పసిడి ‘చిన్న దుకాణాల’ వాటా తగ్గుతోంది

దేశీయ ఆభరణాల విక్రయాల్లో చిన్న వ్యాపారుల హవాయే ఇప్పటికీ కొనసాగుతున్నా, వాటి వాటా క్రమంగా తగ్గుతోందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలో పేర్కొంది. సంఘటిత రంగం వాటా వచ్చే ఐదేళ్లలో మరింతగా పెరిగి 40

Published : 29 Sep 2022 02:37 IST

అయిదేళ్లలో చెయిన్‌ స్టోర్‌ల వాటా 40 శాతానికి
5 దిగ్గజ సంస్థల నుంచే మరో 1000 కేంద్రాలు
ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక

దిల్లీ: దేశీయ ఆభరణాల విక్రయాల్లో చిన్న వ్యాపారుల హవాయే ఇప్పటికీ కొనసాగుతున్నా, వాటి వాటా క్రమంగా తగ్గుతోందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలో పేర్కొంది. సంఘటిత రంగం వాటా వచ్చే ఐదేళ్లలో మరింతగా పెరిగి 40 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. పెద్ద సంస్థలు నిర్వహిస్తున్న గొలుసుకట్టు దుకాణాలు (చెయిన్‌ స్టోర్స్‌) సంఘటిత రంగం కిందకు వస్తుండగా.. సొంతంగా చిన్న విక్రయదార్లు నిర్వహించే దుకాణాలను అసంఘటిత రంగంగా పరిగణిస్తుంటారు. గత పదేళ్లుగా చెయిన్‌ స్టోర్స్‌ మార్కెట్‌ వాటా క్రమంగా పెరుగుతూ 2021కి 35 శాతానికి చేరుకుందని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఐదేళ్లలో ఇది 40 శాతానికి పెరగొచ్చని భారత మార్కెట్‌పై రూపొందించిన నివేదికలో తెలిపింది. ఈ సమయంలో 5 దిగ్గజ రిటైల్‌ సంస్థలే కొత్తగా 800- 1000 విక్రయ కేంద్రాలు తెరిచే అవకాశం ఉందని పేర్కొంది.

‘హాల్‌ మార్కింగ్‌ను తప్పనిసరి చేయడం, అందరికీ వ్యాపారపరంగా సమాన అనుకూల పరిస్థితులు సృష్టించడం వల్ల దేశీయంగా, స్థానికంగా చెయిన్‌ స్టోర్‌ల మార్కెట్‌ వాటా పెరుగుతోంది. రుణాలు పొందే సౌలభ్యం ఎక్కువగా ఉండటం, అధిక నిల్వలను కలిగి ఉండటమూ వీటికి తోడ్పడతాయి. చెయిన్‌ స్టోర్‌ల మాదిరి చిన్న విక్రయకేంద్రాలు కూడా రుణాల సౌలభ్యాన్ని పొందాలంటే మరింత పారదర్శకంగా మారాలి. సాంకేతికతనూ అందిపుచ్చుకోవాలి. అప్పుడే అవి తమ మార్కెట్‌ వాటాను కాపాడుకునే అవకాశం ఉంటుంద’ని డబ్ల్యూజీసీ, ఇండియా, రీజినల్‌ సీఈఓ పి.ఆర్‌.సోమసుందరం చెప్పారు. దేశంలో ఆభరణాల విక్రయ సంస్థలు అయిదారు లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు.

రోజువారీ ధరించే వాటిపై దృష్టి

‘అత్యుత్తమ డిజైన్లు, వినియోగదారు అనుభూతి, హాల్‌మార్కింగ్‌పై పెరుగుతున్న అవగాహన, అత్యుత్తమ ధర నిర్ణయం, వెనక్కి ఇచ్చే విధానాలు, జీఎస్‌టీ, నోట్లరద్దు లాంటివి చెయిర్‌ స్టోర్‌ల వైపు వినియోగదారుల అడుగులు వేగంగా పడేందుకు కారణమయ్యాయ’ని నివేదిక తెలిపింది. రోజువారీ ధరించే ఆభరణాలు, గొలుసులు, ఉంగరాలు లాంటి వేగంగా అమ్ముడుపోయే ఆభరణాలపై చెయిన్‌ స్టోర్‌లు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని పేర్కొంది. వీటి వ్యాపారంలో ఆ తరహా ఆభరణాలే 50-60 శాతం ఉంటాయని తెలిపింది.

పసిడి ఆభరణాల తయారీలోనూ సంఘటిత రంగం తన వాటా పెంచుకునేందుకు అవకాశాలు ఎక్కువగానే కన్పిస్తున్నాయని తెలిపింది.

ఆన్‌లైన్‌లో.. తక్కువ పరిమాణంలో

ఆన్‌లైన్‌ ద్వారా ఆభరణాల కొనుగోళ్లు ఇటీవల పెరిగాయని నివేదిక తెలిపింది. అయితే ఈ కొనుగోళ్ల పరిమాణం 5- 10 గ్రాముల ఆభరణాలకే పరిమితమవుతున్నట్లు వెల్లడించింది. 18 క్యారెట్ల నాణ్యత కలిగిన, తేలికపాటి, ఫ్యాషన్‌ పసిడి ఆభరణాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వాటా 7- 10 శాతానికి పెరిగే అవకాశం ఉందని వివరించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని