సంక్షిప్త వార్తలు

తన డ్రీమ్‌లైనర్‌ విమానాల్లో లైవ్‌ టీవీ ఛానల్‌ సేవలను ‘విస్తారా’ ప్రారంభించింది. వచ్చే కొద్ది నెలల్లో ఇతర విమానాల్లోనూ తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కంపెనీకి 53 విమానాలుండగా అందులో రెండు బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్లు ఉన్నాయి.

Published : 03 Oct 2022 02:18 IST

విస్తారా విమానాల్లో లైవ్‌ టీవీ ఛానళ్లు

దిల్లీ: తన డ్రీమ్‌లైనర్‌ విమానాల్లో లైవ్‌ టీవీ ఛానల్‌ సేవలను ‘విస్తారా’ ప్రారంభించింది. వచ్చే కొద్ది నెలల్లో ఇతర విమానాల్లోనూ తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కంపెనీకి 53 విమానాలుండగా అందులో రెండు బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్లు ఉన్నాయి. ‘మా బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్‌ విమానాల్లో లైవ్‌ టీవీను తీసుకొచ్చాం. రెండు స్పోర్ట్స్‌ ఛానళ్లు, మూడు వార్తా ఛానళ్లు అందుబాటులో ఉంటాయ’ని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ విమానాలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్నాయి.


పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు పెరిగాయ్‌

దిల్లీ: పండగల సీజన్‌ ప్రారంభం కావడంతో సెప్టెంబరులో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో వృద్ధి నమోదైంది. రుతు పవనాలు చివరిదశకు చేరుకోవడం కూడా గిరాకీ పెరగడానికి దోహదపడింది. సెప్టెంబరులో పెట్రోల్‌ విక్రయాలు 13.2 శాతం పెరిగి 2.65 బిలియన్‌ టన్నులకు చేరాయి. ఏడాది క్రితం సెప్టెంబరులో విక్రయాలు 20.7 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. 2020 సెప్టెంబరుతో పోలిస్తే విక్రయాలు 20.7 శాతం, 2019 సెప్టెంబరుతో పోలిస్తే 23.3 శాతం వృద్ధి చెందాయి. ఇక డీజిల్‌ విక్రయాలు సెప్టెంబరులో 22.6 శాతం వృద్ధితో 5.99 మి.టన్నులకు చేరాయి. విమాన ఇంధన గిరాకీ 41.7 శాతం పెరిగి 5,44,700 టన్నులకు చేరింది. వంట గ్యాస్‌ విక్రయాలు 5.4 శాతం పెరిగి 2.48 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి.


విద్యుత్‌ ఎస్‌యూవీలకూ ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ సాంకేతికత
టాటా మోటార్స్‌

దిల్లీ: విద్యుత్‌ వెర్షన్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనాలకూ (ఎస్‌యూవీలు) ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ సాంకేతికతను పరిచయం చేసేందుకు చూస్తున్నామని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాల బిజినెస్‌ హెడ్‌ శైలేష్‌ చంద్ర వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెక్సాన్‌, హ్యారియర్‌, సఫారీలతో పాటు ఏ విద్యుత్‌ ఎస్‌యూవీలోనూ ఈ తరహా సాంకేతికతను వినియోగించలేదని పేర్కొన్నారు. 2025 నాటికి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 10 కొత్త మోడల్‌ విద్యుత్‌ కార్లు ఉండేలా చూసుకుంటామని తెలిపారు. పోటీ సంస్థలైన ఎం అండ్‌ ఎం తమ ఎక్స్‌యూవీ 700, స్కార్పియో-ఎన్‌, థార్‌, ఆల్ట్రాస్‌ జీ4 మోడళ్లలో ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ సాంకేతికతను వినియోగిస్తోంది. మారుతీ సుజుకీ కూడా ఇటీవల విడుదల చేసిన మధ్యస్థాయి ఎస్‌యూవీ గ్రాండ్‌ విటారాలో ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ (ఏడబ్ల్యూడీ) సాంకేతికతను వినియోగించింది.


కర్ణాటక బ్యాంక్‌ ‘కేబీఎల్‌ ఉత్సవ్‌’

మంగళూరు: ప్రైవేట్‌ రంగంలోని కర్ణాటక బ్యాంక్‌ ‘కేబీఎల్‌ ఉత్సవ్‌ 2022-23’ పేరిట గృహ, కారు, పసిడి రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. పండగ సీజన్‌లో ఖాతాదార్ల గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31 వరకు రుణాలు అందించబోతున్నట్లు తెలిపింది. డిజిటల్‌ బ్యాంకింగ్‌తో పాటు తమ 880 శాఖల ద్వారా ఈ ప్రత్యేక రుణ ఆఫర్లు పొందవచ్చని ప్రకటనలో తెలిపింది. కేబీఎల్‌ ఉత్సవ్‌లో భాగంగా ఆకర్షణీయ వడ్డీ రేట్లకు రుణాలు అందించడమే కాకుండా కారు, పసిడి రుణాలకు ప్రాసెసింగ్‌ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. గృహ రుణాలకు అసలు ప్రాసెసింగ్‌ ఛార్జీని పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించింది.


చమురు-గ్యాస్‌ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టండి
అమెరికా సంస్థలకు భారత్‌ పిలుపు

హూస్టన్‌: దేశీయ చమురు-గ్యాస్‌ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికా దిగ్గజ సంస్థలను భారత్‌ కోరింది. సానుకూల భౌగోళిక పరిస్థితులు, డేటా అందుబాటు, తోడ్పాటు ఇచ్చే విధానాలు, సులభతర వాణిజ్యం వంటివి సానుకూలాంశాలుగా పేర్కొంది. పెట్టుబడిదార్లను ఆకర్షించేందుకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కింద డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌(డీజీహెచ్‌) రెండు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించింది. 50కు పైగా చమురు-గ్యాస్‌ దిగ్గజాలు, ఆర్థిక సంస్థలు, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు, సర్వీస్‌ ప్రొవైడర్లు ఇందులో పాల్గొనగా.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్‌ జైన్‌ కోరారు. అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో భారత్‌ కీలక పాత్ర పోషించనుంది, భారత ఇంధన రంగంలో అపార అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.


సంక్షిప్తాలు

* 5జీ సాంకేతికత కోసం దేశవ్యాప్తంగా 100 ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు.. అందులో కనీసం పన్నెండింటిని విద్యార్థులకు శిక్షణ, ప్రయోగాల నిర్వహణకు వినియోగించనున్నట్లు టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

* యూనిఫైడ్‌ కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) వ్యవస్థను ఏర్పాటు చేయాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ ప్రతిపాదించింది. ఇది అందరు టెలికాం ఆపరేటర్లకు అందుబాటులో ఉంటుందని.. తద్వారా మోసపూరిత కాలర్లను; స్పామర్లను అడ్డుకోవచ్చని ట్రాయ్‌ ఛైర్మన్‌ పీడీ వాఘేలా పేర్కొన్నారు.

* వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.2 శాతానికి పరిమితం కావొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఒక నివేదికలో పేర్కొంది. సాధారణ వర్షాలతో పాటు సరఫరా వ్యవస్థలు సాధారణ స్థాయికి చేరడం; విధానాల పరంగా కఠినత్వం ఉండకపోవడం వంటివి ఇందుకు దోహదం చేస్తాయంటోంది.

* 2024 కల్లా దేశవ్యాప్తంగా 100 స్టోర్లను తెరవనున్నట్లు సైకిల్‌ ప్యూర్‌ అగరబత్తీస్‌ తయారీదారు ఎన్‌ఆర్‌ గ్రూప్‌ పేర్కొంది. ప్రస్తుతం 32 స్టోర్లున్నాయని.. మార్చి 2023 కల్లా ఇవి 50 స్టోర్లకు చేర్చుతామని తెలిపింది.

* భారత్‌లో ఇ-కామర్స్‌కు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌(ఓఎన్‌డీసీ) ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది. చెల్లింపులు, ఆర్డర్లు, రిఫండ్‌లు, రద్దుల వంటి 24 అంశాలపై 31 అక్టోబరులోగా ప్రజలు స్పందన తెలపవచ్చని పేర్కొంది.

* పీవీఆర్‌ షేర్ల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ముగ్గురు వ్యక్తుల(గౌతమ్‌ దత్తా, ఎన్‌సీ గుప్తా, ప్రమోద్‌ అరోరా)పై మొత్తం రూ.6 లక్షల అపరాధ రుసుమును సెబీ విధించింది.

* బ్యాంకు ఖాతాలను గరిష్ఠ స్థాయికి చేర్చడం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను విస్తరించడం వంటి ఆర్థిక సంఘటిత కార్యకలాపాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను అక్టోబరు 15 నుంచి నవంబరు 26 వరకు నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ ట్వీట్‌ చేసింది.

* ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జప్తు చేసిన రూ.5551.27 కోట్లలో 84 శాతానికి పైగా అమెరికాకు చెందిన చిప్‌ కంపెనీ క్వాల్‌కామ్‌కు చేసిన రాయల్టీ చెల్లింపే ఉందని షియోమీ పేర్కొంది. ఫెమా కింద షియోమీకి చెందిన రూ.5551.27 కోట్ల విలువైన డిపాజిట్లను జప్తు చేయడానికి ఈడీ ఆమోదించిన సంగతి తెలిసిందే.


వంట నూనెలపై దిగుమతి సుంకం రాయితీ పొడిగింపు

దిల్లీ: వంట నూనెల దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీని 2023 మార్చి వరకు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దేశీయంగా సరఫరాను పెంచి ధరల్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే మరో 6 నెలల పాటు రాయితీని పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు దిగొస్తున్నాయని, ఫలితంగా దేశీయంగానూ ధరలు అదుపులోకి వస్తున్నాయని పేర్కొంది. తాజా నిర్ణయంతో ముడి, రిఫైన్డ్‌ పామాయిల్‌, ముడి, రిఫైన్డ్‌ సోయాబీన్‌, ముడి, రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ నూనెలపై ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాలు యథాతథంగా  కొనసాగనున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని