56900-57300 శ్రేణి కీలకం!

బలహీన అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా రెండో వారం మార్కెట్లు నష్టపోయాయి. అమెరికా ఫెడ్‌ మరోసారి 75 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచగా..

Published : 26 Sep 2022 02:15 IST

సమీక్ష: బలహీన అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా రెండో వారం మార్కెట్లు నష్టపోయాయి. అమెరికా ఫెడ్‌ మరోసారి 75 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచగా.. బ్రిటన్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంకులూ ఇదే బాటలో నడవడం మదుపర్లను కలవరపెట్టింది. ఎఫ్‌ఐఐలు నికర విక్రేతలుగా నిలవగా, డాలర్‌ సూచీ రెండు దశాబ్దాల గరిష్ఠానికి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి తాజా జీవనకాల కనిష్ఠమైన 81.23 తాకడం ప్రతికూల ప్రభావం చూపింది. కార్పొరేట్‌ వార్తలు, ప్రభుత్వ ప్రకటనలతో షేరు, రంగం ఆధారిత కదలికలు కొనసాగాయి. 2022-23లో భారత వృద్ధి రేటు అంచనాను ఏడీబీ 7 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం పెరిగి రూ.7 లక్షల కోట్లకు చేరాయి. మాంద్యం భయాలతో బ్యారెల్‌ ముడిచమురు ధర 5.7 శాతం తగ్గి 86.2 డాలర్లకు పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 79.6 నుంచి 81.09కు బలహీనపడింది. అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయని అమెరికా ఫెడ్‌ సంకేతాలు ఇచ్చింది. ఇందువల్ల మాంద్యం రావొచ్చన్న భయాలు పెరిగాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.3 శాతం నష్టంతో 58,099 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.2 శాతం తగ్గి 17,327 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విద్యుత్‌, స్థిరాస్తి, యంత్రపరికరాల షేర్లు డీలాపడ్డాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, వాహన స్క్రిప్‌లు రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.4,632 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.1,137 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. సెప్టెంబరులో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) రూ.8,638 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:3గా నమోదు కావడం.. పెద్ద షేర్లలో
అమ్మకాల ఒత్తిడి కొనసాగడాన్ని సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గత వారం 60,100 వరకు వెళ్లిన సెన్సెక్స్‌, లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చింది. ప్రస్తుతం కీలక మద్దతు అయిన 56900- 57300 పాయింట్ల శ్రేణి దరిదాపుల్లో ట్రేడవుతోంది. ఈ స్థాయిని కోల్పోతే స్వల్పకాలంలో 55800 పాయింట్లు, ఆ తర్వాత 54,800 పాయింట్ల వరకు పడే అవకాశం ఉంది.

ప్రభావిత అంశాలు: ఈనెల 28-30 తేదీల్లో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరగనుండటం, సెప్టెంబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు 29న ముగియనున్నందున దేశీయ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చు. ఈసారి ఆర్‌బీఐ 50 బేసిస్‌ పాయింట్ల మేర కీలక రేట్లు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కమొడిటీ ధరలు తగ్గడంతో ఆర్‌బీఐ ధోరణి ‘తటస్థం’గా మారితే మార్కెట్లకు సానుకూలం కానుంది. పండగల సీజన్‌ నేపథ్యంలో ఎఫ్‌ఎమ్‌సీజీ, వినియోగదారు వస్తువులు, వాహన, రిటైల్‌ రంగ షేర్లు వెలుగులోకి రావొచ్చు. వడ్డీ రేట్ల ఆధారిత షేర్లపై మదుపర్లు అప్రమత్తత పాటించొచ్చు. ఆగస్టు మౌలిక రంగ గణాంకాలు వెలువడనున్నాయి. కార్పొరేట్‌ వార్తలు, పరిణామాల ప్రభావంతో షేరు ఆధారిత కదలికలు కొనసాగొచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. జపాన్‌ తయారీ పీఎంఐ, చైనా పారిశ్రామిక లాభాలు, తయారీ పీఎంఐ, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పరపతి సమావేశ నిర్ణయాలు, అమెరికా రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు కీలకం కానున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, ముడిచమురు ధరల నుంచీ సంకేతాలు తీసుకోవచ్చు. రూపాయి మరింత క్షీణిస్తే సెంటిమెంట్‌ బలహీనం కానుంది.

తక్షణ మద్దతు స్థాయులు: 57,367, 56,857, 55,816
తక్షణ నిరోధ స్థాయులు: 58,700, 59,144, 59,800
సెన్సెక్స్‌ 56,900- 57,300 దిగువన మరింత బలహీనపడొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని