‘పౌండ్‌’ విలువా పతన బాటే

బ్రిటన్‌ కరెన్సీ పౌండ్‌ విలువ అమెరికా డాలరుతో పోలిస్తే కొత్త జీవన కాల కనిష్ఠానికి చేరింది. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారొచ్చనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న వేళ.. ప్రభుత్వం భారీగా పన్ను కోతలు ప్రకటించడం మదుపర్లలో ఆందోళనకు దారి తీసింది.

Published : 27 Sep 2022 02:27 IST

లండన్‌: బ్రిటన్‌ కరెన్సీ పౌండ్‌ విలువ అమెరికా డాలరుతో పోలిస్తే కొత్త జీవన కాల కనిష్ఠానికి చేరింది. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారొచ్చనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న వేళ.. ప్రభుత్వం భారీగా పన్ను కోతలు ప్రకటించడం మదుపర్లలో ఆందోళనకు దారి తీసింది. ఇదే.. కరెన్సీ విలువ క్షీణతకు కారణమైంది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో 1.07 డాలర్ల ఎగువన కదలాడిన పౌండు విలువ.. ఆ తర్వాత 1.0373 డాలర్లకు పడిపోయింది. 1971లో కరెన్సీ డెసిమలైజేషన్‌ తర్వాత పౌండ్‌కు ఇదే జీవనకాల కనిష్ఠ స్థాయి. 50 ఏళ్లలోనే అత్యధిక పన్నుల కోతను ప్రకటించాక... శుక్రవారం నుంచి పౌండు విలువ 5 శాతం వరకు క్షీణించడం గమనార్హం. ఇటీవలే అధికార పగ్గాలు చేపట్టిన లిజ్‌ ట్రస్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం 45 బిలియన్‌ పౌండ్ల (49 బిలియన్‌ డాలర్ల) విలువ మేర పన్ను కోతలను విధించే ప్రణాళికను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐరోపా భవిష్యత్తు అంధకారంగా.. ఈసీబీ: ఐరోపా ఆర్థిక భవిష్యత్‌ అంధకారంగా మారుతోందని ఐరోపా కేంద్ర బ్యాంక్‌ (ఈసీబీ) అధిపతి క్రిస్టీన్‌ లగార్డే పేర్కొన్నారు. రాబోయే నెలల్లో వ్యాపార కార్యకలాపాలు నెమ్మదించొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపా ప్రాంతం మాంద్యంలోకి జారుకునే అంశంపై ఆమె ఐరోపా పార్లమెంట్‌కు వివరణ ఇచ్చారు. ఆర్థికాభివృద్ధి మందకొడిగానే ఉందని, రష్యా సహజవాయువు సరఫరా వంటి పరిణామాలు ఆనిశ్చితి పెంచాయన్నారు. 2022 నాలుగో త్రైమాసికంతో పాటు 2023 మొదటి మూడు నెలల్లో ప్రతికూల వృద్ధి నమోదుకావొచ్చని అంచనా వేశారు. వరుసగా రెండు త్రైమాసికాల పాటు ప్రతికూల వృద్ధి నమోదైతే మాంద్యంగా పరిగణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని