+568 నుంచి -188 పాయింట్లకు

వరుసగా ఏడో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధాన నిర్ణయాలు శుక్రవారం వెలువడనుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటించడమే ఇందుకు కారణం. సెప్టెంబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియడంతో, సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

Published : 30 Sep 2022 03:20 IST

ఏడో రోజూ కొనసాగిన అమ్మకాలు

సమీక్ష

వరుసగా ఏడో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధాన నిర్ణయాలు శుక్రవారం వెలువడనుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటించడమే ఇందుకు కారణం. సెప్టెంబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియడంతో, సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 568 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌, చివరకు 188 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 20 పైసలు పెరిగి 81.73  వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 0.45 శాతం తగ్గి 88.92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌ నష్టపోగా, సియోల్‌, టోక్యో లాభపడ్డాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో కదలాడాయి.

సెన్సెక్స్‌ ఉదయం 56,997.90 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ.. 57,166.14 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. అనంతరం అమ్మకాల ఒత్తిడితో ఆరంభ లాభాలు పొగొట్టుకుని, ఒకదశలో 56,314.05 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 188.32 పాయింట్ల నష్టంతో 56,409.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం       40.50 పాయింట్లు తగ్గి 16,818.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,788.60- 17,026.05 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 డీలాపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 5.22%, టెక్‌ మహీంద్రా 1.86%, టైటన్‌ 1.69%, కోటక్‌ బ్యాంక్‌ 1.52%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.36%, టీసీఎస్‌ 1.32%, విప్రో 1.14%, మారుతీ 1.09%, ఎల్‌ అండ్‌ టీ 1% మేర నష్టపోయాయి. ఐటీసీ 2.51%, డాక్టర్‌ రెడ్డీస్‌ 2.16%, టాటా స్టీల్‌ 1.68%, సన్‌ఫార్మా  1.38%, ఎం అండ్‌ ఎం 1.13%, ఎన్‌టీపీసీ 0.92% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో యుటిలిటీస్‌ 1.38%, విద్యుత్‌ 1.30%, ఐటీ  0.60%, వినియోగ 0.47%, టెక్‌ 0.34% పడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, ఎఫ్‌ఎమ్‌సీజీ, స్థిరాస్తి, కమొడిటీస్‌, పరిశ్రమలు రాణించాయి.  

* రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర-పవన విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రకటించింది. ఈ ప్లాంట్‌కు 600 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి, 150 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఈ ప్లాంట్‌కు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ఉందని, 25 ఏళ్ల పాటు కిలోవాట్‌ను రూ.2.69 చొప్పున ఆ సంస్థ కొనుగోలు చేయనుందని అదానీ గ్రీన్‌ తెలిపింది.

* ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఆరు లేన్ల కొత్త గంగా ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్ట్‌ కోసం అనుబంధ సంస్థలు రూ.10,238 కోట్ల నిధులు సమీకరించినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది.

2020 కనిష్ఠాలకు అమెరికా మార్కెట్లు: మాంద్యం భయాలతో అమెరికా మార్కెట్లు కుదేలవుతున్నాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.45 గంటలకు డోజోన్స్‌ 600 పాయింట్లు, ఎస్‌ అండ్‌ పీ 100 పాయింట్లు, నాస్‌డాక్‌ 400 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. 2020 తర్వాత ఎస్‌ అండ్‌ పీ సూచీ కనిష్ఠ స్థాయిలో కదలాడుతోంది. బాండు రాబడులు పెరగడంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని