చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్ల పెంపు

కేంద్ర ప్రభుత్వం కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లను సవరించింది. మొత్తం 12 రకాల పొదుపు పథకాల్లో 5 పథకాల వడ్డీ రేట్లు స్వల్పంగా పెంచింది. మిగిలినవాటిని యథాతథంగా ఉంచింది. 2 ఏళ్ల టర్మ్‌డిపాజిట్లపై 0.2%, మూడేళ్ల టర్మ్‌డిపాజిట్‌పై 0.3%, వయోవృద్ధుల పొదుపు పథకాలపై

Published : 30 Sep 2022 03:26 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లను సవరించింది. మొత్తం 12 రకాల పొదుపు పథకాల్లో 5 పథకాల వడ్డీ రేట్లు స్వల్పంగా పెంచింది. మిగిలినవాటిని యథాతథంగా ఉంచింది. 2 ఏళ్ల టర్మ్‌డిపాజిట్లపై 0.2%, మూడేళ్ల టర్మ్‌డిపాజిట్‌పై 0.3%, వయోవృద్ధుల పొదుపు పథకాలపై 0.2%, నెలవారీ ఆదాయ పథకంపై 0.1% వడ్డీరేటును పెంచింది. కిసాన్‌ వికాస్‌ పత్రాలపై 0.1% వడ్డీ పెంచడంతో పాటు, మెచ్యూరిటీ కాలాన్ని ఒక నెల తగ్గించింది. ఈ మార్పులు అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31వరకు అమల్లో ఉంటాయని ఆర్థికశాఖ గురువారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీనియర్‌ సిటిజన్లు మరణిస్తే..:  సీనియర్‌ సిటిజన్లు మరణించినప్పుడు పోస్టాఫీసుల్లో అప్పటివరకు వారు నిర్వహించిన పొదుపు పథకాల ఖాతాలను ఆటోమేటిక్‌గా మూసేయకూడదని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టంచేసింది. వాళ్లు బతికున్నప్పుడు తమ పొదుపు పథకాలను ముందస్తుగా మూసేయమని వ్యక్తిగతంగా కోరితేనే, ప్రీమెచ్యూర్‌ క్లోజర్‌  చేయాలని సూచించింది. ఒకవేళ ఖాతాదారులైన వయోవృద్ధులు మరణిస్తే వారి నామినీ, చట్టబద్ధమైన వారసుల విజ్ఞప్తి మేరకే ఖాతాను మూసేయాలని పేర్కొంది. అలాంటప్పుడు సదరు వ్యక్తి చనిపోయిన తేదీ నాటికి సీనియర్‌ సిటిజన్లకు వర్తించే వడ్డీనే చెల్లించాలి. ఒకవేళ ఆ ఖాతా చివరి వరకు కొనసాగి వయోవృద్ధులు చనిపోయిన తర్వాత నుంచి మిగిలిన కాలానికి పోస్టాపీస్‌ పొదుపు ఖాతాలకు వర్తించే వడ్డీ చెల్లించాలి. వయోవృద్ధుల విజ్ఞప్తిమేరకు పొదుపు పథక ఖాతాను కాలం తీరకముందే మూసేస్తే, రూల్‌ 6 ప్రకారం జరిమానా విధించాలని స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని