గరిష్ఠాల్లో లాభాల స్వీకరణ

గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సెన్సెక్స్‌ 5 రోజుల వరుస లాభాలకు విరామం ఏర్పడింది.

Published : 20 Aug 2022 02:37 IST

సమీక్ష

గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సెన్సెక్స్‌ 5 రోజుల వరుస లాభాలకు విరామం ఏర్పడింది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి క్షీణత, విదేశీ మదుపర్ల అమ్మకాలు మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 20 పైసలు తగ్గి 79.84 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 1.38 శాతం నష్టంతో 95.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్‌, షాంఘై, టోక్యో నష్టపోగా, హాంకాంగ్‌ రాణించింది. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌ ఉదయం 60,351.23 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,411.20 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. లాభాల స్వీకరణ ఫలితంగా నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 59,474.57 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 651.85 పాయింట్ల నష్టంతో 59,646.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 198.05 పాయింట్లు కోల్పోయి 17,758.45 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,710.75- 17,992.20 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 183.37 పాయింట్లు, నిఫ్టీ 60.30 పాయింట్లు చొప్పున పెరిగాయి.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.82%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.08%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.53%, టాటా స్టీల్‌ 2.27%, ఎస్‌బీఐ 2.25%, ఎన్‌టీపీసీ 1.90%, మారుతీ 1.81%, రిలయన్స్‌ 1.77%, హెచ్‌యూఎల్‌ 1.75%, ఎం అండ్‌ ఎం 1.75%, సన్‌ఫార్మా 1.69%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.66% చొప్పున డీలాపడ్డాయి. ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ మాత్రం స్వల్పంగా రాణించాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి 2.14%, లోహ 1.84%, ఎఫ్‌ఎమ్‌సీజీ 1.24%, ఫైనాన్స్‌ 1.63%, చమురు-గ్యాస్‌ 1.62%, బ్యాంకింగ్‌ 1.61 నీరసపడ్డాయి. యుటిలిటీస్‌, యంత్ర పరికరాలు, విద్యుత్‌, టెక్‌ పెరిగాయి.
ఐఆర్‌సీటీసీ షేరు రయ్‌ రయ్‌: ఐఆర్‌సీటీసీ షేరు ధర గత 2 ట్రేడింగ్‌ రోజుల్లో దాదాపు 12% పెరిగింది. బుధవారం రూ.671.65 వద్ద ఉన్న షేరు, గురువారం రూ.713.05కు చేరింది. శుక్రవారం మరో 3% లాభపడి రూ.735.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.752.80 వద్ద గరిష్ఠాన్ని తాకింది. రైల్వే టికెట్లతో పాటు విమానాల టికెట్లూ బుక్‌ చేసుకునే వీలు ఐఆర్‌సీటీసీలో ఉంది. ఇందుకోసం   8.03 కోట్ల మందికి పైగా ప్రయాణికులు ఇందులో నమోదయ్యారు. రోజూ సగటున 11 లక్షల టికెట్లు విక్రయమవుతున్నాయి. ఇప్పుడీ డిజిటల్‌ డేటా మానిటైజ్‌ చేసి (ఆతిథ్య, రవాణా, బీమా, ఆర్థిక సేవల సంస్థలకు అందించడం) దాదాపు రూ.1000 కోట్ల వరకు ఆర్జించవచ్చన్నది ఐఆర్‌సీటీసీగా ఆలోచనగా వార్తలు రావడమే, షేరు దూసుకెళ్లడానికి కారణం.  కొత్త వ్యాపారావకాశాలను అన్వేషిస్తున్నామని, అందులో భాగంగానే సలహాదారును నియమించుకోవడానికి టెండర్‌  ఆహ్వానించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. అయితే డేటా గోప్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
* కేఎస్‌కే మహానది పవర్‌ కంపెనీ మొండి ఖాతాను ఆదిత్య బిర్లా ఏఆర్‌సీకి రూ.1,622 కోట్లకు ఎస్‌బీఐ విక్రయించింది. మొత్తం బకాయిలో దాదాపు 58 శాతం తక్కువ విలువకే విక్రయించింది.  2022 ఏప్రిల్‌కు చూస్తే ఎస్‌బీఐకు కేఎస్‌కే మహానది పవర్‌ కంపెనీ రూ.3,815.04 కోట్లు బకాయిపడి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని