యూపీఏ హయాంలో ఆర్థికం ఆగింది

భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ పాలనలో నిలిచిపోయాయని, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం నిర్ణయాలు కూడా తీసుకోలేకపోయిందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాకులు ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తి

Published : 25 Sep 2022 02:17 IST

ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి

అహ్మదాబాద్‌: భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ పాలనలో నిలిచిపోయాయని, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం నిర్ణయాలు కూడా తీసుకోలేకపోయిందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాకులు ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తి వెల్లడించారు. అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎంఏ) విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలతో ముచ్చటించిన ఆయన ‘ప్రపంచంలో అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థ అయిన చైనాను ఢీ కొట్టాలంటే మన దేశ యువత మేధస్సు చాలా కీలకమ’ని పేర్కొన్నారు. ‘లండన్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బోర్డులో 2008-2012 మధ్య కాలంలో నేను సభ్యుడిగా ఉన్నాను. తొలుత కొన్నేళ్లు బోర్డు సమావేశాల్లో చైనా పేరు రెండు, మూడు సార్లు వినిపించగా, మన దేశం పేరు ఒకసారి వినిపించేది. 2012లో నేను బోర్డు నుంచి బయటకొచ్చే ముందు కూడా మన దేశం పేరు ఒకసారే వినిపించగా, చైనా పేరు 30 సార్లు ప్రస్తావనకు వచ్చేది. మన్మోహన్‌ సింగ్‌ వ్యక్తిగతంగా అసాధారణ వ్యక్తి. ఆయన పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ యూపీఏ హయాంలో భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిర్ణయాలు కూడా ఆలస్యంగా తీసుకునేవారు. అందుకే నేటి యువత మన దేశం పేరు ఇతర దేశాల్లో మార్మోగేలా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా చైనాతో పోటీ పడాలి. మీరు ఆ పని చేయగలరని నమ్ముతున్నా. పశ్చిమ దేశాలు ఒకప్పుడు మన దేశాన్ని తక్కువ దృష్టితో చూసేవారు. కానీ ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. 1991లో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల తరహాలోనే భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ‘మేకిన్‌ ఇండియా’, స్టార్టప్‌ ఇండియా’ వంటి పథకాలు తీసుకురావడం కలిసొచ్చింది. నేను వయసులో ఉన్నప్పుడు నా మీద గానీ, దేశం మీద గానీ అంచనాలు లేవు. కానీ ఇప్పుడు మీ మీద చాలా అంచనాలున్నాయి. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. చైనాకు గట్టి పోటీదారుగా భారత్‌ను నిలపాలి. మనకంటే ఆ దేశం 6 రెట్లు ఎక్కువ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. 44 ఏళ్లలో (1978-2022) చైనా మనల్ని చాలా వెనక్కి నెట్టింది. 6 రెట్లు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ మీరు తలచుకొంటే చైనాకు దక్కుతున్న గౌరవం మన దేశానికి లభిస్తుంద’ని నారాయణమూర్తి విద్యార్థులకు, యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని