అతి స్వల్ప నష్టాలు

ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో మంగళవారం సూచీలు అతి స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌ నష్టాల్లో ముగియడం మాత్రం వరుసగా ఇది అయిదో రోజు. లోహ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

Published : 28 Sep 2022 02:15 IST

సమీక్ష

ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో మంగళవారం సూచీలు అతి స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌ నష్టాల్లో ముగియడం మాత్రం వరుసగా ఇది అయిదో రోజు. లోహ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలతో సెంటిమెంట్‌ బలహీనంగా మారింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు కోలుకుని 81.53 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 1.78 శాతం పెరిగి 85.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 57,376.52 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 560 పాయింట్ల లాభపడి 57,704.57 వద్ద గరిష్ఠాన్ని తాకింది. గరిష్ఠాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. 56,950.52 పాయింట్లకు పడిపోయింది. చివరకు 37.70 పాయింట్ల నష్టంతో 57,107.52 వద్ద ముగిసింది. నిఫ్టీ   8.90 పాయింట్లు తగ్గి 17,007.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,942.35- 17,176.45 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 13 నష్టపోయాయి. టాటా స్టీల్‌ 2.25%, టైటన్‌ 2.15%, కోటక్‌ బ్యాంక్‌ 1.52%, ఎస్‌బీఐ 1.39%, టెక్‌ మహీంద్రా 1.08%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.96% చొప్పున డీలాపడ్డాయి. పవర్‌గ్రిడ్‌ 1.81%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.32%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.25%, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.20%, నెస్లే 1.19%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.94% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో లోహ, యంత్ర పరికరాలు, బ్యాంకింగ్‌ నీరసపడ్డాయి. చమురు-గ్యాస్‌, ఇంధన, ఐటీ, ఆరోగ్య సంక్షరణ మెరిశాయి బీఎస్‌ఈలో 1639 షేర్లు నష్టాల్లో ముగియగా, 1769 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 132 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* ఒడిశాలోని తాల్చేర్‌లో 2శ్రీ660 మెగావాట్‌ ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ఎన్‌టీపీసీ నుంచి ఆర్డరు అందుకున్నట్లు భెల్‌ వెల్లడించింది.

* ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ రీట్‌లో 7.7 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా 325 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2,650 కోట్లు) సమీకరించినట్లు బ్లాక్‌స్టోన్‌ తెలిపింది.

* స్పెషాలిటీ స్టీల్‌ ఉత్పత్తుల విస్తరణతో పాటు డౌన్‌స్ట్రీమ్‌ రంగంలో బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8000 కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్సెలార్‌ మిత్తల్‌ అనుబంధ సంస్థ ఏఎంఎన్‌ఎస్‌ ఇండియా ఛైర్మన్‌ ఆదిత్య మిత్తల్‌ వెల్లడించారు. ఏఎంఎన్‌ఎస్‌ ఇండియాలో ఆర్సెలార్‌ మిత్తల్‌కు 60 శాతం వాటా ఉంది. మాతృసంస్థ ఆర్సెలార్‌ మిత్తల్‌కు సైతం ఆదిత్య మిత్తల్‌ సీఈఓగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని