జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణలో జాప్యం!

జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాల పునరుద్ధరణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దివాలాకు చేరిన ఈ సంస్థ పునరుద్ధరణ పనులు కోర్టు పర్యవేక్షణలో సాగుతున్నాయి.

Published : 28 Sep 2022 02:06 IST

దిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాల పునరుద్ధరణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దివాలాకు చేరిన ఈ సంస్థ పునరుద్ధరణ పనులు కోర్టు పర్యవేక్షణలో సాగుతున్నాయి. ఈ నెలలోనే టికెట్ల విక్రయం ప్రారంభించాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ నూతన యాజమాన్యం భావించినా, ఇందుకు అవకాశాలు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాల ఆర్డరు కోసం తాజాగా రుణాలిచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణం. విమానాలను తీసుకునేందుకు విమాన తయారీ సంస్థలు, లీజ్‌దార్లతో జెట్‌ ఎయిర్‌వేస్‌ చర్చలు జరుపుతోందని సమాచారం. విమాన సేవల ప్రారంభ ప్రణాళికను ఖరారు చేయడానికి దగ్గరగా ఉన్నామని, రాబోయే వారాల్లో టికెట్‌ విక్రయాలు ప్రారంభించి, కార్యకలాపాల పునరుద్ధరణకు సిద్ధమవుతున్నట్లు జెట్‌ కొత్త యాజమాన్యం వెల్లడించింది.  ఇందుకు ఎటువంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేసింది. విమానాల ఆర్డరు పెట్టేందుకు, కొత్త ఆస్తుల కొనుగోలుకు ఎటువంటి ఆంక్షలు లేవని తెలిపింది.

* 2019లో రుణభారంతో కుప్పకూలిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను దుబాయ్‌ వ్యాపారవేత్త మురారి లాల్‌ జలాన్‌, కల్‌రాక్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఛైర్మన్‌ ఫ్లోరిన్‌ ఫ్రిస్ట్‌ కొనుగోలు చేశారు. ఈ ఏడాది మార్చికి మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించాలని భావించినప్పటికీ.. కొత్త విమానాల ఆర్డరును పెట్టలేదు.

* 50 ఎయిర్‌బస్‌ విమానాల కోసం జెట్‌ తుదిదశ చర్చలు జరుపుతున్నట్లు గత నెల చివర్లో వార్తలు వచ్చాయి. బోయింగ్‌ 737 మ్యాక్స్‌, ఏ 320 నియో విమానాల కోసం కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

* అక్టోబరు 11న కొత్త యాజమానుల పునరుద్ధరణ ప్రణాళిక పురోగతిని దివాలా కోర్టు విచారించనుంది. విమానాలు, ఇంజిన్‌ ఒప్పందాలు ఖరారైతే నియంత్రణ సంస్థకు తెలియజేయనున్నట్లు జలాన్‌-కల్‌రాక్‌ కన్సార్షియం ప్రతినిధి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని