14 ఐపీఓలు.. రూ.35,456 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)లు, అవి సమీకరించిన నిధుల మొత్తం తగ్గినట్లు ప్రైమ్‌ డేటా బేస్‌ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో 25 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.51,979 కోట్ల నిధుల్ని సమీకరించగా, 2022-23 ఏప్రిల్‌-సెప్టెంబరులో 14 సంస్థలు

Published : 30 Sep 2022 03:25 IST

2022-23 తొలి అర్ధభాగంపై   ప్రైమ్‌ డేటా బేస్‌ నివేదిక

రూ.1.05 లక్షల కోట్ల సమీకరణకు 71 ఐపీఓలు సిద్ధం  

ముంబయి: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)లు, అవి సమీకరించిన నిధుల మొత్తం తగ్గినట్లు ప్రైమ్‌ డేటా బేస్‌ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో 25 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.51,979 కోట్ల నిధుల్ని సమీకరించగా, 2022-23 ఏప్రిల్‌-సెప్టెంబరులో 14 సంస్థలు రూ.35,456 కోట్లు మాత్రమే సమీకరించాయని తెలిపింది. అంటే ఏడాది వ్యవధిలో నిధుల సమీకరణ 32 శాతం తగ్గినట్లయ్యింది.

* మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద అనుమతులు పొంది, ఐపీఓలకు వచ్చేందుకు 71 సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఇవి రూ.1,05,000 కోట్లు సేకరించబోతున్నాయని పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలివీ..

* రూ.70,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో మరో 43 సంస్థలు సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసి, అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి.

* అనుమతి పొందిన, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న మొత్తం 114 కంపెనీల్లో 10 కొత్తతరం టెక్‌ కంపెనీలున్నాయి. ఇవి సుమారు రూ.35,000 కోట్లు సమీకరించనున్నాయి.

* రూ.20,557 కోట్ల లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఇష్యూ కనుక లేకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ సమీకరణ మొత్తం మరీ తక్కువగా ఉండేది. ఇప్పటివరకు ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తంలో ఎల్‌ఐసీ వాటాయే 58 శాతంగా ఉంది. తరవాత డెలివరీ రూ.5,235 కోట్లు, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌ రూ.1,581 కోట్ల మేర సమీకరించాయి.

* మొత్తంమీద పబ్లిక్‌ ఈక్విటీ నిధుల సమీకరణ రూ.92,191 కోట్ల నుంచి 55 శాతం తగ్గి రూ.41,919 కోట్లకు పరిమితమైంది.

* కొత్త తరం సాంకేతిక కంపెనీ పేటీఎం పబ్లిక్‌ ఇష్యూ మదుపర్లకు నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో, ఈ విభాగంలోని కంపెనీలు ఐపీఓలకు వచ్చేందుకు వెనకాడుతున్నాయి. గత 6 నెలల్లో ఒక్క కంపెనీ (డెలివరీ) మాత్రమే ఈ విభాగం నుంచి ఐపీఓకు వచ్చింది.

* 14 ఐపీఓల్లో 4 ఇష్యూలకు మాత్రమే 10 రెట్ల భారీ స్పందన లభించింది. ఇందులో ఒక దానికి 50 రెట్ల ఆదరణ దక్కింది. 3 ఐపీఓలకు 3 రెట్లకు పైగా, మిగిలిన 7 ఐపీఓలకు 1-3 రెట్ల స్పందన లభించింది.

* సరాసరి నమోదు లాభం 32 శాతం (2021-22) నుంచి 12 శాతానికి పరిమితమైంది. 2020-21లో ఇది 42 శాతంగా ఉంది. 14 ఇష్యూల్లో 6 కంపెనీలు 10 శాతానికి పైగా లిస్టింగ్‌ లాభాల్ని అందించాయి. ఇందులో ఇటీవల నమోదైన హర్ష ఇంజినీర్స్‌ 47 శాతంతో అగ్రస్థానంలో ఉంది. సైర్మా ఎస్‌జీఎస్‌ 42 శాతం, డ్రీమ్‌ఫోక్స్‌ 42 శాతం లిస్టింగ్‌ గెయిన్స్‌ అందించాయి.

* 11 ఐపీఓలు సెప్టెంబరు 26 నాటికి, వాటి ఇష్యూ ధర కంటే పైనే ట్రేడవుతున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని