ప్రభుత్వ రంగ బ్యాంకులు కొన్ని చాలు

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) కొన్ని ఉంటే సరిపోతాయని.. అవి కూడా బలమైనవే అయి ఉండాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అందువల్ల చిన్న బ్యాంకులను

Published : 29 Sep 2022 02:40 IST

అవీ బలంగా ఉండాలి
ఎస్‌బీఐ మాజీ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య

దిల్లీ: దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) కొన్ని ఉంటే సరిపోతాయని.. అవి కూడా బలమైనవే అయి ఉండాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అందువల్ల చిన్న బ్యాంకులను ప్రైవేటీకరించడం లేదా విలీనం చేయాలని ఆమె అన్నారు. పీఎస్‌బీలకు సమాన అనుకూల పరిస్థితులను కల్పిస్తే అవి రాణిస్తాయన్నారు. పీఎస్‌బీల ప్రైవేటీకరణ వల్ల ఏ లక్ష్యాలైతే సాధించాలనుకున్నారో, అప్పుడు ప్రభుత్వ రంగంలోనూ సాధించవచ్చని ఆమె తెలిపారు. సమస్యలన్నింటికీ ప్రైవేటీకరణ ఒక్కటే ఎప్పుడూ సమాధానం కాకపోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పీఎస్‌బీలు అన్నింటినీ ప్రైవేటీకరించేందుకు 10 ఏళ్ల ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రావాలంటూ ఆర్‌బీఐ మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు చేసిన సూచనపై స్పందిస్తూ భట్టాచార్య పైవ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా ఉండాలని నేను అనుకోవడం లేదు. ఆ సంఖ్యను తగ్గించాలి. కొన్నింటిని ప్రైవేటీకరించాలి. బలమైన బ్యాంకులను ప్రభుత్వ రంగంలోనే కొనసాగనివ్వాల’ని భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతం సేల్స్‌ఫోర్స్‌ ఇండియాకు సీఈఓ, ఛైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

2020లో 10 జాతీయ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుఆ ప్రభుత్వం విలీనం చేసిన సంగతి తెలిసిందే. తద్వారా పీఎస్‌బీల మొత్తం సంఖ్యను 12కు తగ్గించింది. మరో రెండు పీఎస్‌బీలను ప్రైవేటీకరించే ఉద్దేశంలో ఉన్నట్లు 2021-22 బడ్జెట్‌లోనూ వెల్లడించింది. పూర్తి స్థాయి డిజిటల్‌ బ్యాంకులు ఏర్పాటు చేయాలన్న నీతిఆయోగ్‌ ప్రతిపాదనపై భట్టాచార్య స్పందిస్తూ.. 17 - 25 ఏళ్ల వారికే అవి ఉపయోగకరమని అన్నారు. వినియోగదార్లు ఉంటే.. ఏదోక సమయంలో ఈ డిజిటల్‌ బ్యాంకులూ తమ పాత్ర పోషించగలుగుతాయని అన్నారు. డిజిటల్‌ బ్యాంకులు ఏర్పాటు చేయడం కష్టమైన ప్రక్రియ అని అంటూనే.. మార్పు అనివార్యం అని ఆమె వివరించారు. ‘మార్పును ఆపేందుకు ప్రయత్నించొచ్చు. లేదంటే ఆలస్యం చేసేందుకు చూడొచ్చు. కానీ మొత్తం మీద ఆపలేమ’ని అన్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని ఆర్‌బీఐ ఈ ఏడాదిలో తీసుకొస్తే.. అదో కీలక పరిణామం అవుతుందని భట్టాచార్య తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని