జులైలో కోటిలోపే విమాన ప్రయాణికులు

జులైలో దేశీయంగా 97 లక్షలకు పైగా మంది విమానాల్లో ప్రయాణించారు. జూన్‌లో ప్రయాణించిన 1.05 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.6 శాతం తక్కువని విమానయాన నియంత్రణాధికార సంస్థ డీజీసీఏ పేర్కొంది.

Published : 19 Aug 2022 03:19 IST

మార్కెట్‌ వాటాలో విస్తారాకు రెండోస్థానం

దిల్లీ: జులైలో దేశీయంగా 97 లక్షలకు పైగా మంది విమానాల్లో ప్రయాణించారు. జూన్‌లో ప్రయాణించిన 1.05 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.6 శాతం తక్కువని విమానయాన నియంత్రణాధికార సంస్థ డీజీసీఏ పేర్కొంది. టాటా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంయుక్త సంస్థ అయిన విస్తారా తొలిసారిగా, దేశీయ విమానయాన విపణిలో రెండోస్థానానికి చేరింది. ఇండిగో తరవాత అత్యధిక ప్రయాణికులను చేరవేసిన సంస్థగా నిలిచింది. 2022 జనవరి-జులైలో మొత్తం 6.69 కోట్ల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారని తన నెలవారీ నివేదికలో డీజీసీఏ పేర్కొంది. వర్షాకాలంలో దేశీయంగా విమాన ప్రయాణాలు తక్కువగా జరుగుతుంటాయి. నాలుగు మెట్రో విమానాశ్రయాల్లో (బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి) ఎయిరేషియా ఇండియా 95.5 శాతం మేర అత్యుత్తమ సమయపాలనను పాటించింది. విస్తారా, గోఫస్ట్‌లు వరుసగా 89%, 84.1 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

-----------
విమానయాన సంస్థ ప్రయాణికులు(లక్షల్లో) సీట్ల భర్తీ (శాతం)
ఇండిగో 57.11 77.7
విస్తారా 10.13 84.3
ఎయిరిండియా 8.14 71.1
గోఫస్ట్‌ 7.95 76.5
స్పైస్‌జెట్‌ 7.76 84.7
ఎయిరేషియా ఇండియా 4.42 75.2
అలయన్స్‌ ఎయిర్‌ 1.12 -----


ప్రవాస కంపెనీలకు ఊరట

 5% టీసీఎస్‌ మినహాయింపు
ఐటీ నిబంధనల్లో మార్పుల నోటిఫై

దిల్లీ: భారత్‌లో ఒక స్థిర వ్యాపారం లేదా శాశ్వత ఏర్పాటు(పీఈ) లేని ప్రవాస కార్పొరేట్‌ కంపెనీలకు ఆదాయ పన్ను విభాగం ఊరట కలిగించింది. మూలం వద్ద వసూలు చేసే పన్ను(టీసీఎస్‌) నుంచి వీటికి మినహాయింపునిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నోటిఫై చేసింది. ఐటీ చట్టం సెక్షన్‌ 206(1జీ) కింద మినహాయింపు పరిధిని (అంతక్రితం కేవలం ప్రవాస వ్యక్తులకే ఈ మినహాయింపు ఉండేది) పెంచింది.
ఎంత ఉండేదంటే..: భారత్‌లోని వ్యక్తులు చేసే విదేశీ మారకపు వ్యయాలపై ఓ కన్నేయడం కోసం ఆర్థిక చట్టం-2020 ద్వారా సెక్షన్‌ 206సీ(1జీ)ని ప్రవేశపెట్టారు. 2020 అక్టోబరు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. రూ.7 లక్షలు అంత కంటే ఎక్కువ విదేశీ మారకపు వ్యయాలపై మూలం వద్ద 5 శాతం పన్ను వసూలు చేసేవారు. భారత్‌ను సందర్శించే ప్రవాస భారతీయుల నుంచి దేశీయ టూర్‌ ఆపరేటర్లు పొందే నగదుపై ఈ టీసీఎస్‌ను విధించేవారు. దేశం నుంచి వారు బుక్‌ చేసుకునే విదేశీ టూర్‌ ప్యాకేజీలపైనా వసూలు చేసేవారు. తాజా సవరణ ద్వారా కార్పొరేట్‌ కంపెనీలు, సంస్థలు, ఎల్‌ఎల్‌పీ, ఇతరత్రాలకు సైతం 5% టీసీఎస్‌ నుంచి మినహాయింపునిచ్చారు. దీని వల్ల ప్రవాసులపై నిబంధన భారం తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు.


డీజిల్‌ ఎగుమతిపై విండ్‌ఫాల్‌ పన్ను పెంపు

దిల్లీ: డీజిల్‌ ఎగుమతిపై విండ్‌ఫాల్‌ లాభాల పన్నును లీటర్‌కు రూ.5 నుంచి రూ.7కు పెంచుతున్నట్లు ప్రభుత్వం గురువారం వెల్లడించింది. విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ఎగుమతులపై లీటర్‌కు రూ.2 పన్ను వేస్తున్నట్లు ఆర్థిక శాఖ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం ఏటీఎఫ్‌ ఎగుమతులపై విండ్‌ఫాల్‌ పన్నును తొలగించింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడిచమురుపై పన్నును రూ.17,750 నుంచి రూ.13,000కు తగ్గించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆరు నెలల కనిష్ఠానికి చేరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని