ఐపీఓ నిబంధనలు కఠినతరం

పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ) నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. గత లావాదేవీలు, నిధుల సమీకరణ కార్యకలాపాల ఆధారంగా ఆఫర్‌ ధరను కంపెనీలు వెల్లడించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.

Updated : 01 Oct 2022 02:25 IST

ముంబయి: పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ) నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. గత లావాదేవీలు, నిధుల సమీకరణ కార్యకలాపాల ఆధారంగా ఆఫర్‌ ధరను కంపెనీలు వెల్లడించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. భవిష్యత్‌లో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే పక్షంలో ఆ విషయాన్ని ‘ప్రీ-ఫైలింగ్‌’ పత్రాల ద్వారా తెలిపే ప్రతిపాదనకూ సెబీ బోర్డు అనుమతినిచ్చింది. దీని కింద ప్రజలకు సునిశిత సమాచారాన్ని తెలపాల్సిన అవసరం ఉండదు. కేవలం సెబీ, ఎక్స్ఛేంజీలకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సెబీ ప్రాథమిక పరిశీలన అనంతరం వీటిని ప్రజల(పెట్టుబడుదార్ల) ముందుకు తీసుకొస్తారు. పెట్టుబడుల నిర్ణయానికి కనీసం 21 రోజుల సమయం వీరికి ఉండేలా చూస్తామని సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రత్నామ్నాయ ‘ప్రీ-ఫైలింగ్‌’ విధానంతో పాటు ప్రస్తుతం ఉన్న పత్రాల ప్రక్రియ కూడా కొనసాగుతుందని తెలిపింది.

స్వతంత్ర డైరెక్టర్ల నియామాకాలు, తొలగింపులు సులువిక: కంపెనీల బోర్డుల్లో స్వతంత్ర డైరెక్టర్ల నియామకం, తొలగింపునకు సంబంధించిన కొత్త విధానానికి సెబీ ఆమోదం తెలిపింది. ఈ చర్య వల్ల స్వతంత్ర డైరెక్టర్ల నియామకం లేదా తొలగింపు ప్రక్రియ సులువు కానుంది. ఒక్కసారి నిబంధనలకు సవరణలు జరిగితే.. సాధారణ తీర్మానం; మైనారిటీ వాటాదార్ల మెజారిటీ అనే రెండు అంశాల ద్వారా స్వతంత్ర డైరెక్టర్ల నియామకం, తొలగింపు జరుగుతుంది. ప్రస్తుతం నియామకం, పునర్నియామకం లేదా తొలగింపునకు ప్రత్యేక తీర్మానాన్ని చేపడుతున్నారు. కాగా, తొలిసారి(ఫస్ట్‌ టర్మ్‌) జరిపే నియామకం, తొలగింపునకు ప్రత్యామ్నాయ పద్ధతికి సెబీ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. దీని కింద ప్రత్యేక తీర్మానంలో సరైన మెజారిటీ లభించని పక్షంలో సాధారణ తీర్మానం, మైనారిటీ వాటాదార్ల మెజారిటీకి వెళ్లి నియామకం/తొలగింపులను చేపట్టవచ్చన్నమాట.

పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు నిబంధనలు: ఒక ఫండ్‌లో పోర్ట్‌ఫోలియో మేనేజర్ల పాత్ర, బాధ్యతలు; అదే సమయంలో క్లయింట్‌ ఫండ్‌లు, సెక్యూరిటీల నిర్వహణలో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విషయాలను తెలుపుతూ రాతపూర్వకంగా ఇవ్వాలంటూ పోర్ట్‌ఫోలియో మేనేజర్లను సెబీ కోరింది. ప్రతి క్లయింటునకు చెందిన ఫండ్లు, సెక్యూరిటీలను తమ సొంత ఫండ్‌లు, సెక్యూరిటీలకు దూరంగా ఉంచాలన్న నిబంధనను సైతం విధించింది.

ఆరు నెలల పాటు నిషేధం: మహంకాల్‌ క్యాపిటల్, ఆ సంస్థ యజమాని అజయ్‌ఠాకూర్, మనీ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్, ఆ సంస్థ యజమాని విజయ్‌ ఠాకూర్‌లు సెక్యూరిటీ మార్కెట్లలో పాలుపంచుకోకుండా ఆరు నెలల పాటు నిషేధం విధిస్తున్నట్లు సెబీ ప్రకటించింది. అనుమతులు లేకుండా పెట్టుబడుల సలహా సేవలను అందించినందుకు ఈ రెండు సంస్థలు, ఇద్దరు వ్యక్తులపై ఈ చర్య తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని