రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గించిన భారత్‌

రవాణా వ్యయం అధికం కావడంతోనే రష్యా నుంచి ఈఎస్‌పీఓ రకం ముడి చమురు దిగుమతిని మనదేశం మళ్లీ తగ్గించింది. అదే రకం ముడి చమురును మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే బ్యారెల్‌కు 5-7 డాలర్ల మేర ధర తక్కువ కావడమే

Published : 25 Sep 2022 02:17 IST

రవాణా వ్యయం అధికం కావడంతోనే రష్యా నుంచి ఈఎస్‌పీఓ రకం ముడి చమురు దిగుమతిని మనదేశం మళ్లీ తగ్గించింది. అదే రకం ముడి చమురును మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే బ్యారెల్‌కు 5-7 డాలర్ల మేర ధర తక్కువ కావడమే ఇందుకు కారణం. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించాక రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అప్పుడు మన దేశానికి తక్కువ ధరకు ముడి చమురును రష్యా ఆఫర్‌ చేయడంతో, దేశీయ చమురు సంస్థలు భారీగా దిగుమతి చేసుకోవడం ప్రారంభించాయి. తదుపరి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ముడిచమురు దిగుమతికి అవుతున్న రవాణా వ్యయాలు కూడా కలిపితే, మధ్య ప్రాచ్య దేశాల నుంచి దిగుమతికే బ్యారెల్‌కు 5-7 డాలర్లు తక్కువ అయినట్లు తేలింది. అందువల్లే గత నెలలో యూఏఈకి చెందిన ముర్బాన్‌ తదితర దేశాల నుంచి ఇదే గ్రేడ్‌ ముడి చమురును మనదేశం అధికంగా దిగుమతి చేసుకుంది. మన రిఫైనరీ సంస్థలు సెప్టెంబరులో రష్యా ఈఎస్‌పీఓ ముడి చమురు దిగుమతిని నిలిపేసి ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయని సమాచారం. చైనా తర్వాత రష్యా నుంచి అత్యంత భారీగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌, ఈ నెలలో అక్కడి దిగుమతులు తగ్గించడం గమనార్హం.
నీ జూన్‌లో రికార్డు గరిష్ఠ స్థాయిలో రష్యా నుంచి మన దేశానికి ముడి చమురు దిగుమతి జరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నెలలో సుమారు 2 మిలియన్‌ టన్నుల (14.35 మి.బ్యారెళ్ల) ముడి చమురు మాత్రమే రష్యా నుంచి దిగుమతి అయ్యింది. ఆగస్టులో 3.55 మి.టన్నుల (5,85,090 టన్నుల ఈఎస్‌పీఓ ముడిచమురుతో కలిపి) ముడి చమురును రష్యా నుంచి మన దేశం దిగుమతి చేసుకుంది. ఆఫ్రికా నుంచి ఆగస్టులో 1.16 మి.టన్నులు దిగుమతి కాగా, ఈ నెలలో 2.35 మి.టన్నుల ముడి చమురు మన దేశానికి దిగుమతి అయ్యిందని రెఫినిటివ్‌ డేటా వెల్లడిస్తోంది.
* ఫలితంగా రష్యా ఈఎస్‌పీఓ ఎగుమతులు సెప్టెంబరులో రోజుకు 7,20,000 బ్యారెళ్లకు పడిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని