అదానీ.. రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి

కొత్త ఇంధనం, డేటా కేంద్రాలతో కూడిన డిజిటల్‌ విభాగంపై రాబోయే దశాబ్ద కాలంలో 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టనున్నామని అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపారు.

Published : 28 Sep 2022 02:20 IST

పదేళ్లలో కొత్త ఇంధనం, డేటా కేంద్రాలపై
వినియోగదారుల సేవలకు సూపర్‌యాప్‌లు

దిల్లీ: కొత్త ఇంధనం, డేటా కేంద్రాలతో కూడిన డిజిటల్‌ విభాగంపై రాబోయే దశాబ్ద కాలంలో 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టనున్నామని అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపారు. ఈ పెట్టుబడుల్లో 70 శాతం వరకు కొత్త ఇంధనం విభాగంపైనే వెచ్చిస్తామని సింగపూర్‌లో జరిగిన ఫోర్బ్స్‌ గ్లోబల్‌ సీఈఓల సమావేశంలో ఆయన వెల్లడించారు. కొత్త ఇంధనంపై తమ గ్రూపు ప్రణాళికలను క్రమంగా వెల్లడిస్తామన్నారు.

సింగపూర్‌ విస్తీర్ణానికి మించిన స్థలంలో హైబ్రిడ్‌ విద్యుత్తు ప్రాజెక్టులు: ‘ప్రస్తుతం మాకు 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యం ఉంది. దీనికి మరో 45 గిగావాట్ల హైబ్రిడ్‌ పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం జతచేరుస్తాం. ఈ ప్రాజెక్టులు 10,000 హెక్టార్ల స్థలంలో విస్తరిస్తాయి. సింగపూర్‌ విస్తీర్ణం కంటే ఇది 1.4 రెట్లు ఎక్కువ. ఈ ప్రాజెక్టుల సాయంతో, విక్రయానికి 3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఇంధనాన్ని అందుబాటులోకి తేగలుగుతామ’ని అదానీ చెప్పారు. 10 గిగావాట్ల సౌర ప్యానెళ్లు, 10 గిగా వాట్ల గాలి మరలు, 5 గిగావాట్ల హైడ్రోజన్‌ ఎలక్ట్రోలైజర్‌ తయారీకి 3 గిగా ఫ్యాక్టరీలను అభివృద్ధి చేస్తామన్నారు. గ్రీన్‌ ఎలక్ట్రాన్‌ను అత్యంత చౌకగా ఉత్పత్తి చేసే సంస్థల్లో ఒకటిగా అవతరిస్తామని, ఆ తర్వాత అత్యంత చౌకగా హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే సంస్థగా నిలుస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

పర్యావరణ హిత డేటా కేంద్రాలు
భారత డేటా కేంద్రాల విపణి గణనీయ వృద్ధి నమోదు చేస్తోందని తెలిపారు. ప్రపంచంలో ఇతర ఏ పరిశ్రమ కంటే, ఈ రంగమే అత్యధికంగా ఇంధనాన్ని వినియోగించుకుంటోందని తెలిపారు. అందుకే స్వచ్ఛ డేటా కేంద్రాలను అభివృద్ధి చేయాలనే తమ ప్రణాళిక.. ఓ మేలిమలుపు అవుతుందని అన్నారు.  రాబోయే 10 ఏళ్ళలో అదానీకనెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా 1,000 మెగావాట్ల డేటా కేంద్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. వీటిని సముద్రగర్భ కేబుళ్ల ద్వారా అనుసంధానిస్తామన్నారు.

రిలయన్స్‌, టాటాలకు పోటీగా సూపర్‌యాప్‌
వినియోగదారులకు పలు రకాల సేవలను అందించే సూపర్‌ అప్లికేషన్‌ (సూపర్‌ యాప్‌)లు అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అదానీ గ్రూపు నిర్వహిస్తున్న ఎఫ్‌ఎమ్‌సీజీ, సిమెంటు, విద్యుత్‌ పంపిణీ, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సిమెంటు వ్యాపారాలకు చెందిన లక్షల మంది వినియోగదారులకు ఒకే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సేవలందించేందుకు ఈ యాప్‌లు తోడ్పడుతాయని అన్నారు. ఈ సూపర్‌ యాప్‌ల ద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా గ్రూపులకు అదానీ గ్రూప్‌ పోటీ ఇవ్వనుంది.

ఒంటరి భావనలో చైనా
‘భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. అసలైన భారత వృద్ధి గాథ ఇప్పుడే ప్రారంభమైంది. ప్రపంచంపై భారత్‌ ప్రభావమేమిటో రాబోయే మూడు దశాబ్దాలే నిర్వచిస్తాయ’ని గౌతమ్‌ అదానీ తెలిపారు. ప్రపంచీకరణ పరుగులో ఒకప్పటి ఛాంపియన్‌గా ఉన్న చైనా.. నేడు సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. ‘ప్రపంచ దృష్టిలో ఒంటరి అవుతున్నాననే భావన చైనాలో పెరుగుతోందని అనుకుంటున్నాను. జాతీయవాదం పెరగడం, సరఫరా వ్యవస్థలు ఇతర దేశాలకు మళ్లడం, సాంకేతిక ఆంక్షలు లాంటివి ఆ దేశానికి ముప్పుగా మారతాయ’ని అదానీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా మౌలిక సదుపాయాల కల్పనతో ముందుకు వెళ్లాలన్న చైనా ఆకాంక్షలకు పలు దేశాల్లో వ్యతిరేకత ఎదురవుతోందని గుర్తు చేశారు. చైనా స్థిరాస్తి విపణి నెమ్మదించడం... 1990ల్లో జపాన్‌ ఆర్థిక వ్యవస్థ పరిణామాలను గుర్తుకు తెస్తోందని అన్నారు. ఈ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థలు కొంత కాలానికి తిరిగి పుంజుకుంటాయని తాను భావిస్తున్నప్పటికీ.. ఈసారి మాత్రం కష్టంగానే ఉందని అన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts