యూకే ప్రభుత్వం నుంచి విప్రోకు కాంట్రాక్టు

యూకే ప్రభుత్వ ట్రెజరీకి సంబంధించి సర్వీస్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందించే కాంట్రాక్టును ఐటీ సంస్థ విప్రో దక్కించుకుంది.

Published : 19 Aug 2022 03:19 IST

దిల్లీ: యూకే ప్రభుత్వ ట్రెజరీకి సంబంధించి సర్వీస్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందించే కాంట్రాక్టును ఐటీ సంస్థ విప్రో దక్కించుకుంది. ఎలాంటి ఆటంకాలు లేని ఐటీ సేవల అనుసంధానతతో పాటు హర్‌ మెజెస్టీ ట్రెజరీ (హెచ్‌ఎంటీ), దాని అనుబంధ సమాఖ్యలతో వినియోగదారు అనుభవాన్ని మరింత విస్తరించేందుకు ఈ కాంట్రాక్టు దోహదం చేయనుంది. వ్యూహం, డిజైన్‌, రోజువారీ సర్వీస్‌ ఇంటిగ్రేషన్‌ సమన్వయం తదితర సేవల్ని విప్రో అందించనుందని హెచ్‌ఎంటీ ముఖ్య సమాచార అధికారి హువ్‌ స్టీఫెన్స్‌ వెల్లడించారు. హెచ్‌ఎంటీ సప్లయర్స్‌కు పారదర్శకత, సేవల నాణ్యత అందించేందుకు కంపెనీ బృందం పని చేస్తుందని విప్రో యూకే, ఐర్లాండ్‌ ఎండీ ఓంకార్‌ నిశాల్‌ వెల్లడించారు.


వేరియబుల్‌ పేలో కోత?

మార్జిన్లపై ఒత్తిడి, టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌  లో విప్రో ఏకీకృత నికర లాభం 2021 ఇదే సమయం నాటి రూ.3,242.6 కోట్ల నుంచి 21 శాతం తగ్గి రూ.2,563.6 కోట్లకు పరిమితమైంది. దీంతో కంపెనీ తమ ఉద్యోగుల వేరియబుల్‌ పేలో కోత విధిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా సమాచారం అందించారని తెలుస్తోంది. మేనేజర్ల నుంచి సి-సూట్‌ స్థాయి ఉద్యోగులకు పూర్తి వేరియబుల్‌ పేలో కోత ఉంటుందని, ఫ్రెషర్ల నుంచి టీమ్‌ లీడర్ల వరకు 70 శాతం అందుకుంటారని సమాచారం. ఈ వార్తలపై విప్రో స్పందించింది. ‘సెప్టెంబరు 1 నుంచి వేతనాల పెంపులో ఎలాంటి మార్పు ఉండదు. జులై నుంచి ప్రతి మూడు నెలలకొసారి ఇవ్వనున్న పదోన్నతులు కూడా కొనసాగుతాయి. ఇప్పటికే తొలి విడత త్రైమాసిక పదోన్నతులపై ప్రక్రియను పూర్తి చేశాం. వేరియబుల్‌ పే గురించి మాట్లాడటానికి ఏమీ లేద’ని వెల్లడించింది. 2022 జూన్‌ 30 నాటికి విప్రోలో 2,58,574 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.


అరబిందో అనుబంధ కంపెనీగా జీఎల్‌ఎస్‌ ఫార్మా

ఈనాడు, హైదరాబాద్‌: కేన్సర్‌ ఔషధాలు ఉత్పత్తి చేసే జీఎల్‌ఎస్‌ ఫార్మా కంపెనీలో 51 శాతం వాటా కొనుగోలు ప్రక్రియను అరబిందో ఫార్మా పూర్తి చేసింది. దీంతో ఈ సంస్థ, అరబిందో ఫార్మాకు అనుబంధ కంపెనీగా మారింది. జీఎల్‌ఎస్‌ ఫార్మాలో వాటాను రూ. 28.05 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు కొంతకాలం క్రితం అరబిందో ఫార్మా వెల్లడించిన విషయం విదితమే. ఈ సంస్థ 2021-22లో రూ.25.8 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని