2023 చివరికి ప్రతి గ్రామానికీ

వచ్చే ఏడాది చివరికల్లా దేశంలోని ప్రతి గ్రామానికీ 5జీ సేవలు అందిస్తామని రిలయన్స్‌ జియో మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. ప్రపంచంలోనే అధిక నాణ్యత, అందుబాటు ధరల్లో 5జీ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తామని, శనివారం ఇక్కడ ప్రారంభమైన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ)లో ఆయన ప్రకటించారు.

Published : 02 Oct 2022 02:21 IST

ప్రపంచంలోనే అధిక నాణ్యత, అందుబాటు ధరల్లో

సామాన్యులకూ నాణ్యమైన విద్య, వైద్యానికి దోహదం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ

దిల్లీ: వచ్చే ఏడాది చివరికల్లా దేశంలోని ప్రతి గ్రామానికీ 5జీ సేవలు అందిస్తామని రిలయన్స్‌ జియో మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. ప్రపంచంలోనే అధిక నాణ్యత, అందుబాటు ధరల్లో 5జీ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తామని, శనివారం ఇక్కడ ప్రారంభమైన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ)లో ఆయన ప్రకటించారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా రిలయన్స్‌ 5జీ వ్యవస్థల్లో చాలావరకు దేశీయంగానే అభివృద్ధి చేశాం. 5జీ, 5జీ ఆధారిత డిజిటల్‌ పరిష్కారాలను అనుసంధానించి సామాన్యులకూ నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి అందించగలం. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులను ఎక్కువ ఖర్చు లేకుండానే స్మార్ట్‌ ఆసుపత్రులుగా మార్చొచ్చు. అత్యుత్తమ వైద్యుల సేవలను దేశంలో ఎక్కడినుంచైనా డిజిటల్‌లో పొందొచ్చు. రోగ నిర్థారణ పరీక్షల్లో వేగం, కచ్చితత్వం మెరుగవుతాయి. చికిత్స నిర్ణయాల్లో వేగం పెరుగుతుంది. ఫలితంగా మారుమూల ప్రాంతాల వారికీ అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయం, సేవలు, వాణిజ్యం, పరిశ్రమలు, అసంఘటిత రంగాలు, రవాణా, ఇంధన మౌలిక సదుపాయాల్లో డిజిటలీకరణ, ఇంటెలిజెంట్‌ డేటా ద్వారా పట్టణ, గ్రామీణ భారతం మధ్య అంతరాన్ని తగ్గించొచ్చు’ అని ముకేశ్‌ తెలిపారు.

లక్షల ఉద్యోగాలు.. ఎగుమతుల పెంపునకు కృత్రిమమేధ: ‘యువ జనాభా, డిజిటల్‌ టెక్నాలజీల సమ్మేళనం ద్వారా ప్రపంచంలోనే అగ్రగామి డిజిటల్‌ సొసైటీగా భారత్‌ అవతరిస్తుంది. ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధను తీసుకురావడం ద్వారా ప్రపంచంలోనే మేధోసంపత్తికి రాజధానిగా మారుతుంది. దేశంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఇది దోహదం చేస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెరుగుతారు. లక్షల కొద్దీ ఉద్యోగాల సృష్టి జరుగుతుంద’ని అంబానీ పేర్కొన్నారు. ‘ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 40 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చడంలో ఇది ఎంతో కీలకం. తలసరి ఆదాయం 2 వేల డాలర్ల నుంచి 20 వేల డాలర్లకు పెంచడం ద్వారానే ఇది సాధ్యం. 5జీని కోరిన కోరికలు తీర్చే కామధేనువుతో పోల్చడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు’ అని అన్నారు.

దీపావళి నాటికి..

దీపావళి నాటికి దేశంలో 5జీ సేవలను కొన్ని నగరాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ముకేశ్‌ స్పష్టం చేశారు. టారిఫ్‌లు ‘అందుబాటు ధర’లో ఉంటాయని వెల్లడించారు. ప్రపంచంలోనే తక్కువ ధరకు 5జీ సేవలను అందించేందుకు మన టెలికాం రంగం సమష్ఠిగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.


వొడాఫోన్‌ ఐడియా నుంచి త్వరలో

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పటిష్ఠంగా ఉన్న వొడాఫోన్‌ ఐడియా నుంచి త్వరలోనే 5జీ సేవలూ అందుబాటులోకి వస్తాయని ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా తెలిపారు. ఎప్పటిలోగా ప్రారంభిస్తామనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పలేదు. వొడాఫోన్‌ గ్రూపునకు అంతర్జాతీయంగా ఉన్న అనుభవం.. దేశీయంగా 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించడంలో తమకు ఎంతో తోడ్పడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మాకు దాదాపు 24 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఇందులో 50 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల వారు. మా నెట్‌వర్క్‌ను క్రమంగా 5జీకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. భారతీయ సంస్థలు, వినియోగదారులు కొత్త సేవలను ఎలా వినియోగిస్తున్నారో పరిశీలించాక, కొత్త నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తాం’ అని తెలిపారు. టెలికాం రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని