స్థిరాస్తిలో పెట్టుబడులకే అధికుల మొగ్గు

రానున్న రోజుల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కొనుగోలుదారులు భావిస్తున్నారు. దీనివల్ల స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువమంది మొగ్గు చూపిస్తున్నారని హౌసింగ్‌.కామ్‌- నరెడ్కో సర్వే వెల్లడించింది.

Updated : 27 Sep 2022 11:25 IST

ఇళ్ల ధరలు పెరుగుతాయనే నమ్మకం వల్లే
హౌసింగ్‌.కామ్‌-నరెడ్కో సర్వే

దిల్లీ: రానున్న రోజుల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కొనుగోలుదారులు భావిస్తున్నారు. దీనివల్ల స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువమంది మొగ్గు చూపిస్తున్నారని హౌసింగ్‌.కామ్‌- నరెడ్కో సర్వే వెల్లడించింది. ఇందులో పాల్గొన్న 47 శాతం మంది స్థిరాస్తిని మంచి పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు. 21 శాతం మంది స్టాక్‌ మార్కెట్‌ మేలని అనుకుంటుండగా, 16 శాతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, 15 శాతం బంగారాన్ని నమ్ముతామని తెలిపారు. సోమవారం విడుదల చేసిన ‘రెసిడెన్షియల్‌ రియాల్టీ కన్జూమర్‌ సెంటిమెంట్‌ సర్వే 2022’ రెండో అర్ధ వార్షిక సర్వేలో ఈ విషయాలున్నాయి. రానున్న రోజుల్లో ఇళ్ల ధరలు పెరుగుతాయని 48 శాతం మంది భావిస్తున్నారు. సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనేందుకు 58 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. కొవిడ్‌ తర్వాత సొంత ఇల్లు సమకూర్చుకుందామని - ఆర్థిక భద్రత గురించి అధికులు భావిస్తున్నందున, గిరాకీ పెరుగుతోందని హౌసింగ్‌.కామ్‌ గ్రూపు సీఈఓ ధ్రువ్‌ అగర్వాలా తెలిపారు. వడ్డీ రేట్లు, నిర్మాణ ఖర్చులు అధికమవుతున్నందున, ధరలు పెరిగేందుకు ఆస్కారం ఉందన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల స్థిరాస్తి రంగంలో వృద్ధి వేగంగా ఉందని నరెడ్కో ప్రెసిడెంట్‌ రాజన్‌ బందాల్కర్‌ అన్నారు. వడ్డీ రేట్లు పెరుగుతున్నా, దేశ వ్యాప్తంగా నివాస గృహాల మార్కెట్‌ వృద్ధి చెందుతోందని తెలిపారు.  


వీనస్‌ కొత్త వాటర్‌ హీటర్లు

హైదరాబాద్‌: ప్రముఖ వాటర్‌ హీటర్ల సంస్థ వీనస్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సరికొత్తగా 2 ఇన్‌స్టంట్‌, 2 స్టోరేజ్‌ వాటర్‌ హీటర్‌ మోడళ్లను వేర్వేరు సామర్థ్యాల్లో విపణిలోకి విడుదల చేసింది. వినియోగదార్లు కోరుకునే మన్నిక, సౌలభ్యం వంటి వాటిని దృష్టి ఉంచుకుని కొత్త వాటర్‌హీటర్లను తీసుకొచ్చినట్లు వీనస్‌ హోమ్‌ ఎండీ రామ్‌కుమార్‌ తెలిపారు. స్ల్పాష్‌ ప్రో సిరీస్‌లో భాగంగా స్ల్పాష్‌ ప్రో, స్ల్పాష్‌ ప్రో స్మార్ట్‌, స్ల్పాష్‌ ప్రో ఐఓటీ మోడళ్లను 6, 10, 25, 25 లీటర్ల సామర్థ్యాలతో అందుబాటులోకి తెచ్చింది. ఇన్నర్‌ ట్యాంక్‌పై 7 ఏళ్లు, హీటింగ్‌ ఎలిమెంట్‌పై 4 ఏళ్లు, ఉత్పత్తిపై రెండేళ్ల గ్యారెంటీ ఇస్తున్నారు. వీటితో పాటు వెక్ట్రా స్టోరేజ్‌ హీటర్‌, బ్రిజో, జిఫ్పీ ఇన్‌స్టంట్‌ వాటర్‌ హీటర్లు లభించనున్నాయి. ఇటీవలే కంపెనీ తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోకు ఫ్యాన్‌లు, ఎలక్ట్రిక్‌ ఓవెన్‌లు వంటి చిన్న గృహోపకరణాలను చేర్చింది.


ఇళ్లకు ఎయిర్‌టెల్‌ నిఘా కెమేరాలు

దిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌.. ఇళ్లకు నిఘా కెమేరాలు అమర్చే వ్యాపారం ‘ఎక్స్‌సేఫ్‌’ లోకి అడుగుపెట్టింది. తొలుత 40 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించినట్లు సోమవారం ప్రకటించింది. ఇంటి లోపల, బయటి ఆవరణకు కావాల్సిన కెమేరాలను కొనుగోలు చేసుకోవడంతో పాటు, ఇన్‌స్టలేషన్‌ ఛార్జీలను వినియోగదారుడే చెల్లించాలి. ఒక ఏడాది కాలావధికి తొలి కెమేరాకు రూ.999, అదనపు కెమేరాలకు ఒక్కో దానికి రూ.699 చొప్పున సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీ వసూలు చేయనున్నట్లు తెలిపింది. ‘విధుల రీత్యా కార్యాలయాలు, వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు, తాము ఎంతగానో ప్రేమిస్తున్న కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్నామని మా ఖాతాదార్లు పలుమార్లు ప్రస్తావించారు. ఎక్కడినుంచైనా తమ వారిని అనుక్షణం గమనించేందుకు ఎక్స్‌సేఫ్‌ సేవలు ఉపయోగ పడతాయి. కెమేరాలోని 2-వే కమ్యూనికేషన్‌ వ్యవస్థ ద్వారా ఇంట్లో ఉన్న వారితో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంద’ని భారతీ ఎయిర్‌టెల్‌ - హోమ్స్‌ సీఈఓ వీర్‌ ఇందర్‌ నాథ్‌ వెల్లడించారు. ఏ ప్రాంతం నుంచైనా వినియోగదార్లు రికార్డెడ్‌ వీడియోను యాక్సెస్‌ చేసేందుకు వీలుగా 7 రోజుల స్టోరేజీని క్లౌడ్‌ ద్వారా నిక్షిప్తం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆందోళనకర పరిస్థితులు ఏర్పడితే, యాప్‌ ద్వారా రియల్‌టైమ్‌ అలర్ట్‌లు కూడా వస్తాయన్నారు. ఇప్పటికే ఉన్న వైఫై కనెక్షన్‌ గానీ లేదంటే కొత్త ప్రత్యేక కనెక్షన్‌ తీసుకుని గానీ ఈ సేవ వినియోగించుకోవచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని