కమొడిటీ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల్లో ధరల పరిమితికి నూతన విధానం

కమొడిటీ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల్లో రోజువారీ ధరల పరిమితికి (డీపీఎల్‌) కొత్త విధానాన్ని సెబీ ప్రవేశపెట్టింది. దేశీయ, అంతర్జాతీయ ఎక్స్ఛేంజీల్లో ముగింపు ధర మధ్య వ్యత్యాసం సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చింది.

Published : 28 Sep 2022 02:06 IST

దిల్లీ: కమొడిటీ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల్లో రోజువారీ ధరల పరిమితికి (డీపీఎల్‌) కొత్త విధానాన్ని సెబీ ప్రవేశపెట్టింది. దేశీయ, అంతర్జాతీయ ఎక్స్ఛేంజీల్లో ముగింపు ధర మధ్య వ్యత్యాసం సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చింది. ఒక ట్రేడింగ్‌ సెషన్‌లో ఒక కమొడిటీ ఫ్యూచర్‌ కాంట్రాక్టు చలించేందుకు వీలున్న గరిష్ఠ ధరల శ్రేణిని రోజువారీ ధరల పరిమితిగా నిర్వచిస్తారు. కమొడిటీ కాంట్రాక్టుల ధరలు తీవ్ర ఒడుదొడుకులకు లోనైనప్పుడు.. మదుపర్ల పెట్టుబడిని కాపాడేందుకు ఈ పరిమితి ఉపయోగపడుతుంది. ఆ కాంట్రాక్టు ధరను ప్రభావితం చేసే అంశాలు, సమాచారాన్ని పునఃమదింపు చేసుకునే అవకాశమూ లభిస్తుంది. అంతర్జాతీయ, దేశీయ ఎక్స్ఛేంజీల్లో కొన్ని కాంట్రాక్టుల ముగింపు ధర మధ్య వ్యత్యాసం ఉంటోందని దేశీయ ఎక్స్ఛేంజీలు సమాచారం ఇచ్చాయని, ముగింపు ధర గణించే విధానంలో వ్యత్యాసమే దీనికి కారణమని సెబీ తెలిపింది. ఇందువల్లే తదుపరి ట్రేడింగ్‌ సెషన్‌లో అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలోని ధరల కంటే దేశీయ ఎక్స్ఛేంజీలోని రోజువారీ ధరల పరిమితి  శ్రేణి తక్కువ / ఎక్కువ స్థాయిలో ఉంటున్నట్లు పేర్కొంది. ముందు రోజు దేశీయ ఎక్స్ఛేంజీలోని ధరతో పోల్చినప్పుడు, నిర్దిష్ట డీపీఎల్‌ కంటే అంతర్జాతీయ మార్కెట్లలో ధరల కదలిక ఎక్కువ/తక్కువగా ఉన్న సందర్భంలో అవసరమైన స్థాయికి డీపీఎల్‌లో సడలింపులు చేసుకోవచ్చని ఎక్స్ఛేంజీలకు సెబీ తెలిపింది. ఇలా చేయడానికి ముందు.. తగిన కారణాలను తెలియజేస్తూ మార్కెట్‌కు నోటీసు ఇవ్వాలని తెలిపింది. ఈ ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ధరల్లో సర్దుబాటుకు వీలుంటుందని తెలిపింది. ఎప్పుడెప్పుడు వీటిని నెలవారీ నివేదికలో ఎక్స్ఛేంజీల్లో పొందుపరచాలి. ఈ కొత్త విధానం తక్షణమే అమల్లోకి వచ్చిందని సెబీ వివరించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts