57,000 దిగువకు సెన్సెక్స్‌

బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో, సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టపోయాయి. లోహ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 57000 పాయింట్ల దిగువన, నిఫ్టీ 16,900 కింద ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు

Published : 29 Sep 2022 02:36 IST

ఆరో రోజూ కొనసాగిన నష్టాలు
రికార్డు కనిష్ఠమైన 81.93కు రూపాయి
సమీక్ష

లహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో, సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టపోయాయి. లోహ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 57000 పాయింట్ల దిగువన, నిఫ్టీ 16,900 కింద ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.02కు పతనమైనా, చివరకు 40 పైసలు కోల్పోయి తాజా జీవనకాల కనిష్ఠమైన 81.93 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర స్వల్పంగా తగ్గి 86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశ నిర్ణయాలు శుక్రవారం వెల్లడికానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు.

సెన్సెక్స్‌ ఉదయం 56,710.13 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై.. ఒకదశలో 56,485.67 పాయింట్లకు పడిపోయింది.  అనంతరం కోలుకుని లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్‌, 57,213.13 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో 509.24 పాయింట్ల నష్టంతో 56,598.28 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 148.80 పాయింట్లు తగ్గి 16,858.60 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,820.40- 17,037.60 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ 2.97%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.84%, రిలయన్స్‌ 2.64%, టాటా స్టీల్‌  2.64%, ఎస్‌బీఐ 2.04%, హెచ్‌డీఎఫ్‌సీ 2.02%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.97%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.85%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.70% చొప్పున నీరసించాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 2.90%, సన్‌ఫార్మా 2.37%, డాక్టర్‌ రెడ్డీస్‌ 2.03%, పవర్‌గ్రిడ్‌ 1.42%, నెస్లే 0.99% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో లోహ 2.32%, బ్యాంకింగ్‌ 1.52%, ఆర్థిక సేవలు 1.31%, ఇంధన 1.09%, కమొడిటీస్‌ 1.06%, స్థిరాస్తి 0.76% డీలాపడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, ఐటీ, వినియోగ, టెక్‌ మెరిశాయి. బీఎస్‌ఈలో 2161 షేర్లు నష్టాల్లో ముగియగా, 1277 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 94 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

సుజ్లాన్‌ ఎనర్జీ రూ.1200 కోట్ల రైట్స్‌ ఇష్యూ అక్టోబరు 11న ప్రారంభమై 14న ముగియనుంది. రూ.2 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.5 ధర నిర్ణయించారు. కంపెనీ 2.40 కోట్ల షేర్లను జారీ చేయనుంది. అర్హులైన వాటాదార్లకు ప్రతి 21 ఫుల్లీ పెయిడప్‌ ఈక్విటీ షేర్లకు 5 రైట్స్‌ ఇష్యూ ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. రికార్డు తేదీగా అక్టోబరు 4ను నిర్ణయించారు. ఈ షేరు ధర బీఎస్‌ఈలో రూ.8.15గా ఉంది.

కంపెనీ తీసుకున్న రుణాలకు హామీగా అనుబంధ సంస్థ ఏసీసీలో 50.5 శాతం వాటాను తనఖా పెట్టినట్లు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అంబుజా సిమెంట్స్‌ వెల్లడించింది. సెప్టెంబరు 26న 9.39 కోట్ల ఏసీసీ షేర్లను తనఖా పెట్టినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని