పండగల వేళ చిన్న రుణాలకు గిరాకీ

కొవిడ్‌ పరిణామాలతో రెండేళ్లుగా పండగలు వెలవెలబోయాయి. గృహోపకరణాలు మొదలు, వాహనాల వరకు ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. ఫలితంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణ వృద్ధిపైనా ప్రతికూల ప్రభావం పడింది.

Updated : 20 Sep 2022 06:52 IST

రూ.5-50 వేల వరకు
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్‌ అంకురాలూ సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ పరిణామాలతో రెండేళ్లుగా పండగలు వెలవెలబోయాయి. గృహోపకరణాలు మొదలు, వాహనాల వరకు ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. ఫలితంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణ వృద్ధిపైనా ప్రతికూల ప్రభావం పడింది. ఈసారి కరోనా భయాలు దాదాపుగా అంతరించాయి. దీంతో రానున్న పండగల వేళ రిటైల్‌ రుణాలకు మళ్లీ గిరాకీ పెరుగుతుందని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్‌టెక్‌ అంకురాలూ భావిస్తున్నాయి. రుణగ్రహీతల అవసరాలకు తగ్గట్టుగా నిధులు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. దసరా, దీపావళి పండగల సందర్భంగా ఇ-కామర్స్‌ సైట్లు ప్రత్యేక ఆఫర్లతో, భారీ అమ్మకాలు చేపట్టనున్నాయి. ‘గృహోపకరణాలు, సరికొత్త స్మార్ట్‌ఫోన్లను ఇంటికి తెచ్చుకునేందుకు, అవసరమైతే రుణాలు తీసుకోవాలని ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రూ.12,000-50,000 విలువైన రిటైల్‌ రుణాల్లో వృద్ధి కనిపించే అవకాశం ఉంద’ని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఫిన్‌టెక్‌ సంస్థలు..
క్రెడిట్‌ స్కోరుతో సంబంధం లేకుండా రుణాలను అందించే ఫిన్‌టెక్‌ సంస్థలు, పీ2పీ రుణ సంస్థలు కొత్త రుణగ్రహీతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు  రూ.5 వేల నుంచీ రుణం మంజూరు చేస్తున్నాయి. గరిష్ఠంగా రూ.40-50వేల వరకు ఇస్తున్నాయి. వాయిదాల్లో సులభంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుండటంతో, కొన్ని ఫిన్‌టెక్‌ సంస్థల రుణ వితరణ దాదాపు 4 రెట్లకు పైగా వృద్ధి సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

బీఎన్‌పీఎల్‌కు ఆదరణ
బ్యాంకులతో పాటు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, ఫిన్‌టెక్‌ అంకురాలూ బీఎన్‌పీఎల్‌ (ఇప్పుడు కొనండి, తరవాత చెల్లించండి) సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఈ విధానంలో క్రెడిట్ స్కోరుకు అనుగుణంగా సులభంగా రుణం లభిస్తోంది. ఎక్కువ సంస్థలు గరిష్ఠంగా రూ.20వేల వరకే ఈ ఆఫర్‌ ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు  రూ.40వేల వరకు అందిస్తున్నాయి. నిర్ణీత వ్యవధి తర్వాత ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఇందులోని ప్రతికూలతగా చెప్పొచ్చు.

డిపాజిట్లలోనూ..
రుణ వృద్ధి పెరుగుతున్నందున, అందుకు కావాల్సిన నిధుల కోసం డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు ప్రత్యేక డిపాజిట్‌ పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌ బ్యాంక్‌లు ఇలాంటి ప్రత్యేక డిపాజిట్లపై 6.05- 6.10% వరకు వడ్డీనిస్తున్నాయి.

రుసుముల్లో రాయితీలు..
గృహ, వాహన రుణాల జారీనిమిత్తం వసూలు చేసే పరిశీలనా రుసుము, ఇతర ఛార్జీలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు డిసెంబరు 31 వరకు తీసుకునే రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజులో కొంత మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాయి.


ప్రత్యేక ఆఫర్లతో..

కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు బ్యాంకులూ కొత్త రుణ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి ముందుగానే రుణాలను మంజూరు (ప్రీ-అప్రూవల్‌) చేస్తున్నాయి. వేతన ఖాతాలు ఉన్న వారికి శాలరీ అడ్వాన్సు రుణాలు సైతం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకులు.. తమ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో ఇ-కామర్స్‌ సంస్థలు, సంప్రదాయ దుకాణాల్లో కొనుగోలు చేసినా, ప్రత్యేక రాయితీ ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. కొన్ని సంస్థల ఉత్పత్తులపై వడ్డీలేని సులభ వాయిదా, నగదు వాపసు వంటి సౌలభ్యాలను అందిస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని