ఇళ్ల అమ్మకాల్లో 35 శాతం వృద్ధి

గృహ రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతున్నా, సొంత ఇల్లు సమకూర్చుకోవాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉండటం స్థిరాస్తి రంగానికి కలిసొస్తోంది. ఈ ఏడాది జులై-సెప్టెంబరులో హైదరాబాద్‌లో 10,570 ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయని స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్‌టైగర్‌.కామ్‌ తెలిపింది. క్రితం ఏడాది ఇదేకాలంలో 7,910 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Published : 30 Sep 2022 03:23 IST

హైదరాబాద్‌పై ప్రాప్‌టైగర్‌.కామ్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: గృహ రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతున్నా, సొంత ఇల్లు సమకూర్చుకోవాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉండటం స్థిరాస్తి రంగానికి కలిసొస్తోంది. ఈ ఏడాది జులై-సెప్టెంబరులో హైదరాబాద్‌లో 10,570 ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయని స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్‌టైగర్‌.కామ్‌ తెలిపింది. క్రితం ఏడాది ఇదేకాలంలో 7,910 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో పోల్చితే ఈసారి 35 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. ఇదే సమయంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో కలిపి 83,220 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏడాది క్రితం ఇదే సమయ రిజిస్ట్రేషన్లు 55,910తో పోలిస్తే ఇది 49 శాతం అధికమని తెలిపింది. ఇళ్ల అమ్మకాలు బాగున్నందున, దానికి తగ్గట్లుగా నిర్మాణాలు బాగా పెరుగుతున్నాయి. సెప్టెంబరు త్రైమాసికంలో 1,04,820 కొత్త ఇళ్లు/ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభమైంది. ఏడాది క్రితం ఇదేకాలం నాటి 65,210 నిర్మాణాలతో పోలిస్తే ఈసారి 61 శాతం వృద్ధి లభిస్తోందని వెల్లడించింది.

కొవిడ్‌ ముందుస్థాయికి స్థిరాస్తి వ్యాపారం: స్థిరాస్తి రంగం దాదాపుగా కొవిడ్‌ మహమ్మారి ముందు స్థాయికి కోలుకున్నట్లు ప్రాప్‌టైగర్‌ వివరించింది. ప్రస్తుత పండగల సీజన్లో కొత్త ఇళ్ల కోసం చూస్తున్న వినియోగదార్ల సంఖ్యా అధికంగా ఉందని, ఈ గిరాకీ వచ్చే త్రైమాసికంలోనూ కొనసాగుతుందని ప్రాప్‌టైగర్‌.కామ్‌ గ్రూపు సీఎఫ్‌ఓ వికాస్‌ వాధ్వాన్‌ పేర్కొన్నారు. గృహ రుణాలపై వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగినట్లు, అయినా దాని ప్రభావం ఇళ్ల డిమాండ్‌పై లేదని వివరించారు.

* దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాల్లో వృద్ధి ముంబయిలో అధికంగా ఉంది. తర్వాతి స్థానాల్లో పుణె, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, దిల్లీ ఎన్‌సీఆర్‌ ఉన్నాయి.

కొత్త నిర్మాణాల్లోనూ: నివాస సముదాయాల ప్రాజెక్టులను రియల్టర్లు అధికంగా ప్రారంభిస్తున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణాల్లో పెరుగుదల కోల్‌కతాలో ఎక్కువగా ఉంది. తదుపరి స్థానాల్లో బెంగళూరు, దిల్లీ ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, చెన్నై ఉన్నాయి. కొత్త ఇళ్లల్ల్లో రూ.1.3 కోట్ల ధర పలికే ఇళ్ల వాటా 32 శాతంగా ఉంది.

* ఇళ్ల ధరలు సగటున 6 % పెరిగాయి. ధరల పెరుగుదల బెంగుళూరులో 9 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం, ముంబయిలో 3 శాతంగా ఉంది.

* దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అమ్ముడు కాని ఇళ్ల సంఖ్య 7,85,260 గా ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని