డేటా కేంద్రాల్లోకి రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడులు

గత అయిదేళ్లలో భారత డేటా కేంద్రాల మార్కెట్‌లోకి 14 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, 2025 నాటికి ఈ మొత్తం పెట్టుబడుల  20 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.6 లక్షల కోట్లు)ను అధిగమించొచ్చని స్థిరాస్తి కన్సల్టింగ్‌ సంస్థ సీబీఆర్‌ఈ తెలిపింది.

Updated : 28 Sep 2022 08:55 IST

2025కు చేరొచ్చు: సీబీఆర్‌ఈ

దిల్లీ: గత అయిదేళ్లలో భారత డేటా కేంద్రాల మార్కెట్‌లోకి 14 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, 2025 నాటికి ఈ మొత్తం పెట్టుబడుల  20 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.6 లక్షల కోట్లు)ను అధిగమించొచ్చని స్థిరాస్తి కన్సల్టింగ్‌ సంస్థ సీబీఆర్‌ఈ తెలిపింది. పెట్టుబడిదార్లు స్థిర ఆదాయం తెచ్చే ఆస్తుల కోసం చూస్తున్నట్లు తెలిపింది. ‘డేటా సెంటర్స్‌ ఇన్‌ ఇండియా: పవరింగ్‌ అప్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇన్‌ ఏ డేటా-హై ఎరా’ పేరిట సీబీఆర్‌ఈ నివేదికను వెలువరించింది. డిజిటలీకరణ పెరగడం, విధానపరమైన తోడ్పాటుతో డేటా కేంద్రాలకు గిరాకీ గణనీయంగా పెరిగిందని పేర్కొంది. కొవిడ్‌-19 సంక్షోభంతో సాంకేతికతను అందిపుచ్చుకోవడం, డేటా వినియోగం అధికమైనట్లు వివరించింది.

* ఓటీటీ, ఆన్‌లైన్‌ గేమింగ్‌, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం, ఇ-కామర్స్‌, ఎడ్‌టెక్‌ సంస్థల ఆన్‌లైన్‌ స్కూలింగ్‌, లొకేషన్‌-అగ్నోస్టిక్‌ పని, మెషీన్‌ లెర్నింగ్‌, 5జీ, బ్లాక్‌ చెయిన్‌, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతల కారణంగా డేటా పంపిణీ పలు రెట్లు పెరుగుతోంది. దీంతో అధిక వేగంతో కూడిన సర్వర్ల అవసరం పెరిగింది.

* ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదార్లకు ప్రత్యామ్నాయ స్థిరాస్తి పెట్టుబడిగా డేటా కేంద్రాలు మారాయి. స్థిరమైన ఆదాయం అందించేందుకు అవకాశంగా ఉన్న వీటిల్లోకి పెట్టుబడులు కొత్త గరిష్ఠాలకు చేరే సూచనలున్నాయి.

* డేటా కేంద్రాలకు ప్రభుత్వం మౌలిక రంగ హోదా కల్పించడంతో పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ఇప్పటికే 14 బి.డాలర్ల పెట్టుబడులు రాగా.. వచ్చే మూడేళ్లలో మరో 6 బి.డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

* అన్ని రంగాల్లో వ్యాపార సంస్థలు డిజిటల్‌ మౌలిక సదుపాయాల విస్తరణకు చూస్తున్నాయి, ప్రత్యామ్నాయ స్థిరాస్తి పెట్టుబడిగా డేటా కేంద్రాలకు ప్రాధాన్యత పెరిగిందని సీబీఆర్‌ఈ ఛైర్మన్‌, సీఈఓ (భారత్‌) అన్షుమన్‌ మ్యాగజీన్‌ తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా గిరాకీ పెరగొచ్చని అంచనా వేశారు. 

* భారత్‌లోని డేటా కేంద్రాల్లో 48 శాతం ముంబయిలో ఉండగా, బెంగళూరులో 18 శాతం, చెన్నైలో 9 శాతం ఉన్నాయి. దిల్లీ-ఎన్‌సీఆర్‌, పుణె, హైదరాబాద్‌, కోల్‌కతాలలో మిగతా 25 శాతం డేటా కేంద్రాలున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని