ఓసీటీఎల్‌పై దివాలా ప్రక్రియ విరమించుకున్న ఎస్‌బీఐ

కామినేని హాస్పిటల్స్‌ యాజమాన్య సంస్థ ఓసీటీఎల్‌ (ఆయిల్‌ కంట్రీ టూబ్యులర్‌ లిమిటెడ్‌)పై రెండేళ్ల క్రితం ప్రారంభించిన దివాలా ప్రక్రియను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా విరమించుకుంది. ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకులతో

Published : 27 Sep 2022 02:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: కామినేని హాస్పిటల్స్‌ యాజమాన్య సంస్థ ఓసీటీఎల్‌ (ఆయిల్‌ కంట్రీ టూబ్యులర్‌ లిమిటెడ్‌)పై రెండేళ్ల క్రితం ప్రారంభించిన దివాలా ప్రక్రియను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా విరమించుకుంది. ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకులతో బకాయిల చెల్లింపునకు సంబంధించి కంపెనీ ఒక ఒప్పందానికి రావడమే ఇందుకు కారణం. దీంతో ఈ సంస్థపై దివాలా ప్రక్రియను విరమించుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌), హైదరాబాద్‌ బెంచ్‌ అనుమతించింది. ఓసీటీఎల్‌పై 2020 జనవరిలో ఎస్‌బీఐ సారథ్యంలో రుణదాతల బృందం దాఖలు చేసిన దివాలా ప్రక్రియను ఎన్‌సీఎల్‌టీ అనుమతించి, ఆర్‌పీ (రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌)ని నియమించింది. ఈ నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం బ్యాంకర్లతో సంప్రదింపులు చేపట్టి, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కు ఒప్పందం కుదుర్చుకుంది. తొలుత ఓటీఎస్‌కు ఎస్‌బీఐ అంగీకరించ లేదు. తదుపరి తన అనుమతి తెలియజేసింది. దీంతో రుణదాతల బృందం 100 శాతం ఓటింగ్‌తో దివాలా ప్రక్రియను విరమించుకోవాలని నిర్ణయించింది. ఓటీఎస్‌ కింద బ్యాంకులకు ఓసీటీఎల్‌ రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కంపెనీ ఇప్పటికే రూ.60.54 కోట్లు చెల్లించింది. ఫలితంగా ఓసీటీఎల్‌పై దివాలా ప్రక్రియ విరమించుకునేందుకు ఈ నెల 17న ఎన్‌సీఎల్‌టీ అనుమతి మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని