబీఐసీ) దర్యాప్తు విభాగం గురువారం జారీ చేసింది. ‘అరెస్టు కారణంగా ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తుంది. విశ్వసనీయత ఆధారంగానే ఈ తరహా చర్యలు ఉండాలి మినహా, యాంత్రిక పద్ధతిలో కాద’ని సీబీఐసీ స్పష్టం చేసింది. జీఎస్‌టీ నేర ఆరోపణలున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు అధికారులు పరిశీలించాల్సిన జాబితాను (చెక్‌ లిస్ట్‌) కూడా ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు. సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉందా? సాక్షులను భయపెడతాడా ? పాల్పడిన నేరంలో ఆ వ్యక్తి గొప్ప నేర్పరా? లాంటివి పరిశీలించాలంది. ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందు చట్టపరమైన అంశాలతో పాటు సమగ్ర దర్యాప్తు నిర్వహించడం, సాక్ష్యాల తారుమారు లేదా సాక్షులకు బెదిరింపులు, ప్రభావితం చేయడాన్ని నియంత్రించడం లాంటి వాటిపైనా దష్టి పెట్టాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. ‘ఆదాయ నష్టానికి దారి తీసిన నిర్ణయ ప్రక్రియలో వారి పాత్ర ఉందని దర్యాప్తులో స్పష్టమైన సంకేతాలుంటే సమన్లు జారీ చేయొచ్చ’ని పేర్కొన్నాయి. ప్రాథమిక సాక్ష్యాలు, దస్త్రాల కోసం కంపెనీల ఉన్నతాధికారులకు, జీఎస్‌టీ క్షేత్ర స్థాయి అధికారులు సమన్లు జారీ చేస్తున్నట్లు గుర్తించినట్లు జీఎస్‌టీ దర్యాప్తు విభాగం వెల్లడించింది. జీఎస్‌టీ పోర్టల్‌లో లభించే జీఎస్‌టీఆర్‌-3బీ, జీఎస్‌టీఆర్‌-1 లాంటి చట్టబద్దమైన దస్త్రాల కోసం కూడా ఈ సమన్లను జారీ చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి వాటి కోసం సమన్లను జారీ చేయకూడదని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు