2023 అక్టోబరు నుంచి కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు

ప్రయాణికుల కార్లలో కనీసం 6 బ్యాగ్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న నిబంధన అమలును ప్రభుత్వం ఏడాది పాటు వాయిదా వేసింది. ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి కాకుండా వచ్చే ఏడాది అక్టోబరు 1 నుంచి తయారయ్యే కార్లలో ఈ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఈ విషయాన్ని

Published : 30 Sep 2022 03:24 IST

తయారీదార్లకు ఏడాది గడువు పెంపు

ఈనాడు, దిల్లీ: ప్రయాణికుల కార్లలో కనీసం 6 బ్యాగ్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న నిబంధన అమలును ప్రభుత్వం ఏడాది పాటు వాయిదా వేసింది. ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి కాకుండా వచ్చే ఏడాది అక్టోబరు 1 నుంచి తయారయ్యే కార్లలో ఈ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలో ఉన్న అడ్డంకుల కారణంగా వాహన పరిశ్రమ ఇబ్బంది పడుతోంది. స్థూల ఆర్థిక వ్వవస్థపై అది చూపుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికుల కార్లలో కనీసం 6 బ్యాగ్‌లు ఉండాలన్న నిబంధనను 2023 అక్టోబరు 1 నుంచి అమలుచేయాలని నిర్ణయించాం. కార్ల ధరలు, రకాలతో సంబంధం లేకుండా అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ప్రయాణికుల భద్రతే అన్నింటికంటే ముఖ్యమ’ని మంత్రి పేర్కొన్నారు. కారులో ముందు సీట్లలో కూర్చునే డ్రైవర్‌, మరొకరికి రక్షణగా ముందు వైపు 2 ఎయిర్‌బ్యాగ్‌లు.. కారులో రెండువైపులా  ముందు, వెనుకాల డోర్లకు కలిపి 4 ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేయించాలన్నది ప్రతిపాదన.

సమయం సరిపోదనే: మారుతీ సుజుకీ

‘నిబంధన పాటించడానికి కావల్సినంత సమయం లేదు. మార్కెట్‌ కూడా బలహీనంగా ఉంది కాబట్టే పరిశ్రమ వాయిదాను కోరింది. మా ఆందోళనను అర్థం చేసుకుని పరిశ్రమకు మద్దతుగా ప్రభుత్వం నిలబడింద’ని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ పేర్కొన్నారు. ‘6 ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేసేందుకు కారు బాడీలో నిర్మాణాత్మక మార్పులు చేసే కంపెనీలకు ఏడాదీ సరిపోకపోవచ్చ’ని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని