ఔషధ అనుబంధ పరిశ్రమలకూ పీఎల్‌ఐ

బ్రాండెడ్‌ ఔషధ ఉత్పత్తులను తయారు చేసేందుకు వస్తు, సేవలు అందిస్తున్న కంపెనీలకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలను వర్తింపజేయాలని భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి ప్రసాద్‌ కోరారు.

Published : 26 Sep 2022 02:13 IST

భారత్‌ బయోటెక్‌ ఈడీ సాయి ప్రసాద్‌ సూచన

దిల్లీ: బ్రాండెడ్‌ ఔషధ ఉత్పత్తులను తయారు చేసేందుకు వస్తు, సేవలు అందిస్తున్న కంపెనీలకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలను వర్తింపజేయాలని భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి ప్రసాద్‌ కోరారు. బ్రాండెడ్‌ ఫార్మా ఉత్పత్తులకు ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌, ఇతర సేవలు అందిస్తున్న సంస్థల వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతోందని, కనుక వీటికీ పీఎల్‌ఐ పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు. ఫార్మాస్యూటికల్‌ సరఫరా వ్యవస్థలో సింగిల్‌-యూజ్‌ కన్జూమర్‌ కంపెనీలు, ముడి పదార్థాల ప్యాకేజింగ్‌ సంస్థలు, ఇతర సర్వీస్‌ ప్రొవైడర్లకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. మొత్తం వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే, బ్రాండెడ్‌ కంపెనీలు బలంగా ఉంటాయని వివరించారు. కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో వివిధ రకాల ముడి పదార్థాలు, ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. దేశీయంగా సరిపడా వాటిని ఉత్పత్తి చేయకపోవడమే అందుకు కారణమన్నారు.

* ప్రస్తుతం భారీమొత్తాల్లో తయారీపై కంపెనీలు ఎక్కువ దృష్టి సారించాయని.. అయితే లాభదాయకత పెంచుకునేందుకు వినూత్న ఔషధ ఉత్పత్తుల వైపు దృష్టి సారించాలని ఆయన ఫార్మా కంపెనీలకు సూచించారు. వ్యాక్సిన్ల సంస్థలు పరిశోధన-అభివృద్ధిపై మరింతగా పనిచేయాలన్నారు. 

* ప్రస్తుతం ప్రభుత్వం ఫార్మాస్యూటికల్స్‌ విభాగం (డీఓపీ) ద్వారా 3 పీఎల్‌ఐ పథకాలను అమలుపరుస్తోంది. ఇందులో బల్క్‌ డ్రగ్స్‌ (రూ.6,940 కోట్లు), వైద్య పరికరాలు (రూ.3,420 కోట్లు), ఫార్మాస్యూటికల్స్‌ (రూ.15,000 కోట్లు) ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని