ఆర్‌ఈసీకి మహారత్న హోదా

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్‌ఈసీకి మహారత్న హోదా దక్కింది. కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ హోదా పొందిన 12వ సంస్థగా ఆర్‌ఈసీ నిలిచింది.

Published : 23 Sep 2022 02:39 IST

ఈ ఘనత పొందిన 12వ ప్రభుత్వరంగ సంస్థ  

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్‌ఈసీకి మహారత్న హోదా దక్కింది. కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ హోదా పొందిన 12వ సంస్థగా ఆర్‌ఈసీ నిలిచింది. ఈ హోదా వల్ల ఆర్థిక నిర్ణయాలు తీసుకునే విషయంలో సంస్థ పాలకమండలికి విస్తృత అధికారాలు లభించనున్నాయి. దేశం లోపల, బయట సంయుక్త సంస్థలు, సంపూర్ణ యాజమాన్యహక్కులున్న అనుబంధ సంస్థలు, విలీనాలు, ఇతర సంస్థల స్వాధీనతకు ఈ సంస్థ పాలకమండలికి అధికారాలు లభిస్తాయి. ఒక్కో ప్రాజెక్టులో గరిష్ఠంగా రూ.5000 కోట్లు గానీ, లేదంటే తన నెట్‌వర్త్‌లో 15% మొత్తాన్ని కానీ పెట్టుబడి పెట్టడానికి వీలవుతుంది. సిబ్బంది, మానవ వనరుల నిర్వహణ, శిక్షణ వ్యవహారాలకు ఈ సంస్థ ప్రత్యేక విధానాన్ని అమలు  చేసుకోవచ్చు. ఇతర సంస్థలతో సాంకేతిక భాగస్వామ్యాలు, వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. దేశంలో విద్యుత్తు రంగానికి ఆర్థిక చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం 1969లో ఆర్‌ఈసీని ఏర్పాటుచేసింది.

మహారత్న హోదా లభించిన సందర్భంగా ఆర్‌ఈసీ సీఎండీ వివేక్‌ దేవాంగన్‌  మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలోనూ నిలకడగా పనితీరు కనబరచడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. 2021-22లో ఎన్నడూలేని విధంగా రూ.10,046 కోట్ల లాభం సంపాదించడంతో పాటు, కంపెనీ నికర విలువ రూ.50,986 కోట్లకు చేరిందని చెప్పారు. వనరుల సమర్థ నిర్వహణ, బలమైన ఆర్థిక విధానాలు ఇందుకు దోహదపడినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికీ, ప్రతింటికీ విద్యుత్తు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ గ్రామ జ్యోతి యోజన, సౌభాగ్య పథకాలను విజయవంతంగా నిర్వహించడంలో ఆర్‌ఈసీ కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు. డిస్కంల పునరుద్దరణ పథకం అమలులో ఆర్‌ఈసీ నోడల్‌ ఏజెన్సీ పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. మహారత్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గదర్శనం చేసిన కేంద్ర విద్యుత్తుశాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

* మూడేళ్లపాటు వరుసగా రూ.25వేల కోట్ల టర్నోవర్‌, రూ.15వేల కోట్ల నికరవిలువ, రూ.5వేల కోట్లకు పైగా నికర లాభం సాధించిన ప్రభుత్వరంగ సంస్థలకు ఈ హోదా ఇస్తారు.

* ఇప్పటివరకు మహారత్న హోదా పొందిన ప్రభుత్వరంగ సంస్థల్లో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, బీహెచ్‌ఈఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌, గెయిల్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని