రూపాయి దారెటు!

డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇంకా బలహీనపడింది. ఎన్నడూ లేనంతగా డాలర్‌ విలువ రూ.81.67 కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతోందనే భయాలు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి  చేయడానికి వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతూ ఉన్నాయి.

Updated : 27 Sep 2022 07:04 IST

డాలర్‌తో పోల్చితే 81.67 కి పతనం
ద్రవ్యోల్బణం, మాంద్యం భయాల వల్లే
మన కరెన్సీలో విదేశీ వాణిజ్యం ఉపకరిస్తుందా?

డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇంకా బలహీనపడింది. ఎన్నడూ లేనంతగా డాలర్‌ విలువ రూ.81.67 కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతోందనే భయాలు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి  చేయడానికి వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతూ ఉన్నాయి. అమెరికాలో బాండ్లపై వడ్డీరేట్లు పెరగడం, డాలర్‌ బలంగా మారడంతో, సురక్షితమని భావిస్తున్నవారు పెట్టుబడులను అమెరికా మళ్లిస్తున్నారు. దీనివల్ల దాదాపు అన్ని దేశాల కరెన్సీ విలువలు క్షీణిస్తున్న విషయం విదితమే.

ఆసియా ప్రాంతంలోని ప్రధానమైన చైనా (యువాన్‌), జపాన్‌ (యెన్‌) కరెన్సీల విలువలు కూడా డాలర్‌తో పోలిస్తే పతనం కావడంతో పెట్టుబడిదార్లు వర్థమాన మార్కెట్లలో విక్రయాలు జరిపి, నిధులను వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇదే రూపాయి విలువ క్షీణతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. విదేశీ ఎగుమతి, దిగుమతుల లావాదేవీలను రూపాయల్లో నిర్వహించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, కొంతమేరకు అయినా రూపాయి విలువను కాపాడతాయనే అంచనాలున్నాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం 81.09 కాగా, సోమవారం మరో 58 పైసలు క్షీణించి 81.67కు దిగివచ్చింది. 4 ట్రేడింగ్‌ రోజుల్లోనే రూపాయి విలువ 193 పైసలు పతనమైంది. ఇప్పటికే వివిధ దేశాల కరెన్సీ విలువలు పతనం అవుతున్నాయి. వాటితో పోల్చితే రూపాయి పతనం తక్కువగానే ఉంది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం దిగి రాని పక్షంలో రూపాయి విలువ ఇంకా తగ్గిపోవచ్చని ఫారెక్స్‌ (విదేశీ మారకపు నిల్వల) మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.   రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈనెల 30న పరపతి విధానాన్ని ప్రకటించనుంది. కీలక వడ్డీరేట్లను మరో 0.50 శాతం పెంచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత రూపాయి మారకపు విలువపై స్పష్టత వస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి డాలర్‌ విలువ రూ.80.50- 82.00 మధ్య ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది.

రూపాయి వర్తకం ఆదుకుంటుందా

ఇటీవల కాలంలో అంతర్జాతీయ వర్తకాన్ని రూపాయిల్లో (రూపీ ట్రేడ్‌) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అంటే మనదేశం నిర్వహించే ఎగుమతులు- దిగుమతులకు డాలర్ల బదులు రూపాయిల్లో చెల్లింపులు జరుగుతాయి. రష్యా, ఇరాన్‌, యూఏఈ దేశాలు దీనికి సుముఖత వ్యక్తం చేసి, విధివిధానాలు ఖరారు చేసే యత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తేయాకు, ముడి చమురు, కొన్ని రకాల స్టీల్‌ ఉత్పత్తుల విదేశీ వర్తకాన్ని రూపాయిల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మనదేశం నుంచి ఎగుమతి చేసే తేయాకుకు రష్యా, యూఏఈ దేశాలు రూపాయిల్లో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని టీ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ జనరల్‌ పి.కె.భట్టాచార్య వివరించారు. త్వరలో రష్యా నుంచి రూపాయి వర్తకం మొదలవుతుందని, తదుపరి మిగిలిన దేశాల ముందుకు రావచ్చని పేర్కొన్నారు.

తేయాకు ఎగుమతులకు మరిన్ని అవకాశాలు

శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఆ దేశం నుంచి తేయాకు కొనుగోలు చేస్తున్న ఇరాక్‌, సిరియా, టర్కీ, పోలెండ్‌ వంటి దేశాలు ఇప్పుడు మనదేశం వైపు చూస్తున్నాయి. మనదేశం నుంచి తేయాకు ఎగుమతి చేసే కంపెనీలను ఆయా దేశాలు సంప్రదిస్తున్నాయి.మరికొన్ని ఇతర వస్తువులను ‘రూపీ ట్రేడ్‌’ కిందకు తీసుకు రాగలిగితే, డాలర్‌ వినియోగం తగ్గి, రూపాయి మారకపు విలువపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా రూపాయి మారకపు విలువ స్ధిరంగా ఉండటమే కాక, ఎగుమతులు ఇంకా పెంచుకునే అవకాశం కలుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని