సంక్షిప్త వార్తలు

సహజ వాయువు (గ్యాస్‌) ధరలు 40 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో, మన దగ్గరా గ్యాస్‌ ధరను పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. 

Published : 01 Oct 2022 02:23 IST

40% పెరిగిన గ్యాస్‌ ధరలు

దిల్లీ: సహజ వాయువు (గ్యాస్‌) ధరలు 40 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో, మన దగ్గరా గ్యాస్‌ ధరను పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ ధరను ప్రస్తుత 6.1 డాలర్ల (ఒక మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌-ఎమ్‌ఎమ్‌బీటీయూ) నుంచి 8.57 డాలర్లకు పెంచుతున్నట్లు చమురు శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌(పీపీఏసీ) ప్రకటించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌-బీపీ సంస్థలు అతిలోతైన కేజీ క్షేత్రంలోని డి6 బ్లాక్‌ నుంచి ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ ధరను ఒక్కో ఎమ్‌ఎమ్‌బీటీయూకు 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచారు. సహజ వాయువును ఎరువుల తయారీలో, విద్యుదుత్పత్తిలో వాడతారు. వాహనాల ఇంధనంగా వాడుతున్న సీఎన్‌జీ తయారీలోనూ; ఇళ్లకు గొట్టాల ద్వారా సరఫరా చేసే వంట గ్యాస్‌(పీఎన్‌జీ) తయారీలోనూ ఉపయోగిస్తారు. గ్యాస్‌ ధరల పెంపువల్ల సీఎన్‌జీ, పీఎన్‌జీ రేట్లు పెరగొచ్చు. గత ఏడాది కాలంలో ఇవి 70 శాతం పెరిగాయి.


ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు 2025-26 కల్లా 120 బి. డాలర్లకు

కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌

చెన్నై: మన దేశం నుంచి ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు 2025-26 కల్లా 120 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9.60 లక్షల కోట్ల)కు చేరొచ్చని కేంద్ర ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సహాయ మంత్రి మంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. దీనిని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని వివరించారు. శుక్రవారం సింగపెరుమాల్‌కోయిల్‌లో రూ.1100 కోట్లతో నిర్మించిన పెగాట్రాన్‌ టెక్నాలజీ ఇండియా తయారీ యూనిట్‌ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘2014 వరకు మన దేశం నుంచి మొబైల్‌ ఎగుమతులు లేవు. ఇపుడు రూ.50,000 కోట్ల విలువైన ఐ ఫోన్లు, శాంసంగ్‌ ఫోన్లతో పాటు ఇతర కంపెనీల ఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. ఇదే సమయంలో దేశీయ వినియోగం కోసం 90 శాతం దిగుమతుల నుంచి 97 శాతం దేశీయంగా తయారీకి ప్రయాణం సాగింద’ని ఆయన తెలిపారు. ‘2025-26 కల్లా 16-20 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.28-1.60 లక్షల కోట్ల) విలువైన మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేయాలి. అప్పటికి ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతుల విలువ 120 బి. డాలర్లకు చేరుకుంటుంది. అంటే ఆరు రెట్లు పెరుగుతుంద’ని తెలిపారు.


బ్రిటన్, అమెరికాలకు మరో 20 విమానాలు: ఎయిరిండియా

దిల్లీ: బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్, లండన్, అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలకు వారంలో మరో 20 విమాన సర్వీసులను 3 నెలల్లో ప్రారంభిస్తామని ఎయిరిండియా ప్రకటించింది. వారంలో అదనంగా బర్మింగ్‌హామ్‌కు 5; లండన్‌కు 9, శాన్‌ఫ్రాన్సిస్కోకు 6 చొప్పున సర్వీసులు నడపనున్నట్లు సంస్థ తెలిపింది. దీంతో ప్రతి వారం ప్రయాణికులకు అదనంగా 5,000 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అక్టోబరు నుంచి డిసెంబరులోగా ఈ అదనపు సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపింది.


శీతాకాల సమావేశాల్లో సులభతర వాణిజ్య బిల్లు

దిల్లీ: సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు, కొన్ని అంశాలను నేరరహితంగా చేసే చట్టంపై పనిచేస్తున్నామని, వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఇందుకు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయల్‌ పేర్కొన్నారు. నిబంధనల తగ్గింపు, అవసరం లేని సెక్షన్‌లను నేరరహితం చేయడంపై స్పందనలు తెలియజేయాల్సిందిగా పరిశ్రమ వర్గాలను కోరారు. పీహెచ్‌డీసీసీఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికే పలు అంశాలను నేరరహితంగా మార్చిందని గుర్తుచేశారు.


ఉత్పత్తులపై వీడియో వివరణ: అమెజాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగదారులు ఉత్పత్తులను ఎంచుకోవడాన్ని మరింత సరళీకృతం చేసేందుకు వీడియోల ద్వారా వివరణలు అందిస్తున్నట్లు అమెజాన్‌ ఇండియా వెల్లడించింది. ఇందుకోసం అమెజాన్‌ లైవ్‌ను ప్రారంభిస్తున్నట్లు అమెజాన్‌ ఇండియా కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తోట ఇక్కడ చెప్పారు. పలు రకాల బ్రాండ్లు, ఉత్పత్తులపై పూర్తి వివరణలు ఇందులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లుగా వ్యవహరిస్తున్న వారు, అమెజాన్‌ లైవ్‌లో ఆయా ఉత్పత్తులపై పూర్తి వివరాలను తెలియజేస్తారని చెప్పారు.


అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీలుగా 16 పెద్ద ఆర్థిక సంస్థలు: ఆర్‌బీఐ

ముంబయి: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫైనాన్స్‌ సహా 16 పెద్ద బ్యాంకింగేత ఆర్థిక సంస్థలను అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీలుగా ఆర్‌బీఐ వర్గీకరించింది. గతేడాది అక్టోబరులో ఎన్‌బీఎఫ్‌సీల నియంత్రణలకు ఆర్‌బీఐ నియామవళి జారీ చేసింది. పరిమాణం, కార్యకలాపాలు, నష్టభయం ఆధారంగా ఎన్‌బీఎఫ్‌సీలను బేస్, మిడిల్, అప్పర్, టాప్‌ లేయర్లుగా విభజించింది. ప్రస్తుతం అప్పర్‌ లేయర్‌ జాబితాలో ఎల్‌ఐసీ హౌసింగ్, బజాజ్‌ ఫైనాన్స్, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్, టాటా సన్స్, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్, పిరమాల్‌ క్యాపిటల్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్, సంఘ్వీ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్, పీఎన్‌బీ హౌసింగ్, టాటా క్యాపిటల్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్, ముత్తూట్‌ ఫైనాన్స్, బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి.


ఏప్రిల్‌ 1 నుంచి రెండంచెల ధ్రువీకరణ

దిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లలో సబ్‌స్క్రిప్షన్‌ లావాదేవీల కోసం రెండంచెల ధ్రువీకరణకు గడువు పొడిగిస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తెలిపింది. మదుపర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త నియమావళి 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని సెబీ పేర్కొంది. ఆన్‌లైన్‌లో రెడెమ్షన్‌ లావాదేవీలకు, ఆఫ్‌లైన్‌ లావాదేవీలకు సంతకం విధానానికి అన్ని అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు రెండంచెల ధ్రువీకరణ అమలు చేయాల్సి ఉంది.


బెంగళూరులో ఓఎన్‌డీసీ సేవలు

దిల్లీ: రాబోయే వారాల్లో ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) ప్లాట్‌ఫామ్‌పైకి మరిన్ని యాప్‌లు చేరనున్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓఎన్‌డీసీపై కొనుగోలుదార్లు, విక్రేతలను విస్తరించడంలో ఇది భాగమని వెల్లడించింది. ఇ-కామర్స్‌ దిగ్గజాల ఆధిపత్యాన్ని తగ్గించి, చిన్న రిటైలర్లకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం ఓఎన్‌డీసీ ని తీసుకొచ్చింది. శుక్రవారం బీటా టెస్టింగ్‌లో భాగంగా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఇది అందుబాటులోకి వచ్చింది. కొన్ని వ్యవస్థలు, టెక్నాలజీలను పరీక్షించే ప్రక్రియలో ఉన్నామని, రాబోయే వారాల్లో 20కు పైగా యాప్‌లు ఈ ప్లాట్‌ఫామ్‌పైకి రానున్నట్లు డీపీఐఐటీ అదనపు కార్యదర్శి అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. బెంగళూరులో ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లోని కొనుగోలుదారు యాప్‌ల ద్వారా గ్రోసరీ, రెస్టారెంట్‌ విభాగాలపై వినియోగదారులు తమ ఆర్డర్లు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం కొనుగోలుదారు యాప్‌లుగా మైస్టోర్, పేటీఎం, స్పైస్‌మనీ అందుబాటులో ఉన్నాయి.


రూ.5,551 కోట్ల షియోమీ డిపాజిట్ల జప్తు

దిల్లీ: సెల్‌ఫోన్ల తయారీ చైనా కంపెనీ షియోమీకి చెందిన రూ.5,551 కోట్ల విలువైన డిపాజిట్లను జప్తు చేయడానికి విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఉన్న కాంపిటెంట్‌ అథారిటీ ఆమోదం తెలిపిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొంది. షియోమీ గ్రూప్‌ కంపెనీ ఒకదానితో పాటు తమ కార్యకలాపాలతో సంబంధం లేని, అమెరికాకు చెందిన రెండు కంపెనీలకు రూ.5,551.27 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని రాయల్టీ రూపంలో కంపెనీ బదిలీ చేసిందని.. ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఈడీ ఆరోపించింది. భారత్‌లో ఇప్పటిదాకా ఈడీ జప్తు చేసిన అత్యధిక మొత్తం ఇదేనని వివరించింది.


హెరిటేజ్‌ ఫుడ్స్‌ రైట్స్‌ ఇష్యూ

హైదరాబాద్‌: హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించింది. ప్రస్తుత వాటాదార్లకు రూ. 5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు 1:1 నిష్పత్తిలో ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. ఇందుకు రికార్డు తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఈ ఇష్యూలో మొత్తం 4.63 కోట్ల షేర్లను జారీ చేసి, రూ.23.19 కోట్లు సమీకరించనుంది. ఈ ఇష్యూ అనంతరం కంపెనీ ఈక్విటీ షేర్లు ప్రస్తుత 4.63 కోట్ల నుంచి రెట్టింపు కానున్నాయి. శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు 7.96% లాభంతో రూ.335.80 వద్ద స్థిరపడింది.

ఇన్ఫీ ఫలితాలతో పాటు షేర్ల బైబ్యాక్‌ కూడా!: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(జులై-సెప్టెంబరు) ఫలితాలతో పాటు, షేర్ల తిరిగి కొనుగోలు(బైబ్యాక్‌)ను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ప్రకటించొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ అంచనా వేస్తోంది. కంపెనీ ఫలితాలు అక్టోబరు 13న వెల్లడి కానున్నాయి. త్రైమాసికం వారీగా ఇన్ఫోసిస్‌ ఆదాయ వృద్ధి 4% మేర నమోదు చేయొచ్చని తెలిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని