జీవన వ్యయం పెరగడం వల్లే మాంద్యం!

రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల, వాస్తవిక వేతనాల విలువ తగ్గుతున్నందున, అంతర్జాతీయంగా మాంద్యం ఏర్పడే అవకాశం కనిపిస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముఖ్య ఆర్థికవేత్తలు (సీఎఫ్‌ఓ) అభిప్రాయపడ్డారు. ఫైనాన్స్‌, బీమా, వృత్తి

Published : 29 Sep 2022 02:34 IST

డబ్ల్యూఈఎఫ్‌ సర్వేలో ముఖ్య ఆర్థికవేత్తలు

దిల్లీ: రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల, వాస్తవిక వేతనాల విలువ తగ్గుతున్నందున, అంతర్జాతీయంగా మాంద్యం ఏర్పడే అవకాశం కనిపిస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముఖ్య ఆర్థికవేత్తలు (సీఎఫ్‌ఓ) అభిప్రాయపడ్డారు. ఫైనాన్స్‌, బీమా, వృత్తి సేవలు, సాంకేతిక పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకులకు చెందిన 50 మందికి పైగా సీఎఫ్‌ఓల నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) అభిప్రాయాలు సేకరించి, ఈ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాస్తవిక వేతనాలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వచ్చే ఏడాది తగ్గుముఖం పట్టొచ్చని భావిస్తున్నప్పటికీ, జీవన వ్యయాల సంక్షోభం సామాజిక అశాంతికి దారి తీయొచ్చు.

వచ్చే మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత ప్రమాదంలో పడొచ్చు. ఎగుమతి పరిమితులను ప్రేరేపించడం గురించి పెరుగుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, ప్రపంచ సరఫరా అంతరాయాలను ఇవి తీవ్రం చేసే అవకాశం కనిపిస్తోందని సర్వే తెలిపింది.

ప్రపంచంలోనే అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్‌, నూకల ఎగుమతులపై నిషేధం విధించడం, మిగతా గ్రేడ్‌ బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం ప్రవేశపెట్టడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది.

2022లో మిగిలిన నెలలు, 2023లో వాస్తవిక వేతనాలు తగ్గి, అధిక ద్రవ్యోల్బణం, వృద్ధిలో క్షీణత నమోదు కావొచ్చని అధిక శాతం మంది అభిప్రాయపడ్డారు.

ప్రతి పది మంది ఆర్థికవేత్తల్లో కనీసం ఏడుగురు ఆర్థిక మాంద్యం కొంతవరకైనా వస్తుందని అంచనా వేస్తున్నారు.

2023లో ఐరోపాలో ఆర్థిక వృద్ధి బలహీనంగా ఉండొచ్చని ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మధ్య ప్రాచ్యం, ఉత్తర అమెరికా, అమెరికా, దక్షిణాసియా, లాటిన్‌ అమెరికాల్లో వృద్ధి ఓ మోస్తరుగా నమోదు కావొచ్చని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని