UPI: బ్రిటన్‌కెళ్లినా.. యూపీఐ వాడొచ్చు

భారత్‌ తను సొంతంగా తయారు చేసుకున్న రియల్‌టైం చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐని తాజాగా బ్రిటన్‌లో ప్రవేశపెట్టింది. ఇందు కోసం పేఎక్స్‌పర్ట్‌తో ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌(ఎన్‌ఐపీఎల్‌) ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

Updated : 19 Aug 2022 09:24 IST

భారత్‌ వెలుపలా సేవల ప్రారంభం

దిల్లీ: భారత్‌ తను సొంతంగా తయారు చేసుకున్న రియల్‌టైం చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐని తాజాగా బ్రిటన్‌లో ప్రవేశపెట్టింది. ఇందు కోసం పేఎక్స్‌పర్ట్‌తో ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌(ఎన్‌ఐపీఎల్‌) ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ)కు చెందిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థే ఎన్‌ఐపీఎల్‌. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ)తో పాటు రుపే కార్డు పథకాన్ని ఎన్‌పీసీఐయే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో పేఎక్స్‌పర్ట్స్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ పాయింట్‌-ఆఫ్‌-సేల్‌(పీఓఎస్‌) పరికరాల్లో ఇన్‌-స్టోర్‌ చెల్లింపులు చేసేందుకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మొదట క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులు ప్రారంభమవుతాయి. తర్వాత రుపే కార్డు చెల్లింపులకున్న అవకాశాన్నీ పరిశీలించనున్నామ’ని ఎన్‌పీసీఐ గురువారం తెలిపింది.
ఎవరికి ప్రయోజనం అంటే..: మన దేశం నుంచి బ్రిటన్‌కు ఏటా వెళ్లే 5 లక్షల మంది సులువగా చెల్లింపులు జరిపేందుకు ఇది ఉపకరించనుంది. ఇందులో లక్ష మందికి పైగా విద్యార్థులే ఉంటారు. బ్రిటన్‌లోని వినియోగదార్లు, రిటైలర్లకూ ఇది ప్రయోజనం కలిగిస్తుందని.. రిటైల్‌, ఆతిథ్య, పర్యటక రంగాలకు ఊతమిస్తుందని ఎన్‌పీసీఐ పేర్కొంది.
ఏ దేశాల్లో యూపీఐ పనిచేస్తుందంటే..: 2021 జులైలో భూటన్‌లోనూ యూపీఐ సేవలు మొదలయ్యాయి. రుపే కార్డులను అనుమతించే ఏకైక దేశం ఇదే. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేపాల్‌లోనూ యూపీఐ అడుగుపెట్టింది. ఇపుడు బ్రిటన్‌లోకీ వెళ్లింది.


స్విచ్‌ నుంచి విద్యుత్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సు

ఒకసారి ఛార్జింగ్‌తో 250 కి.మీ. వరకు ప్రయాణం

ముంబయి: అశోక్‌ లేలాండ్‌ విద్యుత్‌ విభాగమైన స్విచ్‌ మొబిలిటీ దేశీయంగా విద్యుత్తుతో నడిచే తొలి డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సును ఆవిష్కరించింది. ఈఐవీ 22 పేరుతో దీన్ని ముంబయిలో గురువారం విడుదల చేసింది. 231 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం కలిగిన ఈ బస్సు డ్యూయల్‌ గన్‌ ఛార్జింగ్‌ సిస్టమ్‌తో వస్తోంది. ఒకసారి ఛార్జింగ్‌తో 250 కి.మీ. వరకు ప్రయాణించొచ్చని సంస్థ తెలిపింది.

ఇప్పటికే బృహన్‌ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లయ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (బెస్ట్‌) 200 బస్సుల కోసం ఆర్డర్‌ చేసిందని స్విచ్‌ మొబిలిటీ ఇండియా సీఓఓ మహేశ్‌ బాబు వెల్లడించారు. ప్రస్తుతం ముంబయిలో తిరుగుతున్న డబుల్‌ డెక్కర్‌ బస్సుల స్థానంలో వీటిని ప్రవేశ పెడతారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 50 బస్సులను డెలివరీ చేయనున్నామని చెప్పారు. మిగతా నగరాల నుంచీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని, వచ్చే ఏడాదికల్లా 150-200 బస్సులను డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. ముంబయిలో 1967లోనే తొలి డబుల్‌ డెక్కర్‌ బస్సును అశోక్‌ లేలాండ్‌ ప్రవేశపెట్టింది. ఆ వారసత్వాన్ని స్విచ్‌ మొబిలిటీ కొనసాగించనుందని కంపెనీ పేర్కొంది.

* భారత్‌, యూకేల్లో విద్యుత్‌ బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాల అభివృద్ధికి 300 మిలియన్‌ పౌండ్లు పెట్టుబడి పెడుతున్నట్లు స్విచ్‌ మొబిలిటీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. ఇప్పటికే డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సులు 100 వరకు యూకే రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని