వాహనాలకు పండగ ఉత్సాహం!

దసరా - దీపావళి పండగల సమయంలో కొత్త వాహనాలు కొనేందుకు అధికులు ఉత్సాహం చూపుతారు. కొవిడ్‌ పరిణామాలు, చిప్‌ కొరత వల్ల గత రెండేళ్లు విక్రయాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ అవరోధాలు తొలగినందున,

Updated : 27 Sep 2022 10:41 IST

దసరా - దీపావళి పండగల సమయంలో కొత్త వాహనాలు కొనేందుకు అధికులు ఉత్సాహం చూపుతారు. కొవిడ్‌ పరిణామాలు, చిప్‌ కొరత వల్ల గత రెండేళ్లు విక్రయాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ అవరోధాలు తొలగినందున, వాహన కంపెనీలు ఈసారి తమ విక్రయాలు పెంచుకునేందుకు సరికొత్త మోడళ్లను విడుదల చేస్తూ, సులభ వాయిదాలపై కొనుగోలుకు రుణ సదుపాయాన్నీ కల్పిస్తున్నాయి.


గ్రాండ్‌ విటారా రూ.10.45-19.65 లక్షలు

వేగంగా వృద్ధి చెందుతున్న మధ్య స్థాయి స్పోర్ట్స్‌ వినియోగ విభాగంలో గ్రాండ్‌ విటారాను మారుతీ సుజుకీ ఇండియా సోమవారం విడుదల చేసింది. వీటి ధరల శ్రేణి రూ.10.45-19.65 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ). 1.5 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రెయిన్‌ మేటెడ్‌, స్ట్రాంగ్‌ అండ్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారు, హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, టాటా హారియర్‌లతో  పోటీ పడబోతోంది. ఇప్పటికే ఈ మోడల్‌కు 57,000 బుకింగ్‌లు లభించాయని కంపెనీ ఎండీ, సీఈఓ హిసాషి టకూచి వెల్లడించారు. మైల్డ్‌ టెక్నాలజీ మేటెడ్‌ 5-స్పీడ్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌ ధరలు రూ.10.45-17.05 లక్షలుగా ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి 21.11 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని కంపెనీ తెలిపింది. సుజుకీ పేటెంట్‌ ఆల్‌ గ్రిప్‌ టెక్నాలజీతో రూపొందిన ఆల్‌గ్రిప్‌ సెలెక్ట్‌ ట్రిమ్‌ వాహన ధర రూ.16.89 లక్షలుగా ఉంది. స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌తో రూపొందిన వేరియంట్లు రూ.17.99-19.65 లక్షల మధ్య ఉన్నాయని, ఇవి 27.97 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని కంపెనీ తెలిపింది. దేశ వ్యాప్తంగా 420 నెక్సా విక్రయ కేంద్రాల్లో విక్రయిస్తున్నట్లు పేర్కొంది.


టాటా మోటార్స్‌ 4 పికప్‌ మోడళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యామ్నాయ ఇంధనం, విద్యుత్‌ వాణిజ్య వాహనాల అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీష్‌ వాఘ్‌ తెలిపారు. ఇందుకోసం ఏటా రూ.2,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నామని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వెల్లడించారు. సోమవారం టాటా మోటార్స్‌ కొత్తగా తీసుకొచ్చిన పికప్‌ వాహనాలు యోధా 2.0 (1200- 2,000 కిలోల పేలోడ్‌), ఇంట్రా వి 50 (1500 కిలోలు), ఇంట్రా వి20 (సీఎన్‌జీ - పెట్రోలు, 1,000 కిలోల పేలోడ్‌) మోడళ్లను హైదరాబాద్‌ నుంచి దేశీయ విపణిలోకి విడుదల చేసిన వాఘ్‌ ఈ వివరాలు వెల్లడించారు. యోధా 2.0 ప్రారంభ ధర రూ.9.9 లక్షలు, యోధా ఈఎక్స్‌ ధర రూ.10.74లక్షలు, ఇంట్రా వీ50 ధర రూ.8.67 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉన్నాయి.

ఇప్పటికే సరకు రవాణా విభాగంలో ఆవిష్కరించిన టాటా ఏస్‌ ఈవీని అక్టోబరు నుంచి డెలివరీ చేయబోతున్నట్లు వివరించారు. మధ్యస్థాయి, తేలికపాటి వాణిజ్య వాహనాల విభాగంలో 40 శాతం, చిన్న వాణిజ్య వాహనాల్లో 20 శాతం సీఎన్‌జీ మోడళ్లు ఉంటాయని తెలిపారు. 3700 కోట్ల డాలర్ల వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్‌ అగ్రగామిగా ఉందని, తేలికపాటి వాణిజ్య వాహనాల విభాగంలో 40శాతం మార్కెట్‌ వాటా తమ సొంతమని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, ఎఫ్‌ఎంసీజీ, ఇ-కామర్స్‌, లాజిస్టిక్స్‌ రంగాల్లో కొత్త వాహనాలకు గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

2021-22లో టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల విభాగం 36 శాతం వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. వాణిజ్య వాహనాల విభాగంలో స్థానిక గిరాకీ, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఇంధన ధరలు కీలకం అని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 26 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. బస్సులతో పాటు, తేలికపాటి వాణిజ్య వాహనాల్లో విద్యుత్‌ మోడళ్లు తీసుకొస్తామని, క్రమంగా ఇతర వాహనాలకూ విస్తరిస్తామని తెలిపారు.


హీరో మోటోకార్ప్‌ 8 కొత్త మోడళ్లు

ఈ పండుగ సీజన్‌లో వినియోగదారు సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకునేందుకు హీరో మోటోకార్ప్‌ సిద్ధమవుతోంది. ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ స్టెల్త్‌ 2.0 ఎడిషన్‌ మొదలుకుని హెచ్‌ఎఫ్‌ సిరీస్‌, స్ల్పెండర్‌+, గ్లామర్‌లో 8 కొత్త వేరియంట్లను త్వరలోనే తీసుకొస్తామని సంస్థ తెలిపింది.  


కవాసాకి కొత్త బైక్‌లు జీ రూ.1.47-1.49 లక్షలు

‘భారత్‌ తయారీ’ డబ్ల్యూ175ఎంవై23ను దేశీయ విపణిలో కవాసాకి విడుదల చేసింది. ఈ బైక్‌ల ధరలు రూ.1.47-1.49 లక్షలు. ఈ బైక్‌ను స్టాండర్డ్‌, స్పెషల్‌ ఎడిషన్‌ వేరియంట్లలో తీసుకొచ్చింది. వీటి డెలివరీలు డిసెంబరులో మొదలవుతాయని, ప్రారంభ ధర పరిమిత బైక్‌లకే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని