సిమెంటు తయారీ సామర్థ్యం రెట్టింపు చేస్తాం

సిమెంటు తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుత 70 మిలియన్‌ టన్నుల నుంచి అయిదేళ్లలో 140 మిలియన్‌ టన్నులకు పెంచుకోవడంతో పాటు, దేశంలోనే అత్యంత లాభదాయక సిమెంటు తయారీదారుగా మారేలా ప్రణాళికలు రచించినట్లు గౌతమ్‌ అదానీ ప్రకటించారు.

Published : 20 Sep 2022 02:19 IST

అత్యంత లాభదాయక కంపెనీగా మారతాం
ఏడింతల వృద్ధికి అవకాశాలు
గౌతమ్‌ అదానీ

దిల్లీ: సిమెంటు తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుత 70 మిలియన్‌ టన్నుల నుంచి అయిదేళ్లలో 140 మిలియన్‌ టన్నులకు పెంచుకోవడంతో పాటు, దేశంలోనే అత్యంత లాభదాయక సిమెంటు తయారీదారుగా మారేలా ప్రణాళికలు రచించినట్లు గౌతమ్‌ అదానీ ప్రకటించారు. ‘దేశ ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉండటం; మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో సిమెంటుకు గిరాకీ బాగా పెరుగుతుంది. దీని వల్ల మార్జిన్లు విస్తరించడానికి వీలుంటుంద’ని అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ కంపెనీల కొనుగోలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అన్నారు. ‘ఆధునిక ప్రపంచం అతి గొప్ప ఆర్థిక వృద్ధి దిశగా సాగుతున్న సమయంలో మేం ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సిమెంటు తయారీ దేశం మనదే. అయితే తలసరి వినియోగం 250 కిలోలుగా ఉంది. చైనాలో ఇది 1600 కిలోలు. అంటే మన దేశంలో ఏడు రెట్ల వృద్ధికి అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టా’మన్నారు. ‘ప్రభుత్వ పథకాలు వేగాన్నందుకుంటే, సిమెంటుకు గిరాకీ జీడీపీ కంటే 1.2-1.5 రెట్ల మేర లభిస్తుందని అంచనా. మేమైతే ఈ సంఖ్యకు రెండింతల వృద్ధిని అంచనా వేస్తున్నామ’ని అదానీ తెలిపారు. మా వృద్ధిని వేగవంతం చేసే వ్యూహాత్మక భాగస్వాములనూ జత చేసుకుంటామ’ని వివరించారు.


రూ.25,000 కోట్లతో తాజ్‌పుర్‌ నౌకాశ్రయ అభివృద్ధి

కోల్‌కతా: తాజ్‌పుర్‌ వద్ద కొత్తగా డీప్‌ సీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌కు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అనుమతిచ్చింది. అదానీ గ్రూప్‌ రూ.25,000 కోట్లతో ఈ పోర్ట్‌ను అభివృద్ధి చేసేందుకు అంగీకార లేఖను పశ్చిమ బెంగాల్‌ మారిటైమ్‌ బోర్డు జారీ చేయనుంది. ఈ మెగా ప్రాజెక్టు కోసం అత్యధిక మొత్తానికి అదానీ గ్రూప్‌ బిడ్‌ దాఖలు చేసిందని ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఫర్హద్‌ హకీమ్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో 25,000 మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని