అమరరాజా బ్యాటరీస్‌లో ప్లాస్టిక్‌ విడిభాగాల వ్యాపారం విలీనం

అమరరాజా గ్రూపు సంస్థ అయిన మంగళ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నుంచి ‘బ్యాటరీలకు అవసరమైన ప్లాస్టిక్‌ విడిభాగాలు తయారు చేసే వ్యాపారాన్ని’ విభజించి, అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు.

Published : 27 Sep 2022 02:27 IST

లాభదాయకత పెంచుకునే లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: అమరరాజా గ్రూపు సంస్థ అయిన మంగళ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నుంచి ‘బ్యాటరీలకు అవసరమైన ప్లాస్టిక్‌ విడిభాగాలు తయారు చేసే వ్యాపారాన్ని’ విభజించి, అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కార్యకలాపాల నిర్వహణ సులువు కావడంతో పాటు లాభదాయకత పెరుగుతుందని అమరరాజా బ్యాటరీస్‌ భావిస్తోంది. మంగళ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పలు రకాల ప్లాస్టిక్‌ కంటైనర్లు, కవర్లు, చిన్న విడిభాగాలు, హ్యాండిల్స్‌, జార్స్‌ ఉత్పత్తి చేసి పూర్తిగా అమరరాజా బ్యాటరీస్‌కే సరఫరా చేస్తోంది. 3 యూనిట్లలో 37,000 టన్నుల ప్లాస్టిక్‌ విడిభాగాలు ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఇప్పుడు అమరరాజా బ్యాటరీస్‌ కిందకు తీసుకు రావడం వల్ల ఏటా రూ.5 - 6 కోట్ల మేరకు అదనంగా లాభాన్ని ఆర్జించే అవకాశం ఉందని అమరరాజా బ్యాటరీస్‌ పేర్కొంది. ఈ ప్రక్రియ కోసం రికార్డు తేదీ నాటికి మంగళ్‌ ఇండస్ట్రీస్‌ వాటాదార్లకు, ఆ సంస్థలో ఉన్న ప్రతి 74 షేర్లకు, అమరరాజా బ్యాటరీస్‌కు చెందిన 65 షేర్లు కేటాయిస్తారు. అమరరాజా బ్యాటరీస్‌లో ప్రమోటర్ల వాటా ప్రస్తుత 28.06 శాతం నుంచి, విలీనం పూర్తయ్యాక 32.86 శాతానికి పెరుగుతుంది. వాటాదార్లకు మేలు చేసేందుకే ప్లాస్టిక్‌ విడిభాగాల వ్యాపారాన్ని అమరరాజా బ్యాటరీస్‌ కిందకు తీసుకువస్తున్నట్లు సంస్థ సీఎండీ జయదేవ్‌ గల్లా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని