భారీ పెట్టుబడి లావాదేవీల్లేవ్‌

భారత కార్పొరేట్‌ రంగంలో భారీ మొత్తం ఒప్పందాలు ఈ ఏడాది జులైలో బాగా తగ్గాయని   గ్రాంట్‌ థోర్న్‌టన్‌ నివేదిక వెల్లడించింది. జులైలో 171 విలీనాలు- కొనుగోళ్లు (ఎంఅండ్‌ఏ), ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) ఒప్పందాలు జరిగాయి.

Published : 20 Aug 2022 02:37 IST

జులైలో రూ.16,000 కోట్ల ఒప్పందాలే
గ్రాంట్‌ థోర్న్‌టన్‌ నివేదిక

దిల్లీ: భారత కార్పొరేట్‌ రంగంలో భారీ మొత్తం ఒప్పందాలు ఈ ఏడాది జులైలో బాగా తగ్గాయని   గ్రాంట్‌ థోర్న్‌టన్‌ నివేదిక వెల్లడించింది. జులైలో 171 విలీనాలు- కొనుగోళ్లు (ఎంఅండ్‌ఏ), ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) ఒప్పందాలు జరిగాయి. వీటి మొత్తం విలువ 2 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.16,000 కోట్లు) ఉంది. విదేశీ లావాదేవీలు కూడా ఒప్పందాల విలువ, సంఖ్యా పరంగా గత ఏడాది వ్యవధిలో రెండో కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అంతర్జాతీయ అనిశ్చితులు ఇందుకు కారణం. ‘ఇతర దేశాల మాదిరిగానే ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ కూడా అధిక ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరలతో ఇబ్బందులు పడుతోంది. బలహీన రూపాయితో దిగుమతుల విలువ మరింత భారంగా మారింద’ని గ్రాంట్‌ థోర్న్‌టన్‌ భారత్‌ పార్ట్‌నర్‌, గ్రోథ్‌ శాంతి విజేత అన్నారు. నివేదిక ప్రకారం..
* జులైలో ఎంఅండ్‌ఏ ఒప్పందాలు 32 జరిగాయి. వీటి విలువ 28 కోట్ల డాలర్లు (రూ.2,240 కోట్లు). ఒప్పందాల సంఖ్య 14 శాతం, విలువ పరంగా 95 శాతం క్షీణత నమోదైందని నివేదిక పేర్కొంది. మొత్తం ఎంఅండ్‌ఏ ఒప్పందాల్లో 28 శాతం వాటాతో అంకురాలు, ఐటీ రంగాల హవా కొనసాగింది. ఈ రంగాల్లో తొమ్మిదేసి చొప్పున ఒప్పందాలు జరిగాయి. వీటి మొత్తం విలువ 16.2 కోట్ల డాలర్లుగా (రూ.1,296 కోట్లు) ఉంది.
* ఒప్పందాల సంఖ్యలో అంకురాలు, ఇ-కామర్స్‌, ఐటీ రంగాలు ముందు వరుసలో ఉండగా.. మౌలిక వసతులు, ఔషధ, రిటైల్‌, బ్యాంకింగ్‌ రంగాలు విలువపరంగా ముందంజలో నిలిచాయి.
* గత నెలలో ఒకే ఒక యూనికార్న్‌ (100 కోట్ల డాలర్ల) సంస్థ అవతరించింది. అది.. ఫిన్‌టెక్‌ రంగానికి చెందిన వన్‌కార్డ్‌.
* జూన్‌తో పోలిస్తే ఎంఅండ్‌ఏ ఒప్పందాలు సంఖ్యాపరంగా పెరిగినప్పటికీ.. విలువ పరంగా తగ్గాయి. పెద్ద మొత్తం లావాదేవీలు జరగకపోవడం, చాలా ఒప్పందాల్లో విలువ వివరాలను బహిర్గతపర్చక పోవడం ఇందుకు కారణంగా నివేదిక విశ్లేషించింది.
* ప్రైవేట్‌ ఈక్విటీ విభాగంలో 139 ఒప్పందాలు జరిగాయి. వీటి విలువ 170 కోట్ల డాలర్లు (రూ.13,600 కోట్లు). మొత్తం ఒప్పందాల్లో పీఈ ఒప్పందాల వాటా 80 శాతానికి పైగానే ఉంటుంది. అయితే ఒప్పంద విలువలో గణనీయ క్షీణత నమోదైంది.
* పీఈ విభాగ లావాదేవీల్లో అంకుర రంగ ఆధిపత్యం కొనసాగింది. జులైలో ఈ రంగం నుంచి 70 శాతం వరకు పీఈ ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడుల విలువ 60 కోట్ల డాలర్లుగా ఉందని నివేదిక వివరించింది.
* అంకుర రంగంలో 20 శాతం పీఈ ఒప్పందాలతో రిటైల్‌ టెక్‌ విభాగం మొదటి స్థానంలో నిలిచింది. ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫిన్‌టెక్‌ విభాగాలు 18 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
* 2022లో ఇప్పటివరకు 17 తొలి పబ్లిక్‌ ఆఫర్‌లు జరిగాయి. ఇష్యూ పరిమాణం 6 బిలియన్‌ డాలర్లు. 2021లో ఇదే కాలంలో 28 ఐపీఓలు జరగగా.. విలువ 7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని