విమానాల్లో సరకు రవాణా దూరాభారం

హైదరాబాద్‌ నుంచి అమెరికా, ఐరోపా ప్రధాన నగరాలకు నేరుగా సరకు రవాణా విమానాలు (కార్గో సర్వీసులు) పునః ప్రారంభం కాకపోవడంతో ఎగుమతిదార్లకు అదనపు భారం తప్పడం లేదు. కొవిడ్‌కు ముందు ఇక్కడ నుంచి నేరుగా కార్గో విమానాలు విదేశాల్లోని గమ్యస్థానాలకు వెళ్లేవి. ‘కొవిడ్‌’ పరిణామాల నేపథ్యంలో అవి నిలిచిపోయాయి. ప్రయాణికుల

Published : 30 Sep 2022 03:30 IST

విదేశాలకు నేరుగా సర్వీసులు తగ్గడం వల్లే

మందులు, ఇంజినీరింగ్‌  ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం

ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ నుంచి అమెరికా, ఐరోపా ప్రధాన నగరాలకు నేరుగా సరకు రవాణా విమానాలు (కార్గో సర్వీసులు) పునః ప్రారంభం కాకపోవడంతో ఎగుమతిదార్లకు అదనపు భారం తప్పడం లేదు. కొవిడ్‌కు ముందు ఇక్కడ నుంచి నేరుగా కార్గో విమానాలు విదేశాల్లోని గమ్యస్థానాలకు వెళ్లేవి. ‘కొవిడ్‌’ పరిణామాల నేపథ్యంలో అవి నిలిచిపోయాయి. ప్రయాణికుల విమానాలతో పాటు సరకు రవాణాకూ ఇక్కడ నుంచి డిమాండ్‌ ఉన్నా, కార్గో విమాన సేవలు తిరిగి ప్రారంభం కాకపోవడంతో స్థానిక బల్క్‌ డ్రగ్‌, ఔషధ, ఇంజినీరింగ్‌ పరిశ్రమల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల సరకు రవాణా ఛార్జీల భారం బాగా పెరిగిందని చెబుతున్నారు. బల్క్‌ ఔషధాలు, ఫార్మా పరిశ్రమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కేంద్ర స్థానంగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని ఫార్మా యూనిట్ల ఉత్పత్తుల్లో దాదాపు 70 - 80 శాతం ఎగుమతి అవుతున్నాయి. అమెరికా, ఐరోపా, రష్యా, ఆఫ్రికా, ల్యాటిన్‌ అమెరికా దేశాలకు మందులు ఎగుమతి అవుతున్నాయి. స్థానికంగా ఎలక్ట్రానిక్స్‌, రక్షణ, ఇంజినీరింగ్‌ రంగాలకు చెందిన పలు చిన్న, మధ్యతరహా యూనిట్లు సైతం తమ ఉత్పత్తులను అంతర్జాతీయ విపణికి అందిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ హైదరాబాద్‌ నుంచి అంతర్జాతీయ నగరాలకు వెళ్లే సరకు రవాణా విమానాల ద్వారా ఎగుమతులు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాలకు సరకు రవాణా విమాన సర్వీసులు గతంలో నేరుగా ఉండటంతో ఎగుమతులు సులువుగా నిర్వహించేవారు.

కొవిడ్‌ నుంచీ ఆటంకం

సరకు రవాణాలో అత్యంత కీలకంగా ఉన్న క్యాథే పసిఫిక్‌, లుఫ్తాన్సా ఫ్రైట్‌ సర్వీసెస్‌ హైదరాబాద్‌ నుంచి సరకు రవాణా విమాన సర్వీసులు అధికంగా నిర్వహించేవి. హైదరాబాద్‌ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌ (జర్మనీ)కు లుఫ్తాన్సా కార్గో సర్వీసులు; హాంకాంగ్‌కు క్యాథే పసిఫిక్‌ సర్వీసులు ఎంతోకాలంగా  ఉన్నాయి. కొవిడ్‌ పరిణామాల వల్ల ఈ సర్వీసుల్లో చాలావరకు దాదాపు రెండేళ్ల పాటు నిలిచిపోయాయి. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఈ సర్వీసులు ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. కొన్ని సర్వీసులను..పలు రకాల పరిమితులతో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా కాకుండా ముంబయి, దిల్లీ, బెంగళూరు నగరాల మీదుగా ఇవి విదేశాలకు వెళ్తున్నాయి. మనదేశం నుంచి నేరుగా ఉత్తర అమెరికా, కెనడా వంటి దూరప్రాంతాలకు వెళ్లే అధిక సామర్థ్యం గల సరకు రవాణా విమానాలు బాగా తక్కువ. దీనికి తోడు ఇప్పుడు సర్వీసుల సంఖ్య తగ్గి ఇబ్బందులు పెరిగినట్లు సంబంధిత వర్గాల కథనం.

సమయం, ఖర్చు పెరుగుతోంది

దీనివల్ల హైదరాబాద్‌ నుంచి సకాలంలో వివిధ వస్తువులను తమ అంతర్జాతీయ వినియోగదార్లకు అందించలేకపోతున్నట్లు స్థానిక వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ నుంచి పంపిన సరకు.. రెండు మూడు చోట్ల ఆగి, విమానాలు మారి గమ్యానికి చేరుకోవలసి వస్తోందని, దీనివల్ల సమయం, డబ్బు వృథా అవుతున్నట్లు వివరిస్తున్నాయి. లుఫ్తాన్సా కార్గో, క్యాథే పసిఫిక్‌ సరకు రవాణా సర్వీసులు పూర్తిస్థాయిలో మొదలు కావాలని, ప్రస్తుత సమస్యకు అదే పరిష్కారమని పేర్కొంటున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, సత్వరం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య అధ్యక్షుడు అనిల్‌ అగర్వాల్‌ కోరారు. తద్వారా అవాంతరాలు లేకుండా ఎగుమతులు జరిగేందుకు దోహదపడాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని